logo

సాధనతో నవ జీవన యోగం

చలాకీగా జీవితం సాగిపోవాలని అందరూ కలలుగంటారు. అందులో కొందరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వారికి ఊతమిచ్చే సాధనే.. యోగా! ప్రపంచవ్యాప్తంగా నేడీ సాధన ప్రక్రియ ఎనలేని గుర్తింపునకు నోచుకుంది.

Updated : 20 Jun 2024 03:16 IST

మైసూరులో గతంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి మోదీ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: హాయిగా.. చలాకీగా జీవితం సాగిపోవాలని అందరూ కలలుగంటారు. అందులో కొందరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వారికి ఊతమిచ్చే సాధనే.. యోగా! ప్రపంచవ్యాప్తంగా నేడీ సాధన ప్రక్రియ ఎనలేని గుర్తింపునకు నోచుకుంది. భారతీయ మూలాలున్న గురువులు అంతర్జాతీయంగా పేర ప్రఖ్యాతలార్జించి- సమకాలీన శాస్త్ర, సాంకేతిక సమాజంలో గుర్తింపు దక్కించుకున్నారు. దేశ, విదేశాల్లో శుక్రవారం యోగా దినోత్సవం నిర్వహించనున్న వేళ.. ఆ ప్రక్రియకు కన్నడనాట లభించిన అగ్రాసనంపై చిరు విశ్లేషణ.

మైసూరులో శిక్షణ పొందడానికి విదేశీయుల ఆసక్తి

యోగా.. ఈ పేరు చెబితేనే వెంటనే గుర్తుకొచ్చేది రాచనగరి మైసూరు. ఇక్కడ లెక్కలేనన్ని యోగా సాధన కేంద్రాలు విరాజిల్లుతున్నాయి. వేలాది మంది విదేశీయులు మెలకువలు నేర్చుకుని, రోగాలు దరిచేరని జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. యోగా ప్రక్రియలన్నీ సామాన్యులకూ సులువుగా అవగతమవుతుండటంతో ఆదరణ పెరిగిపోయింది. ఎందరో గురువులు కుటీరాలను ఏర్పాటు చేసి, శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మైసూరు మహారాజుల కాలం నుంచీనూ యోగాకు రాచనగరిలో ఎనలేని గుర్తింపు దక్కింది. ఇక్కడ పుట్టి పెరిగి, గురువులుగా గుర్తింపు దక్కించుకున్న బి.కె.ఎస్‌.అయ్యంగార్, పట్టాభి జోయిస్‌ లాంటి వారు విదేశాల్లో ఆదరణ పొందారు. వీరికి మైసూరు రాజా నాల్వడి కృష్ణరాజ ఒడెయరు వెన్నుదన్నుగా నిలిచారు. వారి కృషి ఫలితంగా ప్రముఖులెందరో యోగాభ్యాసాలకు ముందుకు రావడం ప్రస్తావనార్హం. ఇక్కడ మెలకువలు నేర్చుకున్న వారిలో ఎందరో విదేశాల్లో శిక్షణనిస్తున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లోనూ ‘మైసూరు’ శిక్షణ మూలాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ విద్య వ్యాప్తికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం రాచనగరికి మరింత ఉపకరించింది. పట్టాభి జోయిస్‌ సొంతంగా అభివృద్ధి చేసిన అష్టాంగయోగా సాధనకు విద్యార్థులు ఉత్సాహం చూపుతుంటారు. రాచనగరి నుంచి క్రమంగా బెంగళూరుకూ ఈ విద్య వ్యాపించింది. ఇక్కడ ఆర్ట్‌ ఆఫ్‌లివింగ్‌ కేంద్రంతో పాటు వచనానంద స్వామి పీఠం, అక్షర పవర్‌ యోగా కేంద్రంలో వేలాది మంది శిక్షణ పొందుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఇటీవల కాలంలో ఇలాంటి గురుకులాలు తీర్చిదిద్దుతున్నారు. గోకర్ణలో ప్రత్యేక పర్ణశాలలు నిర్మించి, విదేశీయులకు సాధనలు నేర్పుతున్నారు. ఈసారి ‘యోగా ఒలంపియాడ్‌’ పేరిట మైసూరులో నిర్వహించే వేడుకలను గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ మంగళవారమే ప్రారంభించారు. బెంగళూరులోని వివిధ ఉద్యానవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల ప్రాంగణాల్లో ఈ వేడుకలకు వేదికలు సిద్ధం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల (ఐటీ) ఉద్యోగులు నేడు జీవనశాంతి, ఆరోగ్య రక్షణ కోసం వేడుకల్లో మమేకం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని