logo

అదుపులో పవిత్రా గౌడ మేనేజరు

చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి (28) హత్య కేసులో మొదటి నిందితురాలు పవిత్రా గౌడ మేనేజరు దేవరాజ్‌ను పోలీసులు అదుపునకు తీసుకున్నారు. హత్య అనంతరం రేణుకాస్వామి ఒంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నారని గుర్తించారు.

Published : 17 Jun 2024 06:45 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి (28) హత్య కేసులో మొదటి నిందితురాలు పవిత్రా గౌడ మేనేజరు దేవరాజ్‌ను పోలీసులు అదుపునకు తీసుకున్నారు. హత్య అనంతరం రేణుకాస్వామి ఒంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నారని గుర్తించారు. జూన్‌ 8వ తేదీ సాయంత్రం హత్య జరిగింది. హత్య జరిగిన సమయంలో దేవరాజ్‌ కూడా పట్టణగెరెలోని షెడ్డుకు వెళ్లాడని సీసీ కెమెరా ఫుటేజ్‌ ద్వారా తెలుసుకున్నారు. రేణుకాస్వామిపై మొదటి దాడి పవిత్రాగౌడ చేసిందని పోలీసులు తెలిపారు. తనను కొట్టవద్దని, మరోసారి ఈ తప్పు చేయనని, ఆమె కాళ్లపై పడిన అనంతరమూ ఆమె కొట్టిందని నిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు గుర్తించారు. పవిత్రా గౌడ ఇంట్లో అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పోలీసులు ఆదివారం మహజరు చేశారు. పవిత్ర, ఆమె ఆప్తుడు పవన్‌ ఇద్దరినీ రాజరాజేశ్వరినగరలోని ఇంటికి తీసుకువెళ్లి, సోదాలు పూర్తి చేశారు. ఠాణాలో మొత్తం తొమ్మిది మందిని విచారణ చేయగా, సాయంత్రం పవిత్రను సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌కు తరలించారు. పవిత్ర, దర్శన్, ఇతర నిందితుల దుస్తులు, దాడి సమయంలో వారు వాడిన చెప్పులు, బూట్లు జప్తు చేసుకున్నారు. దుస్తులపై ఉన్న రక్తం మరకను పరీక్షించేందుకు ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. నిందితుల విచారణను మరింత తీవ్రం చేశారు. ప్రశ్నలపై ప్రశ్నలు కురిపించారు. విడివిడిగా, అందరినీ కలిపి ప్రశ్నిస్తున్నారు. అవసరానికి అనుగుణంగా న్యాయనిర్బంధంలో ఉన్న ఇతర నిందితులనూ మరోసారి అదుపునకు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రేణుకాస్వామిని అపహరించేందుకు ఉపయోగించిన కారును చిత్రదుర్గలో జప్తు చేసుకున్నారు.

నిజజీవితంలో కథానాయకులు కాలేరు

ప్రతి కథానాయకుడు నిజజీవితంలో హీరోగా ఉండలేరని ఎమ్మెల్సీ సీటీ రవి పేర్కొన్నారు. చిక్కమగళూరులో తనను కలుసుకున్న విలేకరులతో ఆదివారం మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండే నటులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వ్యక్తి అయినా శిక్ష అనుభవించవలసి ఉంటుందన్నారు. 

తిరిగొచ్చిన గిరీశ్‌

హత్య కేసు దర్యాప్తును తక్కువ సమయంలో పూర్తి చేసిన గిరీశ్‌ నాయక్‌ను హోం శాఖ మరో ఠాణాకు బదిలీ చేసింది. దీనిపై వివాదం రావడంతో మళ్లీ ఆయన బదిలీని ప్రభుత్వం రద్దు చేసింది. పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, అందులో గిరీశ్‌ కూడా ఉండడంతోనే వివాదమైందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మొదటి నిందితులను విచారణ చేసిన సమయంలో ప్రధాన నిందితులు పవిత్రాగౌడ, దర్శన్‌ అని ఆయనే గుర్తించారు. మైసూరులో ఉన్న దర్శన్‌ను సిబ్బంది సహకారంతో అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హంతకులను అరెస్టు చేసి, విచారణను వేగవంతంగా పూర్తి చేసి ఉన్నత అధికారుల మెప్పు పొందారు. 

ప్రత్యేక న్యాయవాది నియామకం 

 రేణుకాస్వామి హత్య కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు హైకోర్టు న్యాయవాది పి.ప్రసన్న కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో న్యాయవాది సి. సచిన్‌ ఆయనకు సహాయకునిగా వ్యవహరించనున్నారు. నటుడు దర్శన్, ఆయన సన్నిహితురాలు పవిత్రగౌడ, ఇతర నిందితుల విచారణ ఈ నెల 20కు పూర్తయితే త్వరలో అభియోగపత్రాన్ని దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకాలను చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు