logo

ఐటీ ఉద్యోగాలంటే చులకనా?

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమాచార సాంకేతిక (ఐటీ), ఐటీఈఎస్‌ (సమాచార సాంకేతిక అనుబంధ సేవలు), జీవసాంకేతిక సంస్థలకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపు పొడిగించింది.

Updated : 14 Jun 2024 07:52 IST

 కార్మిక చట్టాల నుంచి మినహాయింపుపై నిరసన 

శ్రమదోపిడీ చేస్తే నిబంధనలు వర్తిస్తాయి..

ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమాచార సాంకేతిక (ఐటీ), ఐటీఈఎస్‌ (సమాచార సాంకేతిక అనుబంధ సేవలు), జీవసాంకేతిక సంస్థలకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపు పొడిగించింది. పదేళ్లుగా రాష్ట్ర ఐటీ సంస్థలు ఈ మినహాయింపు సదుపాయాన్ని పొందుతూనే ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి ఈ మినహాయింపును విస్తరించిన ఆయా ప్రభుత్వాలు 2024 మే నాటికి ముగిసే ఈ మినహాయింపు సదుపాయాన్ని మరో ఐదేళ్లకు విస్తరిస్తూ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. స్టాండింగ్‌ ఆర్డర్‌ (ఎస్‌ఓ)ను ఇలా పొడిగిస్తూ వెళ్లటం రాష్ట్రంలోని ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగులను ఆందోళనలో పడేస్తోంది. 

మినహాయింపు ఇలా..

పారిశ్రామిక ఉద్యోగుల చట్టం 1946 ప్రకారం ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల్లో కార్మిక చట్టాన్ని అమలు చేయాలి. ఈ చట్టం పరిధిలో గుర్తింపు పొందిన ఏదేని సంస్థలోని ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ, పదోన్నతులు, సేవల నుంచి తొలగించే ముందు నోటీసులు, మూకుమ్మడిగా ఉద్యోగుల తొలగింపు(లేఆఫ్‌), పని వేళలు, మహిళలకు సేవలతో పాటు సామాజిక భద్రత తదితర 25కుపైగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ సంస్థల్లో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు కూడా అవకాశం ఉంటుంది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ- బీటీ, ఐటీఈఎస్‌ సంస్థల ఆర్థిక ప్రగతిని పరిరక్షించేందుకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ద్వారా కొత్తగా ఏర్పాటైన సంస్థలు కొద్ది కాలం పాటు ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునే వీలుందని ప్రభుత్వాలు భావించాయి. ఒక రకంగా ఈ మినహాయింపు ఉద్యోగులకు మింగుడుపడని వ్యవహారంలా మారింది.

మహిళా ఉద్యోగుల భద్రతలో నిబంధనల సడలింపులు

 కరోనా నేర్పిన భయం..

కరోనా మహమ్మారి ప్రభావానికి ముందు ఈ నిబంధనలు, చట్టాలు, మినహాయింపులను ఉద్యోగులు అంతగా పట్టించుకోలేదు. సరిగ్గా ఈ సమస్యే అటు యాజమాన్యం, ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని దెబ్బతీసింది. వ్యాపారాలు లేదా ప్రాజెక్టుల ప్రగతి దెబ్బతినడంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని సంస్థలు మూకుమ్మడిగా ఉద్యోగులను తొలగించాయి. ఇలా రాష్ట్రంలోని 8,785 ఐటీ, ఐటీఈఎస్, బీటీ సంస్థల్లో పని చేసే 18 లక్షలకు పైగా ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తించింది. ఒక్క 2022లో దేశవ్యాప్తంగా 1.01 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా వీరిలో 37,260 మంది ఒక్క బెంగళూరులోనే ఉన్నారు. ఇంకా 20 వేల మంది ఉద్యోగులు వేతన కోతలతో అప్పటి రోజులను అతి కష్టంగా అధిగమించారు. 

అలా.. వర్తించదు

పేరుకు కార్మిక చట్టం నుంచి మినహాయింపు అమలులో ఉన్నా ఎస్‌ఓ ప్రకారం మూకుమ్మడి తొలగింపు, మహిళలపై వేధింపులు, ముందస్తు సమాచారం లేకుండా సేవల నుంచి తొలగింపు, ఉద్యోగ స్థాయిని తగ్గించటం వంటి సందర్భాలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. ప్రతి ఐటీ సంస్థ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో ఉద్యోగులకు కూడా సభ్యత్వం ఇవ్వాలనేది ఓ నిబంధన. ఎప్పటికప్పుడు యాజమాన్యం నుంచి వేధింపులు ఎదుర్కొంటే స్థానిక కార్మిక విభాగానికి ఫిర్యాదు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక ఉద్యోగుల చట్టం ప్రకారమే పరిష్కారాలు చూపాలని ఈ ఆదేశంలో ప్రస్తావించారు.

ఆదుకోవాలి కదా..

రాష్ట్రంలో 2022-23 ఏడాదిలో రాష్ట్ర ఐటీ శాఖ ఉద్దీపన ప్రక్రియ ద్వారా ఏర్పాటైన వందకు పైగా అంకురాలు ఏడాదిలోనే పరిశోధన, అభివృద్ధి విభాగాలను మూసివేయగా, మరో 150 సంస్థలు ఉత్పాదన సాధించినా వాటిని మార్కెటింగ్‌ చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ అంకురాలకు ప్రభుత్వమే విత్తనిధులు అందించినా వాటిల్లో 30 శాతం నిధులు వేతనాలకు వెచ్చించారు. ఈ సమస్య నుంచి తొలితరం అంకురాలు, జ్ఞానాభివృద్ధి, పరిశోధన లక్ష్యంతో ఏర్పాటైన అంకురాలను పరిరక్షించుకోవాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఉత్తమ ఆలోచనలతో ప్రారంభించిన అంకురాలకు కేవలం ప్రోత్సాహక నిధులే కాదు చట్టాల నుంచి మినహాయింపు ఇవ్వటం పారిశ్రామిక చట్టంలోనే ఉందని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు.

అమాత్యుల హామీ ఏమైనట్లు?

ఉద్యోగుల మనవి పత్రాలకు విలువ లేదాయె

ఇకపై ఈ మినహాయింపును కొనసాగించరాదని గత మార్చిలో కర్ణాటక ఐటీ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఈ సంఘంలోని దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగులు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద బైఠాయించి ఈ మినహాయింపును రద్దు చేయాలని మనవి చేసినట్లు కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సూరజ్‌ నిధియాంగ గుర్తుచేశారు. ఈ సందర్భంగా కార్మికశాఖ మంత్రి సంతోశ్‌లాడ్‌ మమ్మల్ని చర్చలకు ఆహ్వానించారని, మినహాయింపును రద్దు చేసేలా తాను ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారని వివరించారు. ఆయన హామీతోనే అప్పట్లో ఆందోళన విరమించామన్నారు. రెండు నెలలు తిరిగేసరికి ఇదే ఆదేశాన్ని కొనసాగించటం వెనుక ప్రభుత్వం ఆంతర్యం ఏమిటని ఈ సంఘం ప్రశ్నిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని