logo

సభాపర్వంలో మాటల యుద్ధమే

లోక్‌సభ, విధాన పరిషత్తు ఎన్నికల తర్వాత విధానసభ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు సచివాలయం అన్ని వ్యవస్థలనూ సిద్ధం చేస్తోంది.

Published : 11 Jul 2024 02:29 IST

 ఈసారి సమావేశాల్లో హోరాహోరీ

అధికార పక్షానికి విపక్షం పగ్గాలు 

విధానసౌధ గచ్చు శుభ్రం చేస్తున్న కార్మికులు
ఈనాడు, బెంగళూరు : లోక్‌సభ, విధాన పరిషత్తు ఎన్నికల తర్వాత విధానసభ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు సచివాలయం అన్ని వ్యవస్థలనూ సిద్ధం చేస్తోంది. స్పీకర్‌ యు.టి.ఖాదర్‌ నేడో, రేపో ఈ సమావేశాల సమగ్ర కార్యకలాపాల వివరాలను వెల్లడిస్తారు. సమావేశాల నిర్వహణ విధానం యథావిధిగా సాగనున్నా పార్టీల వ్యూహాలు మాత్రం ప్రతి సమావేశాలకు ప్రత్యేకంగా మారనున్నాయి. ఇలా ఈసారి సమావేశాలు పార్టీలకు ఎంతో ప్రత్యేకంగా మారాయి. రానున్న నాలుగేళ్లకు అవసరమైన చర్చా వేదికలను ఈ సమావేశాల ద్వారా సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలు, ఓ ప్రాంతీయ పార్టీ ఈ సమావేశాలను శాసనసభ వ్యవహారాలతో పాటు రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు ఓ అవకాశంగా మార్చుకోనున్నాయి.

ఫలితాల నేపథ్యం..

2019 ఎన్నికల సమయానికి కాంగ్రెస్, జనతాదళ్‌ సంకీర్ణ ప్రభుత్వం ఉండగా ఈసారి ఆ సన్నివేశం అటు ఇటుగా మారింది. అప్పట్లో ఒంటరిగా పోటీ చేసిన భాజపా 25 స్థానాల్లో గెలవగా ఈసారి జేడీఎస్‌తో ఎన్నికల ముందు పొత్తు చేసుకుని 19 స్థానాలను పరిమితమైంది. గత ఎన్నికల్లో ఒకే స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌ ఈసారి ఆ సంఖ్యను 9కి చేర్చుకుంది. లక్ష్యానికి తగిన సీట్లు సాధించలేదన్న ఆవేదన పార్టీ వర్గాల్లో నాటుకుపోయింది. ఈ ఫలితాల తర్వాత సమావేశమయ్యే విధానసభను శాసనసభా వ్యవహారాల కంటే రాజకీయ అంశాలే ఆసక్తిగా మార్చనున్నాయి. ఎన్‌డీఏ కూటమి ఓ వైపు, అధికార పక్షం మరోవైపు సభలో సందడి చేయనున్నాయి. జాతీయ స్థాయిలోనూ మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేసిన భాజపా ఒంటరిగా మెజార్టీ సాధించకపోయినా ఇండియా కూటమిని గట్టిగా ఎదుర్కొంది. పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఎన్‌డీఏ, ఇండియా కూటమి సభ్యుల మధ్య పోరు ప్రభావం విధానసభ సమావేశాల్లోనూ పరోక్షంగా పడే అవకాశాలు లేకపోలేదు. ఆ సమావేశాల్లో కొత్తగా నియమితులైన సభా నాయకులు, సభ్యుల వ్యవహార శైలిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి నేత రాహుల్‌గాంధీ హిందూమతం, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల సెగ ఇక్కడా కనిపించక మానదు.

అక్రమాల గోల

రాష్ట్రంలో ఈ నాలుగు నెలల కాలంలో ప్రముఖులపై నమోదైన కేసులు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై పార్టీల మధ్య వాగ్వాదానికి తావిచ్చే వీలుంది. ఓ వైపు జేడీఎస్‌ నేత హెచ్‌.డి.రేవణ్ణ కుటుంబంపై నమోదైన కేసులు ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చకు అవకాశం ఉంది. ఆ కేసులను రాజకీయ ప్రేరితంగా అభివర్ణిస్తున్న జేడీఎస్‌ ఈ సభలో వాటిపై గట్టిగా నిలదీసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు సినీ నటుడు దర్శన్, యడియూరప్పపై నమోదైన కేసులు కూడా ప్రస్తావనకు వస్తాయి. ఇక ప్రభుత్వం ఎదుర్కొంటున్న వాల్మీకి ఎస్‌టీ అభివృద్ధి మండలి అక్రమాలు, ఆ అక్రమాలపై మాజీ మంత్రి నాగేంద్ర, మండలి అధ్యక్షుడి ఇంటిపై ఈడీ దాడులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ముడా స్థలాల పంపిణీ వ్యవహారం ఈ సభలో వేడి పుట్టించక మానదు. ఇప్పటికే భాజపా నేతృత్వంలో ఈ అక్రమాలపై ఆందోళన చేపడుతుండగా సభను స్తంభింపజేసేందుకు కమల శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఈ అక్రమాలు ముఖ్యమంత్రి స్థానం కోసం వస్తున్న పోటీ నేపథ్యంలో బయటపడ్డాయన్న కుమారస్వామి వ్యాఖ్య కూడా ఈ సభలో ప్రస్తావనకు రానుంది.

కీలక నేతలు..

సభలో ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్న ఆర్‌.అశోక్‌ కంటే మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రాజకీయ అనుభవమే భాజపాకు బలం. పేరుకు విపక్ష నేత కాకున్నా రెండు సమావేశాల్లో బసవరాజ బొమ్మై భాజపా తరఫున అధికార పక్షాన్ని గట్టిగా నిలదీశారు. బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఆయన ప్రసంగమే విపక్షానికి ప్రధాన చర్చగా రికార్డులకెక్కింది. పైగా ముడా అక్రమాలకు సంబంధించి బసవరాజ బొమ్మై పేరు ప్రధాన వినిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ స్థలాల పంపిణీ ప్రక్రియ నిర్వహించినట్లు ముఖ్యమంత్రితో పాటు ముడా అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈ ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చే అవకాశం లేదు. లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఇటీవలే ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఇకపై ఈ సమావేశాల్లో ఆర్‌.అశోక్‌ మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంది. సీనియర్లైన అరగజ్ఞానేంద్ర, అశ్వత్థనారాయణతో పాటు విపక్ష ఉపనేత అరవింద్‌ బెల్లద్‌లే భాజపా శ్రేణులకు నాయకత్వం వహిస్తారు. మరోవైపు జేడీఎస్‌కు సభా నాయకుడిగా ఉన్న కుమారస్వామి కూడా లోక్‌సభకు ఎన్నికవటం, ఆయన తర్వాతి స్థానాన్ని ఆక్రమించే హెచ్‌.డి.రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుల్లో నిలువునా మునిగిపోవటంతో దళపతులకు నాయకుడు లేని స్థితి నెలకొంది. కేంద్రమంత్రిగా నియమితులైన కుమారస్వామి ఇటీవలే తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సమావేశాల్లో జేడీఎస్‌ శ్రేణులకు ఆపార్టీ కోర్‌ కమిటీ అధ్యక్షులు జి.టి.దేవేగౌడ నాయకత్వం వహించాల్సి వస్తోంది.

అధికార పక్షానికి సవాలు

ఈ సమావేశాల్లో అధికార పక్షం గట్టి సవాలును ఎదుర్కోక తప్పదు. అధికారం, గ్యారంటీల బలం ఉన్నా రెండంకెల స్థానాలు దక్కించుకోలేని కాంగ్రెస్‌ మానసికంగా కుంగిపోయింది. వీటికి తోడు వాల్మీకి ఎస్‌టీ మండలి, ముడా అక్రమాలపై విపక్షాలు సంధించే ప్రశ్నలకు గట్టిగా బదులివ్వాల్సి ఉంది. సభా నాయకుడు సిద్ధరామయ్య పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నా ఆయనపైనే వచ్చిన ఆరోపణలకు ఎలా బదులిస్తారో చూడాలి. మరోవైపు గ్యారంటీలపై వస్తున్న ఆరోపణలు, ఇంధన, పాల ధరలతో పాటు ముద్రణ, రిజిస్ట్రేషన్‌ పన్నుల పెంపుపై హేతుబద్ధంగా బదులివ్వాలి. ఇదే సందర్భంగా డెంగీ కేసుల తీవ్రతపైనా సర్కారు విమర్శలు ఎదుర్కొంటోంది. విధానపరిషత్తులో బలం లేని అధికార పక్షం ఇదే సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్యా సమీక్ష(కులగణన)ను ఎలా గట్లెక్కిస్తుందో చూడాలి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని