logo

Crime News: నేనేం పాపం చేశానమ్మా!

అమ్మా.. ఏడుస్తున్నావా! ఎందుకమ్మా రోదిస్తావ్‌..  నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా?

Updated : 15 Jun 2024 07:28 IST

ఈనాడు, కరీంనగర్‌: అమ్మా.. ఏడుస్తున్నావా! ఎందుకమ్మా రోదిస్తావ్‌..  నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి  పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా?  ఎంత   మంది మాతృమూర్తులకు గర్భ శోకం మిగిల్చినా, ఈ పాడు లోకం మారదమ్మా? ఎన్ని వేల కళ్లు వర్షించినా కామాంధుల్లో మార్పు రాదమ్మా..!     

ఆరేళ్ల ప్రాయంలోనే నాకు నూరేళ్లు నిండటం ఏమిటో! పురిటిలోనే కన్నుమూసినా ఏ మాయదారి రోగమో బలి తీసుకుందని కొన్ని రోజులు బాధపడి మరిచిపోయేదానివేమో. పొట్ట కూటి కోసం ఉన్న ఊరు దాటే క్రమంలో రహదారి ప్రమాదం మింగేసినా ‘ఆయుష్షు ఇంతే’ అనుకునేదానివి కదమ్మా. అంతా బాగుండి.. అప్పటిదాకా ఆడిపాడిన నేను నిశీధిలో కనుమరుగై పోవడానికి ఎవరిదమ్మా పాపం.. ఎందుకమ్మా నాకీ శాపం.. అందుకే ఎవరినీ ఏమీ అనలేక ఆ దేవుడినే నిందిస్తున్న. మానవ విలువలు మాయమై పోతున్న లోకంలో ఆడబిడ్డగా నన్నెందుకు పుట్టించావని నిలదీస్తున్న. 

నవ మాసాల పాటు నీ కడుపులో ఎంతో పదిలంగా ఉన్నా.. భూమి మీద పడిన నాటి నుంచి కాలు కింద పెట్టనివ్వని నీ అనురాగంతో ఉక్కిరిబిక్కిరైన. అమ్మ పక్కన ఉందనే ధీమాతోనే కదమ్మా హాయిగా నిద్దరోయాను. మా పిల్లల్లాగా అందరి మనసులూ స్వచ్ఛమైనవేనని అనుకున్నా. మనుషుల్లోనూ మృగాలుంటాయని తెలియదమ్మా.. చిమ్మచీకట్లో విలవిలలాడుతున్నా.. గిలగిలా కొట్టుకుంటున్నా కరిగిపోలేదమ్మా ఆ పాషాణ హృదయం. నాకు తెలియకడుగుతున్నా.. నేనేం పాపం చేశానమ్మా? ఆడపిల్లగా పుట్టడమే నా శాపమా! ఇంత క్రూరమైన చావు ఎవరికీ రావొద్దమ్మా! 

అమ్మా.. నిజంగా ఇప్పుడనిపిస్తుంది.. ఈ మానవ జన్మకు బదులు పక్షిగా పుట్టి ఉంటే ఇంకొన్నాళ్లు హాయిగా భూమ్మీద విహరించేదాన్నేమో! ఏదైనా జంతువు దాడి చేయడానికొచ్చినా ఎగురుకుంటూ పోయేదాన్ని కదమ్మా. అయినా నా ఒక్కదానికే కాదమ్మా.. ఇంతకుముందు ఎంతో మంది నాలాంటి అభాగ్యులు బలైపోలేదా? అప్పుడూ ఈ సమాజం ఏడ్చింది.. అంతకన్నా చేసేదేం లేదు కదా! కామంతో కళ్లు మూసుకుపోయి, పశువుల కన్నా హీనంగా ప్రవర్తించే మనుషుల్లో ఎప్పుడొస్తుందమ్మా మార్పు? 

పసి మొగ్గలకు.. బడికెళ్లే బాలికలకు.. కళాశాలకు వెళ్లే అక్కలకు.. ఇంట్లో ఉండే అమ్మలకు.. ఇలా ఏ వయసు వారికీ రక్షణ లేని ఈ లోకంలో మార్పు ఎప్పుడు వస్తుందమ్మా..? వావి వరసలు మరచిపోయి, కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించే వారున్నంత కాలం నీలాంటి అమ్మలకు ఈ శోకం తప్పదమ్మా. ఓవైపు మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నా చావుతోనైనా ఈ లోకం మారాలి.. నీలాంటి వేదన మరో తల్లికి రాకుండా ఉంటే బాగుండు కదమ్మా..! చివరగా ఆ దేవుడు కనిపిస్తే ఒక మాట అడగాలనుందమ్మా.. ఆడ పిల్లలపై అఘాయిత్యాలు లేని గ్రహంలో పుట్టించమని.. 

(సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో కామాంధుడి చేతిలో బలైన చిన్నారి ఆత్మఘోష)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని