logo

హక్కుల హననమే కాంగ్రెస్‌ సంస్కృతి

కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి దేశ సమగ్రతకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విధానసభలో విపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు.  కాంగ్రెస్‌ అగ్రనాయకగణం.. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ దిల్లీలోని రామ్‌లీలా మైదానానికి వచ్చి అత్యయిక పరిస్థితిని విధించినందుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Published : 25 Jun 2024 02:50 IST

నినాదాలు రాసిన అట్టముక్కలతో పాత కారాగారం వెలుపల ధర్నా

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి దేశ సమగ్రతకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విధానసభలో విపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు.  కాంగ్రెస్‌ అగ్రనాయకగణం.. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ దిల్లీలోని రామ్‌లీలా మైదానానికి వచ్చి అత్యయిక పరిస్థితిని విధించినందుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించి 49 ఏళ్లయిన నేపథ్యంలో స్వాతంత్య్ర ఉద్యానంలో పాత సెంట్రల్‌ జైలు ఆవరణలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ నేతలు కుట్రకు తెరతీశారని దుయ్యబట్టారు. రాజ్యాంగం తమకు భగవద్గీతతో సమానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. పాత కారాగారం గోపురం, నమూనాగా ఉంచిన బ్యారక్‌ల వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌ కార్యాలయం గోడలపై పోస్టర్లు అంటించేందుకు వెళుతున్న ఆందోళనకారులను పోలీసులు బంధించి, హైగ్రౌండ్స్‌ ఠాణాకు తరలించారు. కొద్ది గంటల అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.  భాజపా నాయకులు డాక్టర్‌ అశ్వత్థ నారాయణ, మునిరాజు, ఎన్‌.రవికుమార్, ఛలవాది నారాయణ స్వామి, కేశవప్రసాద్‌ తదితరులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

అరెస్టయిన ఆందోళనకారులను బస్సులో తరలిస్తున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని