logo

దళపతుల కోటలో కాంగ్రెస్‌ మంత్రాంగం

లోక్‌సభ ఎన్నికల వెనువెంటనే రాష్ట్రంలో కొన్ని విధానసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సిద్ధం కానుంది. అందులోనూ ఓ స్థానం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారి పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు సవాలుగా మారింది.

Updated : 20 Jun 2024 03:20 IST

డీకే శివకుమార్‌ రంగప్రవేశం?

ఈనాడు, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల వెనువెంటనే రాష్ట్రంలో కొన్ని విధానసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సిద్ధం కానుంది. అందులోనూ ఓ స్థానం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారి పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు సవాలుగా మారింది. బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నపట్టణ సెగ్మెంట్‌ నుంచి 2023లో గెలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో మండ్యలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఊపులో కేంద్రంలోనూ మంత్రయ్యారు. ఆయన ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ స్థానమే చెన్నపట్టణ. మరోవైపు లోక్‌సభకు ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రాజీనామా చేసిన హావేరి జిల్లా శిగ్గావి పోటీకీ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. చెన్నపట్టణలో ప్రజలు, అధిష్ఠానం కోరుకుంటే ఉప ఎన్నికకు సిద్ధమని డీకే శివకుమార్‌ బుధవారం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ఆ ఆసక్తి వెనుక ఉన్న నేపథ్యమేమిటంటే..

అది దళ్‌ అడ్డా

చెన్నపట్టణ రామనగర జిల్లాలో ఓ నియోజకవర్గం. ఒకానొక కాలంలో కాంగ్రెస్‌కు కంచుకోట. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కుటుంబ సభ్యుల రాకతో జేడీఎస్‌కు అడ్డాగా మారింది. ఈ జిల్లాల్లోని కనకపురలో ఒక్కలిగ సముదాయానికి చెందిన డీకే సోదరులు చక్రం తిప్పుతున్నా.. అదే సముదాయానికి పెట్టని కోటగా ఉండే చెన్నపట్టణలో జేడీఎస్‌ను నిలువరించే ప్రయత్నం చేయలేకపోయారు. అక్కడ 1952 నుంచి 2023వరకు 18 సార్లు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్‌ గెలిచింది కేవలం ఆరు సార్లే. మిగిలిన అన్నిసార్లూ జేడీఎస్‌ లేదా స్వతంత్ర అభ్యర్థి లేదంటే భాజపా గెలుపు వాకిట నిలిచేవి. జేడీఎస్‌ ఇక్కడ తొమ్మిది సార్లు గెలిచింది. మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి విజయాలు సాధించి ఉన్నత పదవులు పొందారు. ఒక్కలిగ ఓట్లు నిర్ణయాత్మకంగా ఉండే ఈ చోట ముస్లింలు, దళితులూ అభ్యర్థుల గెలుపోటములను శాసించగలరు. 2018లో పోటీ చేసిన హెచ్‌డీ కుమారస్వామి 15వేల ఓట్లతో గెలిచినా లోక్‌సభలోనూ మండ్య నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దేవేగౌడ కుటుంబం కాకున్నా ఇక్కడ పోటీ చేసే జేడీఎస్‌ అభ్యర్థి ఎవరైనా సులువుగా గెలుస్తుంటారు. కుమారస్వామి విధానసభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కటి చెన్నపట్టణ ఉండేలా చూసుకుంటారు. ఆ పార్టీకి ఇదెంతో సురక్షితం. భాజపా నేత సి.పి.యోగేశ్వర్‌ ఇక్కడ మంచి విజయాలు సాధించిన మరో నేత. కాంగ్రెస్, ఎస్‌పీ, భాజపాల నుంచి పోటీ చేసినా ఆయన గెలుపు సాధించి సత్తా చాటారు.

డీకే ప్రతీకారేచ్ఛ

చెన్నపట్టణ క్షేత్రం ప్రస్తుతం డీకే సోదరులకు ప్రతీకారాన్ని తీర్చుకునే అరుదైన వేదికగా మారింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ సుమారు 2.5 లక్షల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి కేవలం పార్టీకి చేకూర్చిన నష్టమే కాదు.. డీకే కుటుంబ రాజకీయానికి ఓ అవమానంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి సారధ్యం, ఉపముఖ్యమంత్రి హోదా, పైగా ఒక్కలిగలకు గట్టి నాయకుడిగా ప్రచారం చేసుకునే డీకే తన సోదరుడిని బెంగళూరు గ్రామీణ నుంచి గెలిపించుకోలేకపోవటం వ్యక్తిగత ప్రతిష్ఠకు జరిగిన ఓటమిగా భావిస్తున్నారు. డీకే సురేశ్‌ను ఓడించి నాకు ఓ గుణపాఠం చెప్పారని ప్రకటించిన డీకే శివకుమార్‌- ఆ ఓటమికి సరైన బదులిచ్చేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశం చెన్నపట్టణ ఉప ఎన్నికల ద్వారా వచ్చినట్లైంది. బెంగళూరు గ్రామీణలో ఓ క్షేత్రమైన చెన్నపట్టణలో డీకే సురేశ్‌ 85 వేల ఓట్లను పోగు చేయటం కూడా కాంగ్రెస్‌ బలాల్లో ఒక అంశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు డీకే సోదరులు ఎదురుచూస్తున్నారు.

రంగంలోకి శివుడు..

చెన్నపట్టణ క్షేత్రంలో బుధవారం పర్యటించిన డీకే శివకుమార్‌ అక్కడ తాను పోటీ చేసే సంకేతాలు మరింత స్పష్టం చేశారు. ముందుగా సురేశ్‌ పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించినా రాజకీయ పరిణామాల దృష్ట్యా శివకుమార్‌ పోటీ సురక్షితమని పార్టీ భావిస్తోంది. ఇక్కడ జేడీఎస్‌ అభ్యర్థి ఎవరైనా భాజపా అండదండలు దండిగా ఉంటాయి. వీరిద్దరి మైత్రిని ఎదిరించటం డీకే వంటి నేతకే సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలే తదుపరి ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న ఆయన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో కాస్త వెనుకబడ్డారు. ఒక్కలిగల నుంచి ముఖ్యమంత్రి నేతగా ఎదగాలన్న ఆయన ఆశలు మరింత గట్టిపడాలంటే ఆ ఒక్కలిగల అడ్డా అయిన చెన్నపట్టణలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఉన్నారు. మరోవైపు తన సోదరుడికి తాను ప్రాతినిధ్యం వహించే కనకపురలో పోటీ చేయించి ఆయనకు రాజకీయ భవిష్యత్తు అందివ్వాలని చూస్తున్నారు.

అంత సులువా?

డీకే శివకుమార్‌ పోటీ చేసినా ఇక్కడ అంత సులువుగా గెలిచే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. జేడీఎస్, భాజపా కలిస్తే కాంగ్రెస్‌ను సులువుగా నియంత్రించే అవకాశాలున్నాయి. ఇక్కడ 16 ఏళ్లుగా కాంగ్రెస్‌ గెలిచింది లేదు. 2018లోనూ మూడో స్థానంలో నిలిచింది. ఇలాంటి చోట మైత్రి అభ్యర్థి ఎవరు నిలిచినా డీకే శ్రమించాల్సిందే. మరోవైపు జేడీఎస్, భాజపా తరఫున ఎవరు పోటీ చేస్తారన్నది తేలలేదు. కుమారస్వామి జాతీయ రాజకీయాలకు వెళ్లగా ఆయన వారసత్వ బాధ్యతలు తీసుకునే నిఖిల్‌గౌడ పోటీ చేయాలని స్థానిక జేడీఎస్‌ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. మరోవైపు తాజా లోక్‌సభ ఎన్నికల్లో తన బావ డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ గెలుపునకు శ్రమించిన భాజపా నేత సి.పి.యోగేశ్వర్‌కు మైత్రి ధర్మంలో భాగంగా ఇక్కడ పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వటం జేడీఎస్‌కు అనివార్యంగా మారింది. యోగేశ్వర్‌ పోటీలో దిగితే మరోవైపు ఆయన కుమార్తె నిశా యోగేశ్వర్‌ను బరిలో దింపే అవకాశాలను కాంగ్రెస్‌ పరిశీలిస్తోంది. కాదంటే.. ప్రస్తుతం ఓ హత్య కేసులో నిలువునా మునిగిన సినీ నటుడు దర్శన్‌ కూడా ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని