logo

రాజకీయ కాక రాజేసిన ఇంధన ధరలు

మొన్నటి వరకు ఎన్నికల హడావుడిలో పరస్పరం విమర్శించుకున్న రాజకీయ పార్టీలకు ఇంధన ధరల పెంపు మరో అస్త్రంగా మారింది. ఎన్నికలు ముగిసీ ముగియగానే కర్ణాటక సర్కారు ఇంధన ధరలను పెంచటంతో విపక్షాలు భగ్గుమన్నాయి.

Published : 17 Jun 2024 06:47 IST

అభివృద్ధి కోసమే ఈ పెంపు - సీఎం సమర్థన
సర్కారు చర్యలను నిరసిస్తూ నేడు భాజపా ఆందోళన

ఎద్దుల బండితో కాంగ్రెస్‌ నేతల ప్రదర్శన (పాత చిత్రం)

ఈనాడు, బెంగళూరు: మొన్నటి వరకు ఎన్నికల హడావుడిలో పరస్పరం విమర్శించుకున్న రాజకీయ పార్టీలకు ఇంధన ధరల పెంపు మరో అస్త్రంగా మారింది. ఎన్నికలు ముగిసీ ముగియగానే కర్ణాటక సర్కారు ఇంధన ధరలను పెంచటంతో విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ ధరల పెంపు వెనుక ఆర్థిక సమీకరణాలున్నాయని సర్కారు సమర్థించుకుంటున్నా విపక్షాలు పెడచెవిన పెడుతూ ఆందోళన బాటను ఆశ్రయించబోతున్నాయి. కాంగ్రెస్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ స్థాయిలోనూ భాజపా విమర్శలకు వేదికగా మారింది. రాష్ట్ర నాయకుల నుంచి కేంద్ర మంత్రులు వరకు ఇంధన ధరల పెంపును కాంగ్రెస్‌ పార్టీ నేతల ఎన్నికల ప్రచార వ్యాఖ్యానాలతో జోడించి సామాజిక మాధ్యమాల్లో ఎదురుదాడికి దిగుతున్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ఇంధన ధరల పెంపు రాజకీయ ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించనుంది.

ఇంధన ధరల పెంపును ప్రశ్నిస్తూ సిద్ధు, డీకేల వినూత్న  నిరసన (భాజపా విడుదల చేసిన చిత్రం)

 అప్పట్లో అలా..

2019 నుంచి వరుసగా మూడేళ్ల పాటు భాజపా సర్కారు పెట్రోల్, డీజిల్‌ ధరలను వరుసగా రూ.00.5 నుంచి రూ.1.20, రూ.0.10ల నుంచి రూ.2.20లుగా పెంచింది. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచి వారి భుజాలపై మోయలేని భారాన్ని ఉంచిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ తీవ్రంగా ఆరోపించింది. వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని 2020లో సైకిళ్లపై, 2021లో ఎద్దుల బండిపై కాంగ్రెస్‌ నేతలంతా నిరసనగా వచ్చి విధానసౌధను ముట్టడి చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌లు ద్విచక్రవాహనాలతో శవయాత్ర చేపట్టి వినూత్న నిరసన చేపట్టారు. ఓ వైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా ఇంధన ధరలను పెంచటం డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానమేనంటూ కాంగ్రెస్‌ అప్పట్లో దుమ్మెత్తి పోసింది. సరిగ్గా ఈ నిరసన తాలూకూ ఛాయాచిత్రాలు, కాంగ్రెస్‌ నేతల నిరసన ధ్వనులు నేడు ప్రతిపక్షంలో ఉన్న భాజపాకు అక్కరకు వచ్చాయి. ఏడాదిగా లేనంతా ఒక్కసారిగా రూ.3ల చొప్పున పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచిన కాంగ్రెస్‌ సర్కారు సహజంగానే విపక్షాల నుంచే కాదు సాధారణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనే స్థితి నెలకొంది.

సరికాని సమయం

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఊహించిన స్థానాల కంటే కనీసం 5-6 స్థానాలను తక్కువగా గెలుచుకుంది. ఏడాదిగా అమలు చేస్తున్న గ్యారంటీలు ఈ ఎన్నికల్లో ఊతంగా నిలుస్తాయని భావించిన కాంగ్రెస్‌ పార్టీకి ఫలితాలు షాకిచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే 8స్థానాలు అదనంగా గెలుచుకున్నా ఆ సాధన తాలూకూ ఆనందం రాష్ట్ర నాయకత్వం నుంచి అధిష్ఠానం వరకు కనిపించనేలేదు. పైకి వెల్లడించకున్నా గ్యారంటీ పథకాలు అంతగా ఆదుకోలేదన్న ఆవేదన రాష్ట్ర నాయకత్వాన్ని తొలచివేసింది. కొందరు ఎమ్మెల్యేలు, ఆర్థిక సలహాదారులు, మంత్రులైతే నేరుగా ఓట్లు రాల్చని గ్యారంటీలు ఎందుకున్నట్లు అంటూ ప్రశ్నించారు. మరికొందరు ఈ పథకాలపై పునరాలోచన చేయాలంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సలహాలిచ్చారు కూడా. ఈ పథకాలేవీ రాజకీయ లబ్ధిని ఆశించి అమలు చేయలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఆలోగానే ఇంధన ధరల పెంపు నిర్ణయం తీసుకోవటంతో సమర్థనల వెనుక ఆంతర్యం ఏమున్నా విపక్షాలకు మాత్రం విమర్శలకు కేంద్రంగా మారింది. ఎన్నికల నియామవళి ఎత్తివేసిన తర్వాతి మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం సరైన చర్య కాదని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆందోళన పర్వానికి సిద్ధం

ఎన్నికల్లో ఓడిపోయి తీవ్ర నిరాశలకు గురైన కాంగ్రెస్‌ ప్రజలపై ధరల మోత పెంచిందని రాష్ట్ర భాజపా అధ్యక్షులు బి.వై.విజయేంద్ర ఆరోపించారు. సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. కేవలం ఒక్కరోజు ఆందోళనతో ఆపకుండా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆందోలన కొనసాగిస్తామన్నారు. మరోవైపు విపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఈ అంశంపై సామాజిక మాధ్యమంలో పోస్టుల పర్వంతో చెలరేగుతున్నారు. 2020-22 వరకు అప్పటికి విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఇంధన ధరల పెంపుపై చేపట్టిన ఆందోళనను గుర్తు చేస్తూ విమర్శలకు దిగారు. ఒకటి, రెండు రూపాయాలు పెంచినందుకే ఎద్దుల బండిలో తిరిగిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఏకంగా రూ.3లు ఒకేసారి ఎందుకు పెంచిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్‌ అధికారంలో వస్తే నిత్యావసర ధరలతో పాటు ఇంధన ధరలను తగ్గిస్తామని చేసిన ప్రకటన తాలూకు వీడియో చిత్రాన్ని విడుదల చేశారు. ఇంధన ధరల పెంపును ఖండిస్తూ నేడు స్వాతంత్య్ర ఉద్యానవనం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు భాజపా ప్రకటించింది. బి.వై.విజయేంద్ర, ఆర్‌.అశోక్‌లతో పాటు డి.వి.సదానందగౌడతో ఆ పార్టీ  మాజీ మంత్రులు, బీబీఎంపీ మాజీ సభ్యులంతా ఈ ఆందోళనలో పాల్గొంటారు.

ఇక కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ సైతం సామాజిక మాధ్యమంలో కాంగ్రెస్‌ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సుదీర్ఘ వ్యాఖ్యానాలు చేశారు. మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.8,500లు జమ చేస్తామన్న కాంగ్రెస్‌ రూ.3ల ఇంధన పెంపుతో ఈ రంగ అనుబంధ వస్తువుల ధరలు అమాంతంగా పెరిగేలా చేసింది. ఆహార, జౌళి, ఔషధాల వంటి వస్తువుల ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై భారాన్ని మోపినట్లు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆర్థికమాంద్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అధికమని ఆ ధరల జాబితాను పోస్ట్‌ చేశారు.

అభివృద్ధికే వినియోగిస్తాం 

ఇంధన ధరల పెంపుపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) సవరణతో పెరిగిన ఆదాయమంతా రాష్ట్ర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పథకాలకే వినియోగిస్తామని ప్రకటించారు. ప్రజలందరి సంక్షేమాన్ని కాపాడే బాధ్యతను మేము కొనసాగిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సమయంలో భాజపా సర్కారు వ్యాట్‌ను తగ్గించి సమాంతరంగా కేంద్రం విధించే పన్నులు పెంచింది. ఈ కారణంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి వసూలయ్యే పన్నుల వాటా తగ్గిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై విధించిన అబ్కారీ సుంకం రూ.9.21 నుంచి రూ.32.98కు, డీజిల్‌పై రూ.3.45ల నుంచి రూ.31.84 వరకు పెంచటమే ప్రజలపై పడుతున్న అసలైన ఆర్థిక భారమని ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఈ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రాష్ట్ర సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో పెరిగిన ఇంధన ధరలు దక్షిణ భారత రాష్ట్రాల ఇంధన ధరలతోనే కాదు మహారాష్ట్ర కంటే తక్కువగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని