logo

Darshan Gang: నరకం చూపి కడతేర్చారు.. దర్శన్‌ ముఠా నేరతీవ్రత

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) హత్య కేసులో నిందితుల విచారణ ఒక కొలిక్కి వచ్చింది. నిందితులను గురువారం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు.

Updated : 20 Jun 2024 08:02 IST

 దర్శన్‌ విచారణ వేదిక.. అన్నపూర్ణేశ్వరి నగర ఠాణా వద్ద బందోబస్తు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) హత్య కేసులో నిందితుల విచారణ ఒక కొలిక్కి వచ్చింది. నిందితులను గురువారం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. అవసరానికి అనుగుణంగా నిందితులను మరోసారి అదుపులోనికి తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ గిరీశ్‌ తెలిపారు. రేణుకాస్వామి జీవించి ఉండగానే నిందితులు నరకాన్ని చూపించారు. అతనితో బలవంతంగా మాంసాన్ని తినిపించడం, విద్యుత్తు షాక్‌ కొట్టించడం, మర్మావయవాలు పూర్తిగా దెబ్బతినేలా కొట్టి.. హింసించారు. ఆయన సెల్‌ఫోన్‌ను నిందితులు ఓ మురుగుకాలువలో పారేశారు. అది దొరికితే మరికొన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.

దర్శన్‌పై పలువురు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్శన్‌ అభిమానులు తనను బెదిరిస్తున్నారని, అశ్లీల సందేశాలు పంపిస్తున్నారని నట, దర్శకుడు ప్రథమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తనకు ప్రాణహాని తలపెడతానని అందరి ముందు ఆయన బెదిరించాడని ‘రాబర్ట్‌’ చిత్ర నిర్మాత ఉమాపతి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు పాల్పడుతున్న దర్శన్‌ అభిమానులపైనా కేసులు నమోదు చేసి, విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పోలీసుల ముందు బుధవారం విచారణకు హాజరై.. హత్య జరిగిన రోజు దర్శన్‌ తీరు, ఇంటికి వచ్చి ఏమేమి చేశారో ఆమె వివరించారు. తన కుటుంబానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయవద్దని ప్రచార మాధ్యమాల ప్రతినిధులను ఆమె కోరారు. పోలీసు అధికారులు వివరాలను ప్రకటించకనే కొన్ని టీవీ ఛానెళ్లు తీర్పులు ఇచ్చేస్తున్నాయని ఆక్రోశించారు. హతుడు రేణుకాస్వామి, అతని కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ భర్తీ చేయలేరని విచారం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటానని, ఇప్పటికే న్యాయస్థానం నుంచి ఒక స్టే ఆర్డరు తీసుకువచ్చానని ఆమె తెలిపారు.

దర్శన్‌ భార్య దొడ్డమనసు

బెంగళూరు (యశ్వంతపుర): హత్య కేసులో అన్నపూణేశ్వరినగర పోలీసుఠాణా కస్టడీలో ఉన్న సినీనటుడు దర్శన్‌ను పరామర్శించేందుకు తొలిసారిగా ఆయన భార్య విజయలక్ష్మీ బుధవారం ముందుకొచ్చారు. ఆమె ఉదయమే పోలీసుఠాణాకు చేరుకోవడం ప్రస్తావనార్హం. ఆయన అరెస్టైన తొమ్మిది రోజులకు ఆమె స్పందించారు. ఇప్పటికే ఆమె తన పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దర్శన్‌ చిత్రాలను తొలగించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం.. భర్తతో మాట్లాడేందుకు పోలీసు అధికారుల అనుమతి తీసుకున్నారు. ఆయనకు జామీను సాధించడానికి ప్రముఖ న్యాయవాదులు రంగనాథ్‌రెడ్డి, అనిల్‌బాబును నియమించారు. విజయలక్ష్మీ- దర్శన్‌ 2003లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఓ కుమారుడున్నాడు. 2011లో విజయలక్ష్మీపై దర్శన్‌ దాడి చేసి గాయపరిచాక.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇద్దరూ రాజీపడి కాపురం చేశారు. ఇదే క్రమంలోనే ఆయన నటి పవిత్రాగౌడ ప్రేమలో పడ్డా.. భార్యాభర్తల గొడవలు అధికమయ్యాయి. ఆ గొడవలన్నీ మరచి ఆమె భర్త కోసం ‘న్యాయ’ సహాయం అందించడం ప్రస్తావనార్హం.

ప్రసన్నకుమార్‌ను మార్చం..

బెంగళూరు (మల్లేశ్వరం) : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రసన్నకుమార్‌ను మార్చాలని ఎటువంటి ఒత్తిళ్లూ రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఆయనను మార్చాలని ఎవరైనా ఒత్తిడి తీసుకువచ్చినా, వారి మాటను ఆలకించనని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను మార్చాలని తనను ఇప్పటి వరకు ఎవరూ కోరలేదన్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులందరికీ పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. హోం మంత్రి, అధికారులు, న్యాయకోవిదుల సిఫార్సులకు అనుగుణంగా ఎస్‌పీపీని ప్రభుత్వం ఎంపిక చేసిందని వివరించారు.

118 మంది సాక్షుల విచారణ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య సంఘటనకు సంబంధించి సినీనటుడు దర్శన్, ఆయన ఆప్తురాలు పవిత్రాగౌడ విచారణను పోలీసులు తీవ్రం చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 118 మంది సాక్షులను సేకరించారు. కొందరిని ఎంపిక చేసిన ప్రాంతాలకు తీసుకువెళ్లి మహజరు చేయాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. దర్శన్‌ పోలీసు కస్టడీ ఈనెల 20తో పూర్తవుతుంది. కేసులో తన పేరు నమోదు కాకుండా ప్రదూశ్‌ అనే నిందితుడికి దర్శన్‌ ఇచ్చిన రూ.30 లక్షల నగదును గిరినగరలో స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాఘవేంద్ర, కార్తీక్, నిఖిల్, వినయ్, నాగరాజు, లక్ష్మణ్, ప్రదూశ్‌లను సత్య అనుగ్రహ అపార్ట్‌మెంట్‌ సమీపంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి మహజరు నిర్వహించారు. పవిత్రాగౌడ, దర్శన్, పవన్, రాఘవేంద్ర, నందీశ్, వినయ్, నాగరాజు, లక్ష్మణ్‌ దీపక్, ప్రదూశ్, కార్తీక్, నిఖిల్‌లను పట్టణగెరె జయణ్ణ ఫాం (రేణుకాస్వామి హత్య జరిగిన ప్రదేశం) వద్దకు తీసుకెళ్లి వివరాలు రాబట్టారు. హత్యకు ఉపయోగించిన ఓ లాఠీ, కర్ర, నీటిసీసా, కాపలాదారుడి గదిలో దాచిన రక్తం మరకల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల వివరాలు రాబట్టారు. జగదీశ్, రవి, అనుకుమార్‌ ఇళ్లలో గాలింపు చర్యలు చేపట్టి హతుడి బంగారు గొలుసు, ఉంగరం, చేతి గడియారాన్ని సీజ్‌ చేశారు. మృతదేహాన్ని తరలించే సమయంలో స్వామి బంగారు వస్తువులను జగదీశ్‌ తీసుకోగా, గడియారాన్ని అనుకుమార్‌ తీసుకున్నట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు వాటిని వశపరుచుకున్నారు. హత్య తరువాత కార్తీక్, అనుకుమార్‌ ఆర్‌ఆర్‌నగలోని ఓ హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నారని గుర్తించి, అక్కడా ఆధారాల కోసం గాలించారు. దర్శన్‌ ధరించిన బూట్లను హొసకెరెహళ్లిలోని విజయలక్ష్మీ ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు. బన్నేరుఘట్ట రహదారి కెంబత్తళ్లి ఇంటిలో నిఖిల్, పవిత్రాగౌడ ఇంట్లో పలు సాక్ష్యాలకు ఉపయోగపడే వస్తువులు సీజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని