logo

సూరజ్‌ విచారణ షురూ

ఒక యువకునిపై (25) లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలపై ఎమ్మెల్సీ డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణను బాడీ వారెంట్‌ పై సీఐడీ అధికారులు సోమవారం అదుపులోనికి తీసుకున్నారు.

Updated : 25 Jun 2024 02:44 IST

సూరజ్‌ రేవణ్ణ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఒక యువకునిపై (25) లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలపై ఎమ్మెల్సీ డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణను బాడీ వారెంట్‌ పై సీఐడీ అధికారులు సోమవారం అదుపులోనికి తీసుకున్నారు. వారం పాటు (జులై ఒకటి వరకు) అతన్ని విచారించేందుకు 42వ ఏసీఎంఎం న్యాయస్థానం సీఐడీ అధికారులకు అనుమతించింది. పరప్పన అగ్రహార కారాగారం నుంచి సూరజ్‌ను తమ కార్యాలయానికి సోమవారం సాయంత్రం తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. గత శనివారం రాత్రి హాసనలో పోలీసుల ముందు విచారణకు హాజరైన సూరజ్‌ను అరెస్టు చేశామని ఆదివారం ప్రకటించారు. కోరమంగలలోని న్యాయమూర్తి నివాసం ముందు ఆదివారం రాత్రి హాజరుపరచగా న్యాయనిర్బంధానికి పంపిస్తూ ఆదేశించిన విషయం తెలిసిందే.


ప్రజ్వల్‌కూ నిర్బంధం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : సూరజ్‌ సోదరుడు ప్రజ్వల్‌కు విధించిన న్యాయనిర్బంధం సోమవారంతో పూర్తయింది. అతన్ని 42వ ఏసీఎంఎం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. జులై ఎనిమిది వరకు అతన్ని న్యాయ నిర్బంధానికి పంపిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. తనకు జామీను మంజూరు చేయాలని కోరుతూ ప్రజ్వల్‌ వేసుకున్న అర్జీ విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. కారాగారంలో కావలసిన ఔషధాలు ఇచ్చారా అని ప్రజ్వల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇచ్చారని చెబుతూనే తనకు మెడ నొప్పి ఉందని ఫిర్యాదు చేశారు. హృద్రోగ సమస్య, ఇతర ప్రాణాంతక వ్యాధులు ఉన్నప్పుడు మాత్రమే బయటి ఆసుపత్రుల్లో చికిత్సకు అవకాశం ఉంటుందని, ఇతర సమస్యలను కారాగారంలోని ఆసుపత్రిలోనే చికిత్స ఇప్పిస్తారని న్యాయమూర్తి తెలిపారు.


పారిశ్రామికవేత్తపై కాల్పులు

మడికేరి, న్యూస్‌టుడే : కుశాలనగరకు చెందిన పారిశ్రామికవేత్త శశిధర్‌పై అనుదీప్‌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కారులో నుంచి దిగుతున్న శశిధర్‌పైకి నిందితుడు ఎనిమిది రౌండ్లను కాల్చాడు. కొన్ని తూటాలు కారుకు తగిలాయి. రెండు తూటాలు శశిధర్‌ కాలిలోకి వెళ్లాయి. బాధితుడ్ని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేశారు.


యువకుడి సెల్ఫీలాట.. పంజా విసిరిన చిరుత

మైసూరు, న్యూస్‌టుడే : నంజనగూడు తాలూకా యళల్లి గ్రామ శివార్లలో చిరుతతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన జయశంకర్‌ (22) అనే యువకుడిపై అది దాడి చేసింది. పంజా దెబ్బ అతని వీపుపై పడడంతో కొంత భాగం చీరుకుపోయింది. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. హుళ్లహళ్లి, యలళ్లి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు వేట ప్రారంభించారు. సిబ్బంది నుంచి తప్పించుకుని ఒక పాడుబడిన ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. దానికి మత్తు వచ్చేందుకు ఇంజక్షన్‌ ఇచ్చి బోనులో ఉంచి తరలిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన జయశంకర్‌ దానితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. బోను ఊచల మధ్య నుంచి అది పంజా విసరడంతో బతుకు జీవుడా అంటూ.. ఆస్పత్రికి చేరాడు.


పరారీలో శివకుమార్‌

హాసన, న్యూస్‌టుడే : అత్యాచారానికి గురయ్యానని ఆరోపిస్తున్న యువకుడు రూ.5 కోట్లు డిమాండ్‌ చేశాడని ఆరోపిస్తూ హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణకు ఆప్తుడు శివకుమార్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడ్ని సూరజ్‌కు అతనే పరిచయం చేశాడని తెలుసుకున్నారు. సూరజ్‌ లైంగిక అలవాటును తెలుసుకున్న శివకుమార్‌ ‘హనీ ట్రాప్‌’ చేశాడని అనుమానిస్తున్నారు. ‘సూరజ్‌ రూ.4 లక్షలు ఇస్తారు. ఆ మొత్తం తీసుకుని, జరిగిన ఘటనలను మర్చిపో’ అని బాధితుడికి ఫోన్‌ చేసి శివకుమార్‌ సూచించిన ఆడియో రికార్డును పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.


వివాహం చేసుకుంటానని వంచన

హాసన, న్యూస్‌టుడే: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి, రూ.18 లక్షల నగదు తీసుకుని ముండగోడు ఠాణా కానిస్టేబుల్‌ ఎస్‌.ఎం.గిరీశ్‌ వంచించాడని ఒక యువతి (24) ఆరోపించింది. చెన్నరాయపట్టణకు చెందిన ఆమె హాసనలో ఎస్పీ విష్ణువర్ధన్‌కు ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న ఆభరణాలు విక్రయించి, నగదు ఇచ్చిన అనంతరం వివాహం చేసుకోనని తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె వాపోయింది. గిరీశ్‌పై హాసన ఠాణాలో కేసు నమోదైంది. ఆమెకు నగదు తిరిగి ఇచ్చేందుకు గిరీశ్‌ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.


వైరల్‌గా మారిన ఆడియో

హాసన, న్యూస్‌టుడే : లైంగిక అత్యాచారానికి గురైన బాధితునితో ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘జరిగిందేదో జరిగిపోయింది. డబ్బు ఇచ్చి పంపిస్తా’ అని సూరజ్‌ చెబుతుండగా.. తనకు డబ్బు వద్దని, పరువు పోయిందంటూ బాధితుని మాటలు వినిపించాయి. ఎదురుగా కూర్చుని మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకుందామని సూరజ్‌ సూచించగా, ఎదురుగా వస్తే నన్ను విడిచి పెడతారా అంటూ భయంగా బాధితుడు మాట్లాడారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు.. నాలుగైదు నెలల్లో నీకు మంచి పని ఇస్తాను అని అతను అభయం ఇచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది. జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా మారనున్న చట్టాలకు అనుగుణంగా ఈ ఆడియో దర్యాప్తు అధికారులకు బలమైన సాక్ష్యం కానుంది.


మారణాయుధాలతో బాలుడి హత్య

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: వైమ్యాక్స్‌ కూడలి వద్ద మంజునాథ్‌ (17) అనే బాలుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. స్నేహితులను కలిసి, ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఆగంతకులు మారణాయుధాలతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోగా మరణించాడు. గంగమ్మనగుడి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఉద్యానవనంలో కార్మికుడు..

బీ మల్లేశ్వరం కేసీ జనరల్‌ ఆసుపత్రి సమీపంలోని ఉద్యానవనంలో పన్నీర్‌ సెల్వం (37) అనే కార్మికుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. తమిళనాడు నుంచి వచ్చి- భార్య, నలుగురు పిల్లలతో కలిసి మల్లేశ్వరం పరిధిలో ఉంటున్నాడు. ముగ్గురు ఆగంతకులతో అతని గొడవ పడ్డాడని సమాచారం. వారు తలపై బండరాయి వేసి హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకుని పోలీసులు అక్కడకు వచ్చేలోగా హంతకులు పరారయ్యారు. సహ కార్మికులే హంతకులని ప్రాథమిక దర్యాప్తులో మల్లేశ్వరం ఠాణా పోలీసులు గుర్తించారు.


ఇద్దరు దొంగల అరెస్టు

బళ్లారి, న్యూస్‌టుడే: ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.6లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.16వేల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటికి తాళం వేసిన వాటిని లక్ష్యంగా చేసుకుని నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు, వెండిస్తువులు, నగదు ఎత్తుకుని వెళ్లినట్లు బళ్లారి కౌల్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ రంజిత్‌కుమార్, ఏఎస్పీలు, రవికుమార్, నవీన్‌కుమార్‌ ఆదేశాలతో డీఎస్పీ చంద్రకాంత నందరెడ్డి, సీఐ సుభాష్‌ చంద్ర, ఎస్‌ఐలు లారెన్‌ శ్యామువేల్, సోమయ్య తమ సిబ్బందితో ఈద్గామైదానంలో అనుమానంగా తిరుగుతున్న బండిహట్టికి చెందిన మంజునాయక్, ప్రశాంతనగరకు చెందిన తరుణకుమార్‌ నాయక్‌లను అరెస్టు చేసి వారిని విచారించి రూ.6లక్షల విలువైన 107 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.16 వేల విలువైన 283 గ్రాముల వెండి వస్తువులు, చరవాణులు, ద్విచక్రవాహనం, ఇనుప రాడ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలను అరెస్టు చేసిన పోలీస్‌ అధికారులు, పోలీసులను ఎస్పీ అభినందించారు.


అధికారిని బెదిరించి అడ్డంగా చిక్కాడు

ధార్వాడ, న్యూస్‌టుడే: ధార్వాడ కారాగారంలో డి-గ్రూపు ఉద్యోగికి లోకాయుక్త న్యాయస్థానం రెండేళ్ల కారాగారవాసం, రూ.10 వేల జరిమానా విధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన సహాయక అటవీ సంరక్షణ అధికారి అశోక భట్ను 2014లో బెదిరించాడు. తనకు నగదు ఇస్తే, మీపై లోకాయుక్తలో నమోదైన కేసులు కొట్టించి వేస్తానని, లేదంటే కొత్త కేసులు నమోదయ్యేలా చేస్తానని బెదిరించి రూ.50 వేలు తీసుకున్నాడు. దీనిపై బాధితుడు అశోకభట్ ముండరగిలోని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. విచారణ పూర్తి చేసి నిందితునికి శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని