logo

ఈ బంధం.. అపురూపం

చామరాజనగర ప్రజలకు- తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించిన ఇక్కడి ఓటర్లకు రుణ పడి ఉంటానని తెలిపారు.

Updated : 11 Jul 2024 06:40 IST

చామరాజనగరలో సిద్ధరామయ్య

వేదికపై ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న నేతలు, ప్రముఖులు

చామరాజనగర, న్యూస్‌టుడే : చామరాజనగర ప్రజలకు- తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించిన ఇక్కడి ఓటర్లకు రుణ పడి ఉంటానని తెలిపారు. చామరాజనగరలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై లోక్‌సభ సభ్యులు నిరంతరం పోరాటం చేస్తారని తెలిపారు. అంబేడ్కర్‌ తీర్చిదిద్దిన రాజ్యాంగంపై గౌరవాన్ని ఉంచి పాలన చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించే దిశగా గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. స్వాతంత్య్ర పోరాటంలో పలువురు గాంధేయవాదులు పాల్గొనగా, సంఘ పరివార సభ్యులు మాత్రం బ్రిటిష్‌ వారి తరఫున పని చేశారని వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ప్రకటించిన అన్ని అభివృద్ధి పనులకు నగదు కొరత లేదని స్పష్టం చేశారు. కరవు సమయంలోనూ నిధులు విడుదల చేయకపోవడంతో సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిందని తెలిపారు. న్యాయస్థానం మందలించిన అనంతరమే కేంద్రం కొంత మొత్తంలో పరిహారాన్ని విడుదల చేసిందని గుర్తు చేశారు. ఎంపీ సునీల్‌ బోస్, మంత్రులు హెచ్‌సీ మహదేవప్ప, వెంకటేశ్, జమీర్‌ అహ్మద్‌ ఖాన్, కేహెచ్‌ మునియప్ప, ఎమ్మెల్సీ డాక్టర్‌ యతీంద్ర సిద్ధరామయ్య, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు బహిరంగ సభలో పాల్గొన్నారు.

చరిత్రను అర్థం చేసుకుంటేనే భవిత

మైసూరు: రాజ్యాంగం లేకపోతే నేను ముఖ్యమంత్రిని అయి ఉండేవాడిని కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ పుణ్యంతోనే సమసమాజ సాధన సాధ్యమవుతోందని పేర్కొన్నారు. కుల, మతాలు, వర్ణ భేదాలను దేవుడు సృష్టించలేదని, మనుషులే స్వార్థానికి సృష్టించారని అన్నారు. నంజగగూడులో దళిత, సామాజిక కార్యకర్తలు బుధవారం సాయంత్రం నిర్వహించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవంలో ప్రతిభావంత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఇతర ప్రోత్సాహకాలకు ఆయన అందించారు. అంబేడ్కర్‌ జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. చరిత్రను అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తును రూపొందించడం సాధ్యం కాదని అంబేడ్కర్‌ పలు దశాబ్దాల ముందే చెప్పారని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకునే వారిపై పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. మంత్రి మహదేవప్ప, ఎమ్మెల్యే దర్శన్‌ ధ్రువనారాయణ, ఎమ్మెల్యేలు, దళిత నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని