logo

యోగా..జీవన గమన వికాసదీపిక

యోగా అంటే జ్ఞానం అంతర్భాగం. మనలో ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను వికసింపజేసి ఎప్పటికప్పుడు నవచైతన్యానికి నాందిపలికేదే యోగా.

Published : 21 Jun 2024 04:17 IST

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

గోముఖాసనం

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: యోగా అంటే జ్ఞానం అంతర్భాగం. మనలో ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను వికసింపజేసి ఎప్పటికప్పుడు నవచైతన్యానికి నాందిపలికేదే యోగా. యోగా అంటే కేవలం ఆసనాలు కావు. (శారీరక కదలికలు) శ్వాసప్రక్రియలే కాదు.. మానవుని అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తుల కలయికకు మరింత పుష్టిని కలుగజేసి వికసింపజేసి జీవన గమనానికి, గమ్యానికి సరికొత్త దిక్సూచి. మనదేశంలో యోగా ప్రక్రియ అనేది వేల సంత్సరాల క్రితమే ఆచరణలో ఉంది. అనేక సంవత్సరాలపాటు ఇది కనుమరుగైంది. కారణం యోగా గురించి సమాజానికి, సామాన్య ప్రజానీకానికి సరైన అవగాహన కల్పించలేదు. దేశంలో యోగా గురువులు, శిక్షకులకు కొదవలేదు. విజ్ఞాన శాస్త్ర ప్రకారం యోగా అంటే పరిపూర్ణ జీవనసార విధానం. నేటి మారుతున్న జీవన విధానంలో అతివేగ ప్రపంచంలో మానవ జీవన విధానాలు అస్తవ్యస్తమై మనశ్శాంతి కరవై దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అప్పుడే కనిపించింది మార్గం. అదే యోగా మార్గం. నీరు, ఆహార కాలుష్యంతోపాటు మానవ మనుగడ కలుషితమై రోగాలమయం అయినప్పుడు మందులు పనికి రానప్పుడు జ్ఞాన, యోగా గురువులు యోగా ప్రచారం చేయటం ప్రారంభించారు. మానసిక, శారీరక శాంతికి యోగా ఉపయోగాలను గురించి విశదీకరించారు. 24 గంటలు కంప్యూటర్లతో కుస్తీ పడే యువత మరింత బలహీన పడసాగింది. వారు మానసిక, శారీరక మేథో వికాసాల కోసం ఈ ప్రక్రియ ఉపయోగాల్ని తెలుసుకున్నారు. ఫలితంగా రామ్‌దేవ్‌ బాబా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ రవిశంకర్, డా.నాగేంద్ర వంటి యోగా గురువులు చేసిన ప్రచార ఫలితాలు సమాజంపై బాగా ప్రభావం చూపాయి.

ఆధునిక యుగంలో

మరింత ప్రాచుర్యంలోకి..

ఉద్యోగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య నిమిత్తం యాజమాన్యం యోగా గురువులతో ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన ప్రక్రియల్లో శిక్షణను ఇప్పిస్తున్నాయి. అంతేకాదు విద్యాసంస్థల్లోనూ ప్రత్యేకంగా విద్యార్థులకు యోగా శిక్షణలను యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. యోగా శిక్షణా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆవిర్భవించటం సమాజానికి నవచైతన్యాలనవచ్చు. మధుమేహం, అధిక రక్తపు ఒత్తిడి, థైరాయిడ్, శరీర అంగాల్లో వైవిధ్య బాధలు ఇలా ప్రతి వ్యాధికి తనదైన ప్రత్యేక ప్రాణాయామాలు, ఆసనాలు వీటి ఉపశాంతికి దివ్యౌషధాలుగా భాసిల్లుతున్నాయి.

యోగా దినోత్సవానికి అడుగులు

విద్యార్థుల యోగా విన్యాసం

ఇదే సందర్భంలో దేశప్రధాని నరేంద్రమోదీ 2014లో యోగా ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పటమేగాక ఏటా జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించి ప్రపంచదేశాలకే యోగా చైతన్యానికి నాందిపలికారు. ప్రపంచమంతా ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదిలింది. ఎలాంటి ఔషధాలతో నయంకాని రోగాలు యోగాసనాలు ప్రాణాయామాలు, ధ్యాన ప్రక్రియల ద్వారా నయమవుతున్న అంశాన్ని నేడు ప్రపంచం గ్రహించింది. ఆబాలగోపాలానికి యోగా ప్రాముఖ్యతను చాలామటుకు అవగాహన కలిగింది. శుక్రవారం ప్రపంచం అంతా యోగా దినోత్సవానికి సిద్ధత ఏర్పాట్లు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని