logo

కల్యాణ వేదిక.. శ్మశాన మౌనం

మరికొన్ని గంటలు గడిస్తే.. అక్కడ కల్యాణ వైభోగమే! విధి వారిపై చిన్నచూపుచూసింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రిసెప్షన్‌కు సింగారించిన మల్లెలు ఇంకా తాజాగా ఉండగానే అవి శాశ్వతంగా వాడిపోయేలా పెళ్లి నిలిచిపోయింది.

Published : 22 May 2022 01:55 IST

ఆత్మీయుల మృతితో శోకసంద్రం

తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుని శిథిలమై మిగిలిన జీపు ఇదే

ధార్వాడ, న్యూస్‌టుడే : మరికొన్ని గంటలు గడిస్తే.. అక్కడ కల్యాణ వైభోగమే! విధి వారిపై చిన్నచూపుచూసింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రిసెప్షన్‌కు సింగారించిన మల్లెలు ఇంకా తాజాగా ఉండగానే అవి శాశ్వతంగా వాడిపోయేలా పెళ్లి నిలిచిపోయింది. రిసెప్షన్‌లో వధువు తరఫున ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి ఇక్కడికి సమీపంలోని బెనకనకట్టెకు వెళ్తుండగా ఆ వాహనం అదుపుతప్పి బాడ గ్రామం వద్ద రోడ్డు పక్కగా ఉన్న చెట్టును ఢీకొంది. ఫలితంగా ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు. పదకొండు మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్జితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినా.. ప్రాణానికి ముప్పేమీ లేదని తేలింది. వర్షాకాలం కావడంతో వధువు నివాసం ఎదుట వివాహాన్ని నిర్ణయించినా సమస్యగా ఉంటుందని చివరి నిమిషంలో సమీపంలోని కల్యాణ మంటపానికి మార్చారు. అందుకు తగినట్లుగానే కల్యాణ మంటపంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భాజాభజంత్రీలను పురమాయించారు. కల్యాణ మంటపాన్ని నయనానందకరంగా ఉండేలా సింగారింంచారు. పెళ్లి ఘడియలు జీవితకాలం పాటు గుర్తుండిపోయేలా ఆ సందర్భాల్ని క్లిక్‌మనిపించేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను సిద్ధం చేశారు. తెల్లారితే (శనివారం ఉదయం) వివాహం. రిసెప్షన్‌ విందు పూర్తవగానే పెళ్లికి అవసరమైన వంటకాల్ని సిద్ధం చేయడంలో వంటవాళ్లు పాకశాలలో కుస్తీపడుతున్నారు. అదే సమయంలోనే నిర్ఘాంతపోయేలా వినిపించిన వార్త అక్కడి వారిని కుప్పకూలేలా చేసింది. రిసెప్షన్‌కు వచ్చిన బంధువుల్లో తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని.. ఇతరులు పెద్ద సంఖ్యలోనే క్షతగాత్రులుగా మారారని సమాచారం అందింది. ఆ వార్త అందడమే తరువాయి.. అప్పటి వరకు కొనసాగిన పెళ్లి ఏర్పాట్లు ఆగిపోయాయి. సంతోషంగా అటూఇటూ సంచరించాల్సిన ముత్తైదువులు తలలు పట్టుక్కూర్చున్నారు. వధువు తల్లిదండ్రులు వెంటనే తేరుకుని పెళ్లి ఎప్పుడు జరుగుతుందోననే అనుమానంతో కల్యాణ మంటపాన్ని ఖాళీ చేసి తమ వస్తువుల్ని తీసుకెళ్లారు. శనివారం ఉదయం పది గంటల సమయంలో కల్యాణ మంటపాన్ని చూడగానే అక్కడ ఖాళీ కుర్చీలు మినహా మరే ఏర్పాట్లూ కనిపించలేదు.

ప్రమాదంలో సన్నిహితులను, ఆత్మీయులను కోల్పోయిన వరుడు మంజునాథ్‌ తీవ్రంగా కుంగిపోయారు. ధార్వాడ సమీపంలోని నిగది గ్రామంలో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రమాదం గురించి ఆయన నోట మాట పెగల్లేదు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కిమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణం బంధువుల రోదనలతో హృదయ విదారకంగా మారింది.

ధార్వాడ జిల్లా పోలీసు అధికారి కృష్ణకాంత్‌ ఇతర ఉన్నతాధికారులు దుర్ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి శంకర పాటీల మునేనకొప్ప పరామర్శించారు.

అతివేగం వద్దని వారించాను. శరవేగంగా వెళ్లడం మంచిది కాదని తాను డ్రైవర్‌ను వారించినట్లు వాహనంలో మూడో వరుసలో కూర్చున్న మహాదేవి హులమని అనే బంధువు తెలిపారు. తాను ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రైవర్‌ వినలేదని వాపోయారు. భీకర శబ్దం వినిపించిందని.. ఆపై ఏమి జరిగిందో తనకు తెలియదన్నారు. స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నానని వివరించారు.

వరుడు మంజునాథ్‌ మాట్లాడుతూ రిసెప్షన్‌కు తమ గ్రామం నుంచి వివిధ వాహనాల్లో 40 మంది బంధువులు వెళ్లామని, అనుకోని దుర్ఘటన సంభవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరయ్యారు. తాము ముందు బయలుదేరిన వాహనంలో క్షేమంగా ప్రయాణించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని బాడ గ్రామానికి వెళ్తే ఆ ప్రాంతమంతా తమవారి శవాలు కనిపించాయని వాపోయారు.

ధార్వాడ తాలూకా బాడ గ్రామం వద్ద క్రూసర్‌ జీపు చెట్టును

ఢీకొనడంతో గాయపడిన వారికి హుబ్బళ్లి ఆస్పత్రిలో వైద్యసేవలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని