logo

Pavithra Gowda: దర్శన్‌కు చెప్పి.. పొరపాటు చేశా

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు- కథానాయకుడు దర్శన్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆ కేసులో ప్రథమ నిందితురాలు- వెండితెర నాయకి పవిత్రగౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసింది.

Updated : 14 Jun 2024 07:25 IST

పవిత్రగౌడ కన్నీరుమున్నీరు

పవిత్రా గౌడ 

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు- కథానాయకుడు దర్శన్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆ కేసులో ప్రథమ నిందితురాలు- వెండితెర నాయకి పవిత్రగౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసింది. తానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని విచారణ అధికారుల ముందు ఆమె రోదించింది. స్వామి హత్య కేసుకు సంబంధించి బుధవారం నాటి విచారణలో ధీమాగా ఉన్న ఆమె, గురువారం విచారణ సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైందని గుర్తించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే తలా రూ.5 లక్షలు తీసుకున్న కొందరి నుంచి నగదు జప్తు చేసేందుకు అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.

మరోవైపు.. తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత అవసరం అని వారి కుమారుడు వినీశ్‌ తూగుదీప సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టాడు. ‘తన తండ్రిని అశ్లీల పదాలతో దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ ఆవేదనతో మరో పోస్టు పెట్టాడు. తన తండ్రి హత్య చేసి ఉంటారని నేను విశ్వసించడం లేదని, దర్యాప్తు పూర్తయిన అనంతరమే ఆపని ఎవరు చేశారో బయట పడుతుందని మరో పోస్టులో వినీశ్‌ రాసుకున్నాడు. ‘డెవిల్‌’ సినిమాకు దర్శన్‌ రూ.22 కోట్లు తీసుకున్నాడని ఆ చిత్ర దర్శకుడు ప్రకాశ్‌ వీర్‌ పేర్కొన్నారు. ‘కాటేర’ సినిమా విజయవంతమైన అనంతరం దర్శన్‌ తాజాగా డెవిల్‌ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమా ఇప్పటికే 25 రోజుల చిత్రీకరణ పూర్తయింది. చిత్రీకరణ సమయంలో ఎడమ చేతికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చిత్రీకరణ వాయిదా పడింది. బుధవారం ఆయన చిత్రీకరణలో పాల్గొనేందుకు పచ్చ జెండా ఊపగా.. మరోవైపు హత్య కేసులో పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేశారు.

తన బూటు కాలితో రేణుకాస్వామి మర్మాంగంపై తన్నడంతోనే అతను మరణించాడని ఇప్పటి వరకు నిర్వహించిన విచారణలో ఇతర నిందితులు పోలీసులకు వివరించారు. ‘మొదట అతని మొహంపై దర్శన్‌ పిడిగుద్దులు కురిపించాడు. కింద పడుతున్న స్వామి తల పక్కనే నిలిపి ఉంచిన టెంపోకు తగిలింది. స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంటున్న అతని మర్మావయాలపై దర్శన్‌ తన్నడంతోనే మరణించాడు’ అని నిందితులు పోలీసుల విచారణ సమయంలో ఘటనను వివరించారని సమాచారం. మరణోత్తర పరీక్షల నివేదికలోనూ రేణుకాస్వామి మరణానికి ఇదే కారణమని ఉందని పోలీసులు గుర్తించారు. 


మండ్య: ప్రజ్వల్‌ రేవణ్ణ, దర్శన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులు 

  • హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్, నటుడు దర్శన్‌ వ్యవహార శైలికి వ్యతిరేకంగా మండ్యలో రైతులు ధర్నా, నిరసన ప్రదర్శనలను గురువారం నిర్వహించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేసి, శిక్ష విధించాలని రైతులు డిమాండ్‌ చేశారు. హత్య అనంతరం దర్శన్‌ ఒక పోలీసు అధికారికి ఫోన్‌ చేశాడని, అతని సూచనల మేరకే మృతదేహాన్ని కామాక్షిపాళ్యలో పడేశారని సమాచారం. చిత్రదుర్గకు వెళ్లి జూన్‌ 8న ఉదయం 11 గంటలకు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరుకు తీసుకువచ్చి, పట్టణగెరెలోని షెడ్డులో హత్య చేశారని గుర్తించారు. హత్యకు ముందు, అనంతరం కామాక్షిపాళ్యలోని స్టోనీ బ్రూక్‌ హోటల్‌లో నిందితులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నిందితుల్లో ఒకడైన నవీన్‌కు చెందిన ఈ హోటల్‌ను గురువారం సీజ్‌ చేశారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని