logo

ఐటీ కొలువుల మాయానగరి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవీన్‌ కుమార్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. ఆ కోర్సు పూర్తి చేయాలనుకున్నదే బెంగళూరులో ఉద్యోగం కోసమట అనుకున్నట్లు పట్టా అందుకున్న అతను ఓ నియామకాల వెబ్‌సైట్‌లో తన అర్హతలన్నీ అప్‌లోడ్‌ చేశాడు.

Published : 25 Jun 2024 03:04 IST

ఆన్‌లైన్‌ ఉద్యోగాల అక్రమాలకు కేంద్రం
నకిలీ డిగ్రీలపై విశ్వవిద్యాలయాల నిఘా

కాల్‌సెంటర్‌ నుంచి ఫోన్‌ వచ్చిందా.. కాస్త ఆలోచించండి

ఈనాడు, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవీన్‌ కుమార్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. ఆ కోర్సు పూర్తి చేయాలనుకున్నదే బెంగళూరులో ఉద్యోగం కోసమట అనుకున్నట్లు పట్టా అందుకున్న అతను ఓ నియామకాల వెబ్‌సైట్‌లో తన అర్హతలన్నీ అప్‌లోడ్‌ చేశాడు. అలా ఓ వారం తిరక్కుండానే ఓ రిక్రూటర్‌ కార్యాలయం నుంచి ఫోనొచ్చింది. వెనువెంటనే మెయిల్‌ కూడా వచ్చింది. అందులో మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.. వెంటనే బెంగళూరుకు రండంటూ చిరునామాతో పాటు లొకేషన్‌ కూడా పంపారు. ఇంకేముందీ.. తనకు ఉద్యోగం వచ్చినట్లేనని ఎగిరి గంతేసిన నవీన్‌ కుమార్‌ ఆ కంపెనీ మానవవనరుల (హెచ్‌ఆర్‌) విభాగం పంపిన చిరునామాకు చేరుకున్నారు. అది మారతహళ్లిలోని ఓ వీధికి దారి చూపింది. హెచ్‌ఆర్‌ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అదేదో మంచి కంపెనీ అనుకున్న నవీన్‌కుమార్‌ చిరునామాకు చేరుకోగానే విస్తుపోయాడు. కనీసం కంపెనీ బోర్డు లేని కార్యాలయంలో ఓ ఇరుకు గది చూపిన హెచ్‌ఆర్‌.. మేము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులయితే ఎలాంటి విచారణ (వెరిఫికేషన్‌) లేకుండా ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఒక పరీక్షకు రూ.500లు, ఇంకో పరీక్ష అదనంగా రాస్తే రూ.1000 కట్టాలని సూచించారు. నవీన్‌కుమార్‌కు అక్కడే అనుమానం మొదలైంది. వెరిఫికేషన్‌ లేకుండా ఉద్యోగం ఎలా ఇస్తారు? ఇదేదో మోసంలా ఉందంటూ వారితో వాదించారు. నేను రుసుము చెల్లించనంటూ తిరిగి వెళ్తుంటే అక్కడి సిబ్బంది వారించారు. ‘నీ వల్ల మాకు వెయ్యి రూపాయలు నష్టమొచ్చింది’ అంటూ అడ్డుకున్నారు. వారి అసలు రూపాన్ని బయటపెట్టారు. ఇక చేసేది లేక నవీన్‌ కుమార్‌ రూ.500 చెల్లించి మొక్కుబడిగా పరీక్ష రాసి బయటపడ్డాడు. నవీన్‌కుమార్‌పై నిఘా ఉంచిన ఆ సిబ్బంది అతను ఇతర యువకులతో మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి పంపారు. ఇది అక్షరాలా గత నెల 25న మారతహళ్లిలో టెక్నాలజీస్‌ పేరిట నిరుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిచి మోసగించగా.. ఆ బాధిత యువకుడు స్వయంగా వెల్లండించిన వివరాలివి. మారతహళ్లి నుంచే పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవటం గమనార్హం.

ఎందరికో టోకరా

తన నిజమైన పేరు చెప్పేందుకు ఇష్టపడని నవీన్‌కుమార్‌ లాగానే రోజుకు వందలాది మంది నిరుద్యోగులకు కేవలం మారతహళ్లిలోని ఆ ప్రాంతంలోనే నకిలీ పరీక్షలు, నకిలీ ఇంటర్వ్యూలు యథేచ్ఛగా నిర్వహిస్తుంటారు. గంటకు కనీసం 200 మంది చొప్పున ఐదు గంటల్లో వెయ్యి మంది ఈ పరీక్షకు హాజరయ్యేలా నకిలీ నిర్వాహక సంస్థ సన్నాహకాలు చేస్తుంటుంది. ఒకరి నుంచి కనీసం రూ.500 వసూలు చేసినా వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుంటుంది. పరీక్ష రాసిన తర్వాత ఆ యువకులకు ఉద్యోగంలో ఎంపిక అయిన తర్వాత సమాచారం ఇస్తామంటారు. ఆ సమాచారం రాదన్న సంగతి నవీన్‌కుమార్‌ వంటి యువకులకు మాత్రమే తెలుసు. ఇలాంటి నియామక అక్రమాలకు బెంగళూరు నగరం అడ్డాగా మారింది. కేవలం నియామకాలే కాదు.. నకిలీ పట్టాల తయారీలోనూ ఐటీ హబ్‌ కాస్త నకిలీ హబ్‌గా మారిపోయింది.

నేరాల తీవ్రత..

శనివారం కర్ణాటక నేర నివేదికల సంస్థ (క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో-ఎస్‌సీఆర్‌బీ) ఆన్‌లైన్‌ నియామకాల అక్రమాల (ఆన్‌లైన్‌ జాబ్‌ ఫ్రాడ్స్‌) వివరాలు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం 2020 నుంచి 2024 మే 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9,479 ఆన్‌లైన్‌ జాబ్‌ ఫ్రాడ్స్‌ కేసులు నమోదు కాగా అందులో 6,905 కేసులు బెంగళూరులోనే గుర్తించారు. మొత్తం కేసుల్లో 73 శాతం బెంగళూరులోనే వెలుగుచూశాయి. వైట్‌ఫీల్డ్, మారతహళ్లి, ఎలక్ట్రానిక్స్‌ సిటీ పరిధిలోని పోలీసు స్టేషన్లలో రోజుకు 50కి పైగా ఇలాంటి కేసులు నమోదవుతుండగా, అందులో 20 కేసులు ఆన్‌లైన్‌ జాబ్‌ అక్రమాలకు చెందినవే. బెంగళూరు నగరంలో పెరుగుతున్న ఐటీ, అంకుర కార్యాలయాలు, ఆకర్షణీయమైన వేతనాల కారణంగా దేశంలోని నిరుద్యోగ యువత ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌ వేదికల ద్వారా నకిలీ రిక్రూటర్లు, జాబ్‌ స్క్యామర్లు పుట్టుకొస్తున్నారు.

నకిలీ పట్టాలు..

కేవలం ఉద్యోగాల విషయంలోనే కాదు నకిలీ పట్టాలను సృష్టించి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో యథేచ్ఛగా చేరుతున్నట్లు సీసీబీ పోలీసులు గుర్తించారు. ఒక్క బెంగళూరు విశ్వవిద్యాలయంలోనే 2022-23 ఏడాది నుంచి వేల మంది విద్యార్థులు పట్టాలు పొందుతుండగా.. వీరిలో ఐదు శాతం మంది నకిలీ పట్టాలతో ప్రవేశాలు పొందినట్లు సీసీబీ విచారణలో తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీల దందా ఆసరాతో పట్టాలు పొందుతున్నారు. గతేడాది రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో వేలాది మంది నకిలీ పట్టాలతో ప్రవేశాలు పొందినట్లు సీసీబీ అధికారులు ఆయా విశ్వవిద్యాలయాలకు సమాచారం అందించారు. వెయ్యికి పైగా నకిలీ పట్టాలున్నట్లు గుర్తించి వాటిపై నివేదిక ఇవ్వాలని ఆయా విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి.

గతంలో భారీగా స్వాధీనం చేసుకున్న నకిలీ స్టాంపులు


నిరుద్యోగులే లక్ష్యం

సాధారణంగా బస్టాండులు, రహదారుల కూడళ్ల వద్ద నియామకాల పేరిట గోడపత్రాలను అంటించటం, ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా నిరుద్యోగులకు గాలం వేస్తుంటారు. గత ఐదేళ్లలో నమోదైన కేసులు పదేళ్ల కిందటి నాటి కేసులతో పోలిస్తే తక్కువగా ఉన్నా బాధితులకు జరిగే నష్టం ఎక్కువే. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, పార్ట్‌టైమ్‌గా ఉద్యోగాలు చేయాలనుకునే వారే ఈ అక్రమాలకు బలవుతుంటారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారు ఎక్కువగా విదేశీయులే ఉంటారు. కాంబోడియా నుంచి ఎక్కువగా ఇలాంటి రిక్రూటర్లు మోసాలు చేస్తుంటారు. బ్యాంకులు, కాల్‌సెంటర్లలో పని చేసిన సిబ్బంది తాము సేకరించే ఫోన్లు, మెయిల్‌లను ఈ నకిలీ ముఠాలకు ఇస్తుంటారు.

ఎంఎ.సలీమ్, డీజీపీ, సీఐడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని