logo

నాగేంద్ర.. అవినీతి ముద్ర?

మహర్షి వాల్మీకి షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న రూ.94.73 కోట్ల నగదు అక్రమాల దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముమ్మరం చేసింది.

Published : 11 Jul 2024 02:18 IST

ఈడీ సోదాలతో కలకలం

మాజీ మంత్రి నాగేంద్ర

]బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : మహర్షి వాల్మీకి షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న రూ.94.73 కోట్ల నగదు అక్రమాల దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముమ్మరం చేసింది. బెంగళూరు, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో 18 చోట్ల బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు కొనసాగించింది. రాత్రి పొద్దుపోయేంత వరకు సోదా చేశారు. మాజీ మంత్రి నాగేంద్రకు బెంగళూరు, బళ్లారిలోని నివాసాలు, రాయచూరు, యలహంకల్లోని ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌ నివాసం, బెంగళూరు వసంతనగరలోని కార్పొరేషన్‌ కార్యాలయాల్లో దస్త్రాలు పరిశీలించారు. ఈ కేసులో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) 11 మందిని అరెస్టు చేసి, రూ.30 కోట్లకు పైగా నగదును జప్తు చేసుకుంది. హవాలా మార్గంలో హైదరాబాద్‌కు, ఇతర ప్రాంతాలకు నగదు బదిలీ అయిందని భాజపా నాయకుడు రమేశ్‌ గత నెల శాంతినగరలోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎంజీ రోడ్డులోని యూనియన్‌ బ్యాంకు డిప్యూటీ మేనేజరు డి.దీప పరారీలో ఉండడంతో విజయనగరలోని ఆమె నివాసాన్ని సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. ఈడీ అధికారులతో కలిసి ఎంజీ రోడ్డులోని యూనియన్‌ బ్యాంకు శాఖలో దస్త్రాలను సీబీఐ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. బెంగళూరులో నాగేంద్రకు ఆప్తులు హరీశ్‌ను బెంగళూరులో, విజయకుమార్, చేతన్‌లను బళ్లారిలో అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. హరీశ్‌ను శాంతినగరలోని ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. దాడుల సమయంలో పోలీసులతో పాటు, సీఆర్‌పీఎఫ్‌ యోధుల సాయాన్ని తీసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే దాడుల జరిగాయని మంత్రి ఎంబీ పాటిల్‌ వ్యాఖ్యానించారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఈడీ దాడి చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని హోం మంత్రి పరమేశ్వర్‌ పేర్కొన్నారు. ఈ కుంభకోణం ద్వారా సమకూర్చుకున్న నగదుతోనే కాంగ్రెస్‌ రెండు నియోజకవర్గాల్లో గెలుపొందిందని మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి ఆరోపించారు. ఈడీ దాడులపై నేనిపుడేమీ వ్యాఖ్యానించనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరులో వ్యాఖ్యానించారు.
 

బెంగళూరులోని నాగేంద్ర నివాస సముదాయంలో ఓ భాగం.. ఇక్కడే ఈడీ సోదాలు కొనసాగాయి..
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని