logo

Renukaswamy murder case: హత్య వెనుక అదృశ్య శక్తులు?

రాష్ట్రంలో సంచలనంగా మారిన చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేయగా 28 ప్రదేశాల్లో వారిని మహజరు చేసిన అధికారులు 139కీ పైగా సాక్ష్యాలను సేకరించారు.

Updated : 22 Jun 2024 09:23 IST

రేణుకాస్వామి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్రంలో సంచలనంగా మారిన చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేయగా 28 ప్రదేశాల్లో వారిని మహజరు చేసిన అధికారులు 139కీ పైగా సాక్ష్యాలను సేకరించారు. ఈ సంఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితులకు కొందరు సహాయపడేందుకు ప్రయత్నించారు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి రహస్యంగా సహకరించారని అధికారులు ఇలా ఎవరెవరు సహకరించిందీ తెలుసుకునేందుకు కథానాయకుడు దర్శన్‌తో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా విచారిస్తున్నారు.

దర్శన్‌ అడిగిన వెంటనే రూ.40 లక్షలు సమకూర్చిన మోహన్‌రాజ్‌ ఆచూకీ తెలియలేదు. ఆ నగదులో రూ.37 లక్షలను ఇప్పటికే సీజ్‌ చేశారు. ఓ మేకప్‌మెన్‌ సాయంతో భార్య విజయలక్ష్మీ రూ.3 లక్షలు సమకూర్చారనేది మరో సమాచారం. నలుగురు వ్యక్తుల నుంచి ఆ మొత్తాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నగదు వారికి ఎలా సమకూరిందీ తెలుసుకునేందుకు ఆదాయ పన్నుల శాఖ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. పవిత్రాగౌడ- రేణుకాస్వామి మధ్య సాగిన సెల్‌ఫోన్‌ మెసేజ్‌లను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మెసేజ్‌లకు పవిత్ర ఆగ్రహించి, హత్య చేయించిందని చెబుతున్నా.. స్వామి సెల్‌ఫోన్‌ ఇంకా లభించనేలేదు. ఆయనను ఎలా హతమార్చిందీ మరో నిందితుడు వినయ్‌ తన సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేశాడని అనుమానిస్తున్నా.. ఆ వివరాలను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

నిందితురాలు పవిత్రాగౌడను గురువారం పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. ఆమెకు విచారణ ఖైదీ సంఖ్య -6024ను అధికారులు కేటాయించారు. రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. పదే పదే లేచి గదిలో పచార్లు చేశారు. ఆమెతో పాటు తొమ్మిది మందిని ఏసీఎంఎం న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న పవిత్ర.. కారాగారం గదిలో ఒంటరిగా మారారు. నిద్ర రాక పదేపదే లేచి కూర్చున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదింటికే లేచి పరిసరాల్లో నడక సాగించారు. ఆపై ఉపాహారం ఆరగించి, కాఫీ తాగారు. హత్య కేసులో ఆమె ప్రథమ నిందితురాలు. ఆమె ఆదేశాలతోనే మిగిలిన వారు రేణుకాస్వామిపై దాడిచేసి చంపారనేది అభియోగం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని