logo

‘కొందరు అలా గవర్నర్లు అవుతున్నారు’

కొన్ని వివాదాస్పదమైన అంశాల్లో తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు తమ పదవీ విరమణ అనంతరం గవర్నర్లుగా ఎలా బాధ్యతలు చేపడుతున్నారో దేశ ప్రజలు తెలుసుకున్నారని సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి వి.గోపాలగౌడ వ్యాఖ్యలు చేశారు.

Published : 17 Jun 2024 04:10 IST

 పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రదర్శిస్తున్న జస్టిస్‌ గోపాల గౌడ, ఇతర ప్రతినిధులు 

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: కొన్ని వివాదాస్పదమైన అంశాల్లో తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు తమ పదవీ విరమణ అనంతరం గవర్నర్లుగా ఎలా బాధ్యతలు చేపడుతున్నారో దేశ ప్రజలు తెలుసుకున్నారని సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి వి.గోపాలగౌడ వ్యాఖ్యలు చేశారు. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి సి.చంద్రశేఖర్‌ రాసిన ‘కావేరి వివాదం- ఒక చరిత్రాత్మక నేపథ్యం’ పుస్తకాన్ని గాంధీ భవన్‌లో ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో సింగూరులో ఒక కంపెనీ కార్ల పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా రైతులకు మద్దతుగా తాను ఇచ్చిన తీర్పు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిందన్నారు. పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు పశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల కమిషన్‌కు అధ్యక్షునిగా నియమిస్తానని చెప్పినా తాను అందుకు అంగీకరించలేదన్నారు. తాను భవిష్యత్తు లాభదాయకంగా ఉండాలని ఎప్పుడూ తీర్పులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నేటి పరిస్థితులను అవలోకిస్తే కొందరు న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతరం లోకాయుక్త, గవర్నరు, రాజ్యసభ సభ్యులు కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోందన్నారు. వారికి ఆ పదవులు రావడం వెనుక ఎవరున్నారనే విషయం అందరికీ తెలుసని కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కావేరి న్యాయమండలి ఇచ్చిన తీర్పుతో అప్పటి కర్ణాటక ప్రభుత్వం పతనం అయ్యే స్థితికి చేరుకుందని జస్టిస్‌ గోపాలగౌడ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉండగా, అప్పటి న్యాయశాఖ మంత్రి, కార్యదర్శులు తనను భేటీ అయ్యారని తెలిపారు. కర్ణాటక హితాన్ని కాపాడాలని తాను చేసిన విజ్ఞప్తికి కేంద్రం, సహ న్యాయమూర్తులు మద్దతు ఇచ్చారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు న్యాయవాదులకు రూ.142 కోట్లను వేతనంగా ఇచ్చిందన్నారు. ఆ మొత్తాన్ని వినియోగించుకుంటే, మరో ఆనకట్ట నిర్మించుకోవచ్చని సిద్ధరామయ్యకు తాను హితవు చెప్పానన్నారు. బెంగళూరు ప్రజలు కావేరి నీటిని తాగుతున్నా, నదీ వివాదం విషయంలో ఏమీ పట్టనట్లు ఉంటున్నారని విమర్శించారు. యువత, విద్యార్థులు సమకాలీన దేశ పరిస్థితులు, రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కావేరి నదీ జలాలపై హక్కులకు సంబంధించిన ఒప్పందంలోనే తిరకాసులు ఉన్నాయని, నేటి అవసరాలకు అనుగుణంగా ఆ సమస్యను పరిష్కరించుకోవలసిన అవసరం ఉందన్నారు. కాడుమల్లేశ్వర గెళయర బళగ అధ్యక్షుడు బీకే శివరాం, కర్ణాటక గాంధీ స్మారకనిధి అధ్యక్షుడు వోడె పి.కృష్ణ, సీనియరు విలేకరి దినేశ్‌ అమీన్‌ మట్టు, ప్రచురణకర్త అభిరుచి గణేశ్, మండ్య జిల్లా హితరక్షణ సమితి సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని