logo

కేజీఎఫ్ లో కనకం వేటకు సై!

ఎన్నికల నిబంధనావళి ముగిసిన తర్వాత రాష్ట్ర సర్కారు పాలన రథాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రం నలుమూలల్లోని ఆర్థిక వనరులను వృద్ధి చేసుకుని తద్వారా ఖజానాను నింపుకోవాలని యత్నిస్తోంది. ఆర్థిక వనరులతో పాటు విద్యా, సామాజిక, వైద్య, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో ప్రమాణాలు పెంచే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.

Updated : 21 Jun 2024 06:13 IST

సర్కారు కార్యాలయాల్లో అంబేడ్కర్‌కు సమున్నత స్థానం
 ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు, వ్యక్తిత్వ వికాసానికి అగ్రాసనం
మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానాలు

కేజీఎఫ్‌లో మళ్లీ తవ్వకాల సవ్వడి

ఈనాడు, బెంగళూరు: ఎన్నికల నిబంధనావళి ముగిసిన తర్వాత రాష్ట్ర సర్కారు పాలన రథాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రం నలుమూలల్లోని ఆర్థిక వనరులను వృద్ధి చేసుకుని తద్వారా ఖజానాను నింపుకోవాలని యత్నిస్తోంది. ఆర్థిక వనరులతో పాటు విద్యా, సామాజిక, వైద్య, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో ప్రమాణాలు పెంచే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా మూతపడిన కోలారు బంగారు గనుల్లో (కేజీఎఫ్‌) కార్యాచరణను పునఃప్రారంభించటం, విశ్వవిద్యాలయాల్లో ప్రధానమంత్రి ఉచ్‌తర్‌ పథకం అమలు, వసతి నిలయాల్లో విద్యార్థుల మానసిక పరిణితి, వ్యక్తిత్వ వికాసాన్ని వృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాలకు నిధుల సమీకరణ, కేంద్రం పరిధిలో అనుమతులకు సిఫార్సులు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో తీసుకున్న ఆ తీర్మానాల వివరాలిలా ఉన్నాయి..

తవ్వకాల మోత

తవ్వకాలపై మళ్లీ బీజీఎంఎల్‌కే సర్వాధికారాలు

ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా బంగారు ఖనిజాలు నిక్షిప్తమైన కేజీఎఫ్‌లో చేపట్టే తవ్వకాలు అటు కేంద్రానికే కాదు రాష్ట్రానికి విలువైన రాయల్టీని అందిస్తుంది. దశాబ్దాల క్రితమే నిలిచిపోయిన కేజీఎఫ్‌ గనుల తవ్వకాలను పునరుద్ధరించేందుకు సర్కారు నిర్ణయించింది. కోలారు, బంగారుపేటె, బంగారదిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్ల గనుల్లో తవ్వకాలు చేపట్టడం, ఈ తవ్వకాల బాధ్యతను ఇప్పటికే చేపట్టిన భారత్‌ గోల్డ్‌మైన్‌ లిమిటెడ్‌ (బీజీఎంఎల్‌)కు మరోసారి విస్తరించటం, రాష్ట్రానికి ఈ సంస్థ నుంచి రావాల్సిన రాయల్టీ రూ.75.24 కోట్లను ఇప్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. 1973 నుంచి ప్రతి 20ఏళ్లకోసారి ఈ సంస్థకు గుత్తేదారు హక్కులను విస్తరించిన విషయం తెలిసిందే. మరోసారి ఇదే సంస్థకు ఆ బాధ్యతలు ఇవ్వాలని తీర్మానించారు.

అంబేడ్కర్‌కు గౌరవం

రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు రాష్ట్రంలో సమున్నత గౌరవం అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రానున్న ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు మహాత్మాగాంధీ చిత్రంతో పాటు డా.అంబేడ్కర్‌ చిత్రానికి అంజలి ఘటించాలని సర్కారు తీర్మానించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు, ఇతర అనుబంధ సంస్థల్లో ఈ నిబంధన అమలు చేసేలా ఆదేశాలు రూపొందించాలని తీర్మానించారు. గత ఐదేళ్లుగా అంబేడ్కర్‌ భావజాలాన్ని రాజకీయ లబ్ధి కోసం అణగదొక్కాలన్న ప్రయత్నాలను నియంత్రించేందుకు సర్కారు ఈ తీర్మానం చేసింది.

విద్యాలయాల్లో ప్రవేశాల పెంపు

ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రమాణాలు పెంచేలా కసరత్తు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రమాణాలు అంతకంతకూ తగ్గుతున్నాయి. రాష్ట్రంలో 18-23 ఏళ్ల వయసున్న వారు ఉన్నత విద్యలో ప్రవేశించే ప్రమాణం కేవలం 25శాతం ఉండగా దానిని 50శాతానికి పెంచటం, పురుషుల్లో ప్రస్తుతం ఉన్న 30శాతాన్ని 60శాతానికి, మహిళల్లో 28.5శాతాన్ని 50శాతానికి, ఎస్సీ, ఎస్టీ ప్రవేశాల ప్రమాణాన్ని 19.6 శాతం నుంచి 50 శాతానికి బీసీల ప్రవేశాలను 60 శాతానికి పెంచాలని సర్కారు నిర్ణయించింది.ఇందుకు అనువైన ప్రధానమంత్రి ఉచ్‌తర్‌ శిక్షా అభియాన్‌ పథకాన్ని రాష్ట్రంలోని బెంగళూరు విశ్వవిద్యాలయం, రాణిచెన్నమ్మ, కర్ణాటక, మంగళూరు, కలబురగి, మహారాణి క్లస్టర్‌ తదితర విశ్వవిద్యాలయాల్లో కేంద్రం రూ.167.86 కోట్లు, రాష్ట్రం రూ.111.91 కోట్లను అందించేలా పాలన పరమైన ఆమోదాన్ని తెలిపింది.

ఇంకొన్ని నిర్ణయాలు

కేఆర్‌ఈఐఎస్‌ వసతి నిలయాల్లో విద్యార్థులకు మానసిక, శారీరక, సృజనాత్మక తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్రంలోని మొత్తం 8జిల్లాల్లోని 201 వసతి నిలయాలను ఎంపిక చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకు రూ.26 కోట్లను కేటాయించాలని తీర్మానించారు.
 జులై నిర్వహించాల్సిన విధానసభ సమావేశాల తేదీలు, ఇతర బిల్లుల వివరాలను నిర్ణయించేందుకు గవర్నర్‌ అనుమతి కోసం ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు.
నీట్‌ అక్రమాలను నియంత్రించటం, ఈ పరీక్ష పునఃనిర్వహణ కోసం జాతీయ స్థాయిలో డిమాండ్‌ చేయాలని సర్కారు తీర్మానించింది. ఉన్నత విద్యశాఖ మంత్రి ద్వారా కేంద్రానికి ప్రత్యేక మనవి పత్రాన్ని తయారు చేయనున్నారు. ఇదే సందర్భంగా ఉన్నత విద్య స్థాయిలో ఉపన్యాసకుల కొరత, నివృత్తి పొందుతున్న బోధన సిబ్బంది వివరాలపై చర్చించి త్వరలో ఈ నియామకాలు చేపట్టాలని తీర్మానించారు.

  •  రాష్ట్రంలోని 46వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు, 1,234 పీయూ కళాశాలల్లో ఉచిత విద్యుత్తు, తాగునీటి సదుపాయం కోసం రూ.29.19కోట్లుతో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు.
  •  కలబురగి నగరాభివృద్ధి ప్రాధికార ద్వారా కుసపూర వసతి నిలయం నిర్మాణానికి రూ.94.80 కోట్ల ప్రణాళిక, కర్ణాటక స్థానిక సంస్థల్లో బకాయిపడ్డ నీటిపన్ను వసూళ్ల కోసం స్వసహాయ బృందాల సేవల వినియోగంతో రూ.1,860 కోట్ల సేకరణ, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని పౌరహక్కుల కమిషన్‌ పరిధిలో 33 ప్రత్యేక పోలీసు స్టేషన్ల ఏర్పాటుతో పాటు హాసనలో రూ.59.57కోట్లతో ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని