logo

ఇంధన ధరలపై కమలదండు కన్నెర్ర

ఇంధన ధరల పెంపును ఖండిస్తూ అన్ని నియోజకవర్గాల్లో భాజపా నాయకులు, కార్యకర్తలు సైకిల్‌ జాతా, రోడ్డు రోకోలతో గురువారం నిరసన ప్రదర్శనలను హోరెత్తించారు.

Published : 21 Jun 2024 02:58 IST

సైకిల్‌ జాతా, రోడ్డు రోకోలతో నిరసన

సైకిళ్లపై వెళ్తున్న విజయేంద్ర, సీటీ రవి, హరీశ్‌ తదితరులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఇంధన ధరల పెంపును ఖండిస్తూ అన్ని నియోజకవర్గాల్లో భాజపా నాయకులు, కార్యకర్తలు సైకిల్‌ జాతా, రోడ్డు రోకోలతో గురువారం నిరసన ప్రదర్శనలను హోరెత్తించారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌ నుంచి అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ఎమ్మెల్సీ సీటీ రవి, మాజీ ఉప మేయరు హరీశ్‌ నేతృత్వంలో వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు విధానసౌధ వైపు సైకిల్‌ జాతాను నిర్వహించారు. దారి మధ్యలో వారిని పోలీసులు అదుపునకు తీసుకుని, హైగ్రౌండ్‌ ఠాణాకు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టారు. కర్ణాటకలో రైతులు కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదుకోవడం లేదని విజయేంద్ర దుయ్యబట్టారు. ఇంధనం, నిత్యావసర ధరలు అదుపు తప్పుతున్నా అధికార పార్టీ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. బస్సు ఛార్జీలు, నీటి ధరలనూ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. ఇంధన ధరలను తగ్గించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రోడ్డు రోకో చేస్తే లాఠీఛార్జ్‌ చేస్తామని హోంమంత్రి బెదిరింపులకు పాల్పడడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. దావణగెరెలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలకు మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు బసవరాజ బొమ్మై నేతృత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని