logo

గుట్కా తేలేదని బాలిక హత్య

కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలో జరిగిన చిన్నారి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. గుట్కా తెచ్చివ్వలేదని చిన్నారి తలపై కర్రతో కొట్టి హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Updated : 17 Jun 2024 06:34 IST

సిద్ధలింగయ్య

గంగావతి, న్యూస్‌టుడే: కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలో జరిగిన చిన్నారి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. గుట్కా తెచ్చివ్వలేదని చిన్నారి తలపై కర్రతో కొట్టి హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొప్పళ ఎస్పీ యశోదా ఒంటిగోడి విలేకరులకు వివరాలు తెలిపారు. ఏప్రిల్‌ 20న తన కుమార్తె అనుశ్రీ (7) కనిపించడం లేదంటూ తండ్రి రాఘవేంద్ర మడివాళ కొప్పళ పోలీసులకు పిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత కూతురు మృతదేహాన్ని సంచిలో కుక్కి తమ ఇంటి పెరట్లో పడేశారని పోలీసుల దృష్టికి తెచ్చారు. హంతకుడి జాడ కోసం ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా బృందం అదే గ్రామానికి చెందిన సిద్ధలింగయ్య నాయ్కల్‌ అనే వృద్ధుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గుట్కా తెచ్చివ్వలేదన్న కోపంతో కర్రతో బాలిక తలపై కొట్టడంతో చనిపోయినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడి నుంచి కర్ర, బాలిక పాదరక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన బృందాన్ని ఎస్పీ అభినందిస్తూ రూ.25 వేలు నజరానా ప్రకటించారు. 


కన్నబిడ్డనే కడతేర్చింది

బెంగళూరు (సదాశివనగర): తన మూడేళ్ల పది నెలల వయసున్న కుమార్తెకు మాటలు రావడం లేదన్న వ్యధతో కన్న తల్లే గొంతు నులిమి హత్య చేసింది. హత్య అనంతరం నిందితురాలు రమ్యా వెంకటేశ్‌ సుబ్రహ్మణ్యపుర ఠాణాలో లొంగిపోయింది. హత్య అనంతరం ఆమె తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఉలుకూ పలుకులేదని వైద్యుల ముందు రోధించింది. వైద్య పరీక్షలు చేసి, బిడ్డ చనిపోయిందని చెప్పడంతో మృతదేహంతో ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం పశ్చాత్తాపానికి గురై తన మరిదిని తీసుకుని పోలీసు ఠాణాకు వచ్చి లొంగిపోయింది. సుబ్రహ్మణ్యనగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె భర్త నెదర్లాండ్‌లో ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఆమె ఇటీవలే కుమార్తె ఆలనా పాలన చూసుకునేందుకు తన విధులకు రాజీనామా చేశారు. 


తల్లిని దూషించాడని హత్య

బెంగళూరు (గ్రామీణం): తన తల్లిని దూషిస్తున్న కృష్ణోజీరావు (37) అనే వ్యక్తిని శివకుమార్‌ హత్య చేశాడు. రాజేశ్వరి, కృష్ణోజిరావు ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులు. కూడ్లు గ్రామం సాయి మెడోస్‌ లేఅవుట్ సుభాశ్‌ చంద్రబోస్‌ రోడ్డులో లోకనాథ్‌ అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో పని చేస్తూ అక్కడే ఉండేవారు. శనివారం రాత్రి కూలీ పంపిణీ సమయంలో వారిద్దరూ గొడవ పడ్డారు. ఒకదశలో సహనం కోల్పోయిన కృష్ణోజీరావు ఆమెను దూషించడంతో అక్కడే ఉన్న శివకుమార్‌ పక్కనే ఉన్న కట్టె తీసుకుని కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. పరప్పనఅగ్రహార ఠాణా పోలీసులు హంతకుడ్ని అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.


దర్యాప్తులో వెలుగులోకి నిజాలు

బెళగావి, న్యూస్‌టుడే: వైద్యుడినని చెప్పుకొంటూ కిత్తూరులో నవజాత శిశువుల విక్రయ వ్యాపారం చేస్తూ పట్టుబడిన అబ్దుల్‌ గఫార్‌ లాడ్‌ఖాన్‌ విచారణను పోలీసులు కొనసాగించారు. తాలూకా పరిధి తగడోళ్లి గ్రామంలోని అతని ఫాం హౌస్‌లో ఒక పిండాన్ని పూడ్చి పెట్టాడని ఫిర్యాదు వచ్చింది. లాడ్‌ఖాన్‌ సహాయకుడు రోహిత్‌ కుప్పసగౌడర్‌ను పోలీసులు తమతో తీసుకువెళ్లి ఫారంహౌస్‌లో సోదా చేశారు. ఒకే చోట మూడు పిండాలు వారికి లభించాయి. మరికొన్ని పిండాలు ఉంటాయన్న అనుమానంతో సోదాను కొనసాగించారు. బాలల అక్రమ రవాణా, నవజాత శిశువుల విక్రయం, అర్హత లేకపోయినా గర్భవిచ్ఛిత్తి చేయడం తదితర కేసులు అబ్దుల్‌ గఫార్‌ లాడ్‌ఖాన్‌పై నమోదయ్యాయి. జిల్లాధికారి నితేశ్‌ పాటిల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మహేశ్‌ కోణి, తహసీల్దారు ప్రభావతి ఫకీరపుర, డీవైఎస్పీ రవి నాయక నేతృత్వంలో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.


మళ్లీ పేలిన తూటా 

విజయపుర, న్యూస్‌టుడే: భీమా తీరంలో మరోసారి తుపాకీ పేలింది. నిందితుల దాడిలో చడచణ పట్టణ పంచాయతీ సభ్యురాలి భర్త అశోక్‌ మల్లప్ప గంటగల్లి (45) హతమయ్యారు. అశోక్‌పై పట్టణ ఠాణాలో ఇప్పటికే రౌడీషీటు ఉంది. పెరోల్‌పై ఇటీవలే ఆయన కారాగారం నుంచి బయటకు వచ్చారు. హత్యతో పాటు పలు కేసులు ఆయనపై ఉన్నాయి. అతన్ని చుట్టుముట్టిన కొందరు నిందితులు దాడి చేశారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దాడిలో అతను అక్కడికక్కడే మరణించాడు. పాత కక్షలతోనే హత్య జరిగిందని గుర్తించారు. పరారీలో ఉన్న హంతకుల కోసం చడచణ పట్టణ ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.


నీట మునిగి బాలల మృతి

మైసూరు, న్యూస్‌టుడే: మైసూరు శివార్లలో సౌకార హుండి చెరువులో మునిగి హూటగళ్లి హౌసింగ్‌ బోర్డు నివాసి వరుణ్‌ (16), బసవనపుర నివాసి జస్వంత్‌ (14) నీట మునిగి ఆదివారం సాయంత్రం మరణించారు. స్నేహితులైన వీరిద్దరూ చెరువులో ఈతకు వెళ్లారు. లోతును అంచనావేయలేక నీటమునిగిపోయారు. అగ్నిమాపకదళ సిబ్బంది సహకారంతో ఇళవాళ ఠాణా సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. 


బ్యాంకు ఉద్యోగినే వంచించారు

చిక్కమగళూరు, న్యూస్‌టుడే: మేము ముంబయి పోలీసులమని ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తుల మాటలను కొప్పకు చెందిన ఒక బ్యాంకు ఉద్యోగి భయపడిపోయారు. మీరు విచారణకు హాజరు కావాలంటూ ఫోన్‌కు సందేశాన్ని పంపించారు. అరెస్టు చేయకూడదంటే తమకు రూ.17 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. భయపడి వారు చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేశారు. తాను మోసపోయానని గుర్తించి సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇలాంటి వంచన కేసులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రం అమటె ప్రజలను కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని