logo

చెన్నపట్టణ ‘చింత’ తీర్చేనా?

మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి లోక్‌సభకు వెళ్లడంతో ఖాళీ అయిన చెన్నపట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బుధవారం ఆలయాల సందర్శన కొనసాగించారు.

Updated : 20 Jun 2024 03:14 IST

చాముండేశ్వరి ఆలయంలో హారతి కళ్లకు అద్దుకుంటున్న శివకుమార్‌

రామనగర, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి లోక్‌సభకు వెళ్లడంతో ఖాళీ అయిన చెన్నపట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బుధవారం ఆలయాల సందర్శన కొనసాగించారు. ఈసారి ఇక్కడ నుంచి తాను పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ డీకే సురేశ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయననే బరిలోకి దించాలని పార్టీ కోరుకుంటోంది. ఉప ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశం ఉండడంతో పలు ఆలయాలను డీకే సందర్శించారు. చెన్నపట్టణలో కాళికాంబ ఆలయం, సమీపంలోని కెంగల్‌ హనుమంతరాయ స్వామి దేవాలయం, దొడ్డమళూరులో అప్రమేయ దేవాలయం, దేవరహళ్లిలో బీరేశ్వర సన్నిధి, గౌడగెరెలో చాముండేశ్వరి, సంజీవరాయ, మహదేశ్వరస్వామి, ధర్మరాయస్వామి సన్నిధులు, హుణసనహళ్లిలో బిసిలమ్మ, యోగనరసింహస్వామి, రామమందిరాలకు వెళ్లి పూజలు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్‌ (భాజపా) కుమార్తె నిశా యోగేశ్వర్‌ను బరిలో దించే అవకాశాలుఉన్నాయని సమాచారం. దళ్‌ తరఫున నిఖిల్‌ గౌడను పోటీ చేయించాలని దళపతులపై ఇప్పటికే ఒత్తిళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌ టెంపుల్‌ రన్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో సోదరుడు సురేశ్‌ బెంగళూరు గ్రామీణ నియోజకవర్గంలో ఓటమి చవిచూశాక.. ఓ చక్కని విజయం కోసం డీకే ఎదురు చూస్తున్నారు. అది చెన్నపట్టణ రూపంలో అందివస్తుందని ఆశల మేడలు కడుతున్నారు.

పారిశ్రామికవేత్తలతో చర్చలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బుధవారం బెంగళూరులోని సదాశివనగరలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ సహాయ సహకారాలు, భూమి కేటాయింపు, నీటి సరఫరా, రవాణా తదితర అంశాలపై చర్చించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధమని ఉపముఖ్యమంత్రి డీకే హామీనిచ్చారు. పరిశ్రమలు ఏర్పడితే నిరుద్యోగ సమస్య అదుపులోకి వస్తుందన్నారు. ఈసందర్భంగా ఐటీసీ సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు బి.సుమంత్, ఉపాధ్యక్షుడు సందీప్‌ చంద్రశేఖర్‌ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని