logo

ఉపాధ్యాయులున్నా విద్యార్థులేరీ!

కాల్వశ్రీరాంపూర్‌ మండలం చిన్నరాతుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి ఉన్నాడు. రికార్డుల్లో మాత్రం మొత్తం అయిదుగురు విద్యార్థులున్నట్లు చూపుతున్నారు.

Updated : 11 Jul 2024 05:31 IST

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న ప్రవేశాలు
మూతపడే స్థితికి వచ్చినా పట్టింపు కరవు

కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ మండలం చిన్నరాతుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి ఉన్నాడు. రికార్డుల్లో మాత్రం మొత్తం అయిదుగురు విద్యార్థులున్నట్లు చూపుతున్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులను కలిసి పిల్లలను పంపించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల పుస్తకాలు, ఏకరూప దుస్తులు సమకూర్చుకున్నందున ఈసారి సాధ్యం కాదని, వచ్చే ఏడాది ప్రయత్నిస్తామన్న సమాధానం వచ్చింది.

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల ప్రవేశాలు పడిపోతున్నాయి. సుశిక్షితులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటున్నా.. ఉచిత ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు పంపిణీ చేస్తున్నా.. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నా.. సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరుస్తున్నారు. దీంతో విద్యార్థులు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. బడిబాటలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రవేశాలు పెంచాలనే విద్యా శాఖ ఆశయానికి గండి పడుతోంది. సమీపంలోనే బడులున్నా పిల్లలు చేరడం లేదు. దీంతో కొన్ని చోట్ల మూతపడగా మరికొన్ని చోట్ల మూతపడే దశకు చేరాయి.

అధిక సంఖ్య చూపి..

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతుండటం పిల్లలు చేరకపోవడానికి ప్రధాన కారణం. నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న ప్రాంతాలనూ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. చాలా చోట్ల ఉపాధ్యాయులు ఇన్నాళ్లూ విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపి పోస్టును అట్టి పెట్టుకున్నట్లు ఇటీవలి బదిలీల్లో తేటతెల్లమైంది. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు నిరాశే ఎదురవుతోంది. ఆధార్‌ అనుసంధానం, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు అందుబాటులో ఉన్నా వలసలు, ఇతర కారణాలు చెప్పి ఇన్నాళ్లూ తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.

సారు రాకుంటే సెలవే!

జిల్లాలో 92 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఇందులో ఇప్పటికే 38 మూతపడ్డాయి. మిగిలిన 54 బడుల్లో పది లోపే పిల్లలున్నారు. పరిసర ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలున్నప్పటికీ ప్రవేశాలు తీసుకోవడం లేదు. తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేయడంతో ఒక్కొక్కరే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఏదైనా కారణాలతో సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైతే సెలవు ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు ఆయా పాఠశాలల్లో చేర్పించకుండా దూర ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.

ఓదెల: ఓదెల మండలం జీలకుంట ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి ఉన్నాడు. గతేడాది అయిదుగురు ఉండగా నలుగురు పిల్లలు గురుకులాలకు వెళ్లారు. దీంతో ఒక్కడికే ఒక ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తోంది. పాఠశాల పరిధిలో పిల్లలు ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు.
పాలకుర్తి: అంతర్గాం మండలం ఈసంపేట ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది అయిదుగురు పిల్లలుండగా ముగ్గురు వెళ్లిపోయారు. కొత్తగా ఒక్కరూ చేరలేదు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు.

పాలకుర్తి: అంతర్గాం మండలం ఈసంపేట ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది అయిదుగురు పిల్లలుండగా ముగ్గురు వెళ్లిపోయారు. కొత్తగా ఒక్కరూ చేరలేదు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని