logo

కన్నడ భాష రక్షణకు కంకణం

కర్ణాటకలో కన్నడకు అనువైన వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 02:56 IST

సువర్ణ మహోత్సవాల్లో సిద్ధు

మంత్రులు, నేతలతో కలిసి భూమి పూజ చేస్తున్న సిద్ధరామయ్య

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: కర్ణాటకలో కన్నడకు అనువైన వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కన్నడ భాష, భూమి, జలాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక కన్నడిగునిపై ఉందన్నారు. కర్ణాటక సువర్ణ మహోత్సవాల్లో భాగంగా విధానసౌధ పశ్చిమ ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న భువనేశ్వరి మాత్ర విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయన గురువారం భూమిపూజ చేసి మాట్లాడారు. మాతృభాషలో మాట్లాడడం గర్వకారణమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని హితవు పలికారు. ఉద్యోగం, ఉపాధి కోసం చందనసీమకు వచ్చే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడేలా ప్రోత్సహిస్తూ, అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించవలసి ఉందన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రకు వెళితే ఎక్కువ మంది వారి మాతృభాషలోనే మాట్లాడతారని గుర్తు చేశారు. ఏ భాషైనా వ్యవహారికంగా వినియోగంలో ఉంటేనే ఎక్కువ కాలం మన్నుతుందని చెప్పారు. కన్నడిగులు దురభిమానులు కాదని, తమ భాషను మాట్లాడాలని ఒత్తిడి తీసుకురాకపోవడంతోనే ఎక్కువ మంది కన్నడను నేర్చుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. నవంబరు ఒకటో తేదీలోగా భువనేశ్వరిమాత విగ్రహ ప్రతిష్ఠకు చర్యలు తీసుకోవాలని కన్నడ, సాంస్కృతిక శాఖ అధికారులకు సూచించారు. గతేడాది నవంబరు ఒకటికి రాష్ట్రానికి కర్ణాటక అని పేరు పెట్టి 50 ఏళ్లయిందని ‘కర్ణాటక, కన్నడ శ్వాస కావాలి’ అనే నినాదంతో ఏడాది పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వస్తున్నామని తెలిపారు. భువనేశ్వరి మాత విగ్రహం శాశ్వతంగా ఇక్కడ ఉంటూ, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు శివరాజ్‌ తంగడగి, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్, డాక్టర్‌ ఎంసీ సుధాకర్, కేఎన్‌ రాజణ్ణ, సతీశ్‌ జార్ఖిహొళి, విధానపరిషత్‌ అధ్యక్షుడు బసవరాజ హొరట్టి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని