logo

సామాజిక స్ఫూర్తి కెరటం రామోజీరావు : సీనియర్‌ పాత్రికేయులు

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత దివంగత రామోజీరావు విలువలతో కూడిన వ్యాపారం, నిబద్ధతతో కూడిన వృత్తిని ఎలా చేపట్టాలో సమాజానికి తెలియజెప్పారని కర్ణాటకలోని సీనియర్‌ జర్నలిస్ట్‌లు స్మరించుకున్నారు.

Published : 17 Jun 2024 04:08 IST

చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న రవి ప్రసాద్‌ 

ఈనాడు, బెంగళూరు: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత దివంగత రామోజీరావు విలువలతో కూడిన వ్యాపారం, నిబద్ధతతో కూడిన వృత్తిని ఎలా చేపట్టాలో సమాజానికి తెలియజెప్పారని కర్ణాటకలోని సీనియర్‌ జర్నలిస్ట్‌లు స్మరించుకున్నారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ‘అన్నదాన రామోజీరావుకు స్మరణాంజలి’ పేరిట నిర్వహించిన సంతాప సభలో ఈటీవీ కన్నడలో గతంలో పని చేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వృత్తి నైపుణ్యాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించే రామోజీరావు మాలాంటి ఎందరో పాత్రికేయులు ఈ రంగంలో ఉన్నత స్థాయిలో ఉండేందుకు దోహదపడ్డారు. ఈటీవీలో వార్త వస్తేనే అది నిజమని నమ్మేంత విశ్వాసాన్ని ఆయన పొందగలిగారు. కచ్చితమైన, వాస్తవాంశాలను అందించే క్రమంలో ప్రకటనలను కూడా ఆయన తోసిపుచ్చేవారని పలువురు పాత్రికేయులు స్మరించుకున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో అసాధారణ విజయాలు సాధించినా ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్నే ఆయన నెలకొల్పారు. ఇతర సంస్థల్లో చేరేందుకు సిద్ధమైన సిబ్బందిని కూడా ఆయన ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు. నాణ్యత కోసం రాజీపడని రామోజీ తత్వం నేడు మాధ్యమ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న ఎందరో సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టులు నరేంద్ర పుప్పాల్, శివశంకర్, రవిగౌడ, రవికుమార్, వ్యాఖ్యాత రాధికా రాణి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు శ్రీధర్, ఉపాధ్యక్షులు ఆనంద్‌ బైదనమని తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని