logo

విలువల శిఖరం రామోజీరావుకు ఘన నివాళి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావుకు బెంగళూరు ‘ఈనాడు’ కార్యాలయం సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం బెంగళూరు ‘ఈనాడు’ కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

Published : 21 Jun 2024 02:52 IST

రామోజీరావుకు నివాళులు అర్పించిన వివిధ విభాగాల ఉద్యోగులు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావుకు బెంగళూరు ‘ఈనాడు’ కార్యాలయం సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం బెంగళూరు ‘ఈనాడు’ కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తొలుత రామోజీరావు చిత్ర పటానికి పువ్వులు అలంకరించారు. అనంతరం బెంగళూరు డివిజన్‌ ఏజీఎం ప్రకాశ్‌ ధార్వాడ్‌తో పాటు ‘ఈనాడు’, ఈటీవీ, న్యూస్‌టుడే, ఉషోదయ, సర్క్యులేషన్, ప్రింటింగ్, ప్రకటన, రామోజీ ఫిల్మ్‌సిటీ విభాగాలకు చెందిన ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామోజీరావు జీవిత చరిత్రకు సంబంధించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. విజ్ఞానం, అవగాహన, సమయస్ఫూర్తి, కష్టపడే స్వభావంతో సిబ్బంది నిరంతరం ముందుకు సాగాలని, ఓటమి వస్తే కుంగి పోవద్దని, ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు సాగాలని ఈ చిత్రంలో ఛైర్మన్‌ రామోజీరావు ఇచ్చిన సందేశం ఉద్యోగుల్లో స్ఫూర్తిని నింపింది. కష్టాలకు తట్టుకుని ముందుకు సాగాలని రామోజీరావు ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది ప్రతినబూనారు. సమాజాన్ని నూతన ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్లాలని, సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చన్న సందేశం, ఆయన పలు రంగాల్లో సాధించిన విజయాలు, అనుసరించిన విలువలతో కూడిన విధానాలు, అంతిమయాత్ర..తదితర కీలక ఘట్టాలతో కూడిన ఈ లఘు చిత్రాన్ని ఉద్యోగులందరూ తిలకించారు.

నివాళి సభలో మాట్లాడుతున్న కుమారనాథ్‌

దార్శనికుడు రామోజీరావు

మంగళూరు:  అక్షర యోధుడు రామోజీరావు దూరదృష్టి ఉన్న దార్శనికుడని విజయకర్ణాటక విశ్రాంత స్థానిక సంపాదకుడు కుమారనాథ్‌ పేర్కొన్నారు. ముద్రణ, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలతో పాటు మల్టీమీడియా విభాగంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఏబీశెట్టి కూడలిలోని మార్గదర్శి చిట్ఫండ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కార్యాలయంలో రామోజీరావుకు గురువారం శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. చిత్రపటం వద్ద నివాళి అర్పించి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎగువ సభను రద్దు చేసేలా రాసిన వార్తలు తనకు గుర్తున్నాయని చెప్పారు. రామోజీ తమకు అన్నదాత అని నటుడు మైమ్‌ రామదాస్‌ తెలిపారు. కర్ణాటకకు చెందిన విలేకరులను తీర్చిదిద్దడంలో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌ పాత్ర ప్రధానమైందని న్యాయసేవల ప్రాధికార ప్యానల్‌ అడ్వకేట్ సుఖేశ్‌ కుమార్‌ శెట్టి తెలిపారు. పారిశ్రామికవేత్త గోపీనాథ్‌ భట్, మార్గదర్శి చిట్ఫండ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ మంగళూరు విభాగం మేనేజరు నితిన్‌ కుమార్, సంస్థ ప్యానెల్‌ అడ్వకేట్ ప్రఫుల్ల ప్రేమ్, సంస్థ ఉద్యోగిని స్వప్న తదితరులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని