logo

పాలికె పోరుకు కమలనాథుల సై!

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల నిర్వహణకు భాజపా సన్నాహాలు చేపట్టింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో సమస్యలు నివారించి- ఎక్కువ వార్డులు దక్కించుకునే కసరత్తు మొదలు పెట్టింది.

Published : 28 Jan 2022 01:29 IST

జగన్నాథభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో

సదానందగౌడ, బొమ్మై, కటీల్‌ తదితరులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల నిర్వహణకు భాజపా సన్నాహాలు చేపట్టింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో సమస్యలు నివారించి- ఎక్కువ వార్డులు దక్కించుకునే కసరత్తు మొదలు పెట్టింది. ఇతర పార్టీల మద్దతు లేకుండానే ఎక్కువ సీట్లు పొందాలనే కోణంలో వ్యూహరచనకు పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో నాయకులు తలమునకలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సూచించిన వెంటనే ఎన్నికలను రానున్న నాలుగు నెలల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల తేదీని ప్రకటించేందుకు ముందుగానే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు. విధానసభ ఎన్నికల సమయంలో నగరంలో ఎక్కువ సీట్లు గెల్చుకునేందుకు పాలికెలో సాధించిన విజయమూ గీటురాయిగా మారనుంది. ఇప్పటికే నగరం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులతో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఒక విడత చర్చలు జరిపారు. స్థానిక అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం, ప్రచారాన్ని చేపట్టడం, అభ్యర్థులకు రాష్ట్ర స్థాయిలోనే ఆమోద ముద్ర వేయడం తదితర అంశాలను పార్టీ నేతలు కటీల్‌కు సూచించారు. వలస వచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానించారు. మంత్రులు గోపాలయ్య, ఎస్‌.టి.సోమశేఖర్‌, మునిరత్న, భైరతి బసవరాజు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం మంది అభ్యర్థులను వారు సూచించిన వారికే ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, స్థానికుల అభిప్రాయాలను సేకరించాలని కటీల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కించుకోలేక ముఖ్యమంత్రి బొమ్మై కొంత వెనుకంజలో ఉన్నారు. పాలికె ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించి, మళ్లీ పార్టీపై తన పట్టు నిలుపుకోవాలని కోరుకుంటున్నారు. కటీల్‌, ఇతర నాయకులతో గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నగరంలో భాజపాకు చక్కని పట్టుందని బొమ్మై పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నారు. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఇతర పార్టీలతో పోల్చితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భాజపాకే ఉన్నారని గుర్తు చేశారు. బెంగళూరుకు మెట్రో, కావేరి, సబ్‌ అర్బన్‌ రైలు, రహదారి విస్తరణలు, ఇతర అభివృద్ధి పనులు చేసిన ఘటన భాజపాకే దక్కుతుందని బొమ్మై పేర్కొన్నారు. వార్డుల విభజన పూర్తయితే.. 240 వార్డులకు లేకపోతే 198 వార్డులకే ఎన్నికలు ఉంటాయని సూచన ప్రాయంగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని