logo

అంజనాద్రిపై సర్వత్రా ఆసక్తి

దశాబ్దకాలం కిందటి వరకు ఆ ప్రాంతం స్థానికులకు మాత్రమే పరిచయం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అలనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని నగరమైన హంపీకి కూత వేటు దూరంలో ఉన్న అంజనాద్రికి రామాయణ కాలంతో విడదీయరాని

Published : 28 Jan 2022 01:29 IST

దిగువన నిర్మించనున్న హనుమ క్షేత్రం ఊహాచిత్రం

 

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే: దశాబ్దకాలం కిందటి వరకు ఆ ప్రాంతం స్థానికులకు మాత్రమే పరిచయం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అలనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని నగరమైన హంపీకి కూత వేటు దూరంలో ఉన్న అంజనాద్రికి రామాయణ కాలంతో విడదీయరాని అనుబంధం ఉంది. రామాయణంలో ప్రధాన ఘట్టమైన సీతాపహరణ సందర్భంలో శ్రీరామచంద్రుడితో స్నేహం చేసిన హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే. అయోధ్యలో రామాలయం రూపుదిద్దుకుంటున్న సమయంలో శ్రీరామ బంటు హనుమ జన్మస్థలమైన అంజనాద్రిని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలనేది భక్తుల ఆశయం. ఈ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. సి.పి.యోగీశ్వర్‌ పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో అంజనాద్రి అభివృద్ధికి బృహత్‌ ప్రణాళికను రూపొందించారు. ఈ మహా గిరిధామాన్ని చేరుకునేందుకు తీగ మార్గం ఏర్పాటు, కొండపైన వివిధ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు అప్పట్లో వెల్లడించారు. పనులన్నింటికీ రూ.500 కోట్ల వరకు వ్యయం అవుతాయని అంచనా. ఇటీవల హుబ్బళ్లిలో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో అంజనాద్రి అభివృద్ధి అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొండ అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రాష్ట్రాన్ని సందర్శించే అవకాశాలున్న నేపథ్యంలో- ఆ సమయంలోనే అంజనాద్రి అభివృద్ధి పనులను ఆయనతోనే ప్రారంభించాలనే ఆలోచనలో కమలనాథులున్నట్లు సమాచారం. అంజనాద్రిని ప్రధాని సందర్శించేందుకు పరిస్థితులు అనుకూలించని పక్షంలో వర్చువల్‌ ద్వారా ఆ ప్రక్రియను చేపట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి తుదినిర్ణయం తీసుకోనప్పటికీ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయని పార్టీ నాయకులు తెలిపారు.అంజనాద్రి దిగువన హనుమాన్‌ జన్మభూమి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 216 మీటర్ల హనుమంతుడి విగ్రహాన్ని నెలకొల్పడంతో పాటు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో రామాయణ థీమ్‌ పార్క్‌ను అభివృధ్ధి చేయాలని సంకల్పించారు. ఈ పనులన్నీ పూర్తయితే అంజనాద్రి ఓ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.


గిరిధామం పైనుంచి చూస్తే కనిపించే తుంగభద్ర నది

హంపీ సమీపంలోని అంజనాద్రి గిరిధామం


అంజనాద్రిపైకి చేరుకోవడానికి మెట్లదారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని