బొగ్గు కొరత నివారణే లక్ష్యం
కుడితిని విద్యుదుత్పాదన కేంద్రానికీ బొగ్గు కొరతే
ఈనాడు డిజిటల్, బెంగళూరు : దేశవ్యాప్తంగా బొగ్గు కొరతపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ కొరత తాత్కాలికమేనని కేంద్రం కొట్టిపారేస్తున్నా రాష్ట్రంలో పరిస్థితి వాస్తవాంశాలు భయపెట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, కేపీసీఎల్ ఎండి పొన్నురాజ్, కేపీటీసీఎల్ ఎండీ మంజుల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం బొగ్గు ఉత్పత్తి వివరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఆపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
* రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 153.669మిలియన్ యూనిట్లు. ఇందుకు అవసరమైన బొగ్గు సిద్ధంగా లేదు. రాయచూరు, బళ్లారి, యరమరస్లకు చెందిన 13 ప్రభుత్వ రంగం థర్మల్ విద్యుత్తు యూనిట్లలో కేవలం ఆరు మాత్రమే ఉత్పాదకతను చేపడుతున్నాయి. వీటి నుంచి ప్రతి నిత్యం 37.920 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. జల విద్యుత్తు స్థావరాల నుంచి 37.050 మిలియన్ యూనిట్లు, సౌర, పవన, గ్యాస్ విద్యుత్ కేంద్రాల నుంచి 0.1154 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతోంది. ప్రైవేటు, కేంద్ర గ్రిడ్ల నుంచి మరో 81.585 మిలియన్ యూనిట్ల విద్యుత్తు రాష్ట్రానికి రావాలి. తాజాగా ఈ స్థాయిలో ఉత్పత్తి సాధ్యపడని కారణంగా రానున్న రోజుల్లో కొరత తీవ్రంగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు.
* బళ్లారి థర్మల్ యూనిట్‌కు నిత్యం 25 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం 8-10వేల టన్నులు మాత్రమే ఈ స్థావరానికి చేరుతోంది. సోమ, మంగళవారాల్లో కేవలం ఐదు ర్యాక్‌ల బొగ్గు మాత్రమే చేరింది. ప్రస్తుతం ఉన్న బొగ్గు కేవలం 12 వేల టన్నులు మాత్రమే. మరో 13 వేల టన్నుల కొరత ఉంది. రాయచూరులోనూ 27 వేల టన్నులు, యరమరస్‌లో 16 వేల టన్నుల బొగ్గు కొరత నిత్యం కనిపిస్తోంది.
ప్రత్యామ్నయాలపై దృష్టి
ఓ వైపు కేంద్రం నుంచి బొగ్గు అవసరమైన స్థాయిలో రాబట్టుకొంటూనే ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్తు సరఫరాను అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు గదగ జిల్లా కప్పతగుడ్డ పవన విద్యుత్తు, సౌరవిద్యుత్తు కేంద్రాల సాయంతో సరిహద్దు జిల్లాలకు కొరత రాకుండా చూడటం కీలకాంశం. అవసరమైతే అణువిద్యుత్తు ఉత్పాదన పెంచే విధానాలపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. కైగా అణు కేంద్రానికి అనుబంధంగా ఉన్న నాలుగు యూనిట్లలో నిత్యం 220 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్నా రాష్ట్ర అవసరాలకు సరిపడా అందించలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెట్టుబడులపై ప్రభావం
రాష్ట్రంలో విద్యుత్తు సమస్య తలెత్తితే పెట్టుబడులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పాలన సమయంలో విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు విక్రయించేవాళ్లమని, ప్రస్తుతం బొగ్గు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని పార్టీ ప్రతినిధి ఒకరు తప్పుపట్టారు. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యంగా విమర్శించారు.
బొగ్గు నిల్వలపై విధానసౌధలో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజబొమ్మై