logo

తుమకూరుకు దర్శన్‌ తరలింపు!

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో కారాగారం చేరిన దర్శన్‌ మినహా.. మిగతా నిందితులు రవిశంకర్, కార్తిక్, కేశవమూర్తి, నిఖిల్‌ నాయక్‌లను తుమకూరు కారాగారానికి సోమవారం సాయంత్రం తరలించారు.

Updated : 25 Jun 2024 06:40 IST

నటుడు దర్శన్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో కారాగారం చేరిన దర్శన్‌ మినహా.. మిగతా నిందితులు రవిశంకర్, కార్తిక్, కేశవమూర్తి, నిఖిల్‌ నాయక్‌లను తుమకూరు కారాగారానికి సోమవారం సాయంత్రం తరలించారు. దర్శన్‌ను మంగళవారం తరలిస్తారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార కారాగారంలో వారికి ప్రత్యేక భద్రత కల్పించడం కష్టమైంది. ఇతర నిందితుల నుంచి సమస్య ఎదురవుతుందన్న ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిని తరలించేందుకు 24వ ఏసీఎంఎం న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. కారాగారంలో ఉన్న పలువురు రౌడీలకు- దర్శన్‌కు వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో, అతన్ని మరోచోటికి మార్చడమే ఉత్తమమని పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కారాగారంలో సోమవారం ఉదయం ములాఖత్‌ సమయంలో దర్శన్‌ను ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్‌ కలసి మాట్లాడారు. కుమారుడ్ని చూసి దర్శన్‌ కంట తడి పెట్టుకున్నాడు. ఇంకో వారంలో ఇంటికి వస్తానని ధైర్యం చెప్పి పంపించారని సమాచారం. కారాగారంలో ఇస్తున్న ఆహారం సరిపోవడం లేదని, ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని సిబ్బందిని దర్శన్‌ కోరాడు. ఇదే అంశంపై న్యాయస్థానంలో అర్జీ వేసుకుని అనుమతి తీసుకోవాలని జైలు అధికారులు అతనికి సూచించారు.

దర్శన్‌ను చూసేందుకు చిత్రదుర్గ, మండ్య తదితర జిల్లాల నుంచి అభిమానులు పరప్పన అగ్రహార కారాగారం వద్దకు రావడం సోమవారం కొనసాగింది. ఆదివారం సెలవు కావడంతో ములాఖత్‌కు అవకాశం ఉండదని కారాగార సిబ్బంది వారికి చెప్పి వెనక్కు పంపించారు. సోమవారం నాడూ అలానే అభిమానులు రావడంతో దర్శన్‌ ఎవరినీ భేటీ అయ్యేందుకు ఇష్టపడడం లేదని చెప్పి వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించారు.

నంబరుకు డిమాండ్‌: పరప్పన అగ్రహార కారాగారంలో దర్శన్‌కు ఖైదీ నంబరు 6106 కేటాయించారు. దర్శన్‌ అభిమానులు కొందరు ఆ నంబరును తమ వాహనాలకు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ధనుష్‌ అనే అభిమాని తాను కొత్తగా కొనుగోలు చేసుకున్న వాహనానికి అదే నంబరు వచ్చేలా ఆర్‌టీఓ కార్యాలయంలో వేలం పాటకు సిద్ధమయ్యాడు. బెంగళూరు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన అభిమానులు ఇదే నంబరును తీసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దర్శన్‌ విడుదలైతే 101 కొబ్బరికాయలు కొడతానని మరికొందరు అభిమానులు మొక్కులు మొక్కుకున్నారు. కొందరు అభిమానులు ఖైదీ నంబరును పచ్చగా వేయించుకున్నారు.

పట్టణగెరెలో సోదాలు: పట్టణగెరెలోని షెడ్డులోనే రేణుకాస్వామి జూన్‌ 8న హత్యకు గురయ్యారు. ఖాళీ స్థలం, దానిలోని షెడ్డుకు జయణ్ణ యజమాని. వివిధ కేసుల్లో నేరగాళ్ల నుంచి జప్తు చేసుకున్న వాహనాలను ఆ ఖాళీ స్థలంలో పోలీసులు ఉంచేవారు. కేసు పరిష్కారమైతే వాహనాలు ఇచ్చేవారు. కొన్ని సందర్భాల్లో వాహనం తమదే అని ఎవరూ ముందుకు రాకపోతే వాటిని వేలం వేసేవారు. వాహనాలను అక్కడ ఉంచేందుకు పోలీసు శాఖ జయణ్ణకు నగదు చెల్లించేది. ఈ ఆవరణ, షెడ్డుకు 2008 నుంచి ఆస్తి పన్ను చెల్లించడం లేదని పాలికె అధికారులు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. ఈ స్థలంలోని షెడ్డును సంఘ విద్రోహక శక్తులు వినియోగించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు.


పవిత్రా మౌనవ్రతం

హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్రాగౌడ తనకు కేటాయించిన బ్యారక్‌లో మౌనంగా ఉంటోందని కారాగార సిబ్బంది చెప్పారు. ఉదయం కాఫీ తాగి, దినపత్రిక చదవడం, అల్పాహారం అనంతరం కొంత సమయం విశ్రాంతి తీసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. కారాగారంలో మెనూ ప్రకారమే ఆమెకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఉప్పు, కారం, మసాలా లేని ఆహారం తినడం, చాపపై పడుకోవలసి రావడం, తీవ్రంగా ఉన్న దోమల సమస్యతో ఆమె సతమతం అవుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని