logo

అరకొరగా తినడం.. ఆలస్యంగా నిద్రపోవడం..

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు.

Updated : 24 Jun 2024 11:26 IST

దర్శన్‌కు ప్రత్యేక బ్యారక్‌
కుమిలిపోతున్న పవిత్రగౌడ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. ఇతర ఖైదీల బ్యారక్‌లో ఉంచితే, వారి నుంచి సమస్యలు వస్తాయని ప్రత్యేక బ్యారక్‌ను దర్శన్, మరో నటుడు ప్రదోశ్‌కు కేటాయించామని అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్నాయి. విచారణ ఖైదీగా ఉన్న అతనికి 6106 నంబరును కేటాయించారు. శనివారం రాత్రి భోజనానికి రాగి సంగటి, అన్నం, సాంబారు మజ్జిగ, ఆకుకూర పులుసు ఇచ్చారు. రాత్రి అరకొరగా అన్నం తిని, ఆలస్యంగా నిద్రపోయాడు. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచి తాగడానికి వేడి నీరు కోరాడు. కొంత సమయం బ్యారక్‌ ఆవరణలోనే నడిచి, స్నానం పూర్తి చేసుకున్నాడు. అల్పాహారంగా రైస్‌ బాత్‌ ఇచ్చారు. హత్య కేసులో దర్శన్‌ అరెస్టయి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ఆయన బరువు కొంత తగ్గగా, రక్తపోటు కూడా నియంత్రణలో లేదని గుర్తించారు. హత్య కేసులో నిందితులు 17 మంది కాగా, అందరూ పరప్పన అగ్రహార కారాగారంలోనే ఉన్నారు. మహిళా బ్యారక్‌లో ఉన్న పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా, ఒంటరిగా , రోదిస్తూ ఉంటోందని కారాగార సిబ్బంది గుర్తించారు. జూన్‌ ఎనిమిదిన హత్య అనంతరం కొందరు సాక్షులను నిందితులు బెదిరించారని పోలీసులు గుర్తించారు. కొందరు నిందితులు హత్య అనంతరం రక్తం మరకలు ఉన్న తమ దుస్తులను కాల్చివేసి, కొత్త దుస్తులు కొనుగోలు చేసుకున్నారు. సాక్షులకు ప్రాణహాని ఉండడంతో వారి వివరాలను గోప్యంగా ఉంచామని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ తెలిపారు.

షామియానా, బ్యారికేడ్ల తొలగింపు

అన్నపూర్ణేశ్వరినగర ఠాణా వద్ద తొలగించిన బ్యారికేడ్లు, షామియానా

ఇప్పటి వరకు అన్నపూర్ణేశ్వరి నగర ఠాణా వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, షామియానాను తొలగించారు. దర్శన్‌తో పాటు ఇతర నిందితుల చరవాణులను జప్తు చేసుకున్నారు. అందులో డేటాను మొత్తం తొలగించి ఉండడాన్ని గుర్తించి, వివరాలు రాబట్టేందుకు ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. రేణుకాస్వామి చరవాణిని హత్య అనంతరం రాజకాలువలో పడేశారు. సిమ్‌కార్డు సర్వీసు ప్రొవైడర్‌ సహకారంతో అతని కాల్‌డేటాను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. దర్శన్‌ ఇంట్లో లభించిన నగదు వివరాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందించారు. తదుపరి విచారణలో వాటి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. హత్య కేసులో దర్శన్, ఇతర నిందితులకు 13 రోజుల న్యాయనిర్బంధాన్ని న్యాయస్థానం విధించింది. బెంగళూరు బదులుగా తుమకూరు కారాగారానికి తరలించాలని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చేసిన వాదనలకు దర్శన్‌ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. తాను, దర్శన్‌ మంచి స్నేహితులమని మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ విజయపురలో తెలిపారు. దర్శన్‌పై కేసు లేకుండా చేయాలని తాను పోలీసులు, అధికారులు, మంత్రివర్గ సహచరులపై ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. రేణుకాస్వామిని హత్య చేసి ఉంటే, దర్శన్‌ శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని