logo

అమరం.. ఆ ప్రేమకావ్యం

అవును వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంతవరకూ వీరి ప్రేమకావ్యం సజావుగా కొనసాగిందని భావించేలోపే.. యువతి కుటుంబ సభ్యుల రూపంలో విధి మరోలా చూసింది. ఫలితంగా వారి ప్రేమకు అడ్డుకట్టపడడంతో ప్రియుడు లేని జీవితం వ్యర్థం అనుకుని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంది.

Updated : 22 May 2022 12:35 IST

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : అవును వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంతవరకూ వీరి ప్రేమకావ్యం సజావుగా కొనసాగిందని భావించేలోపే.. యువతి కుటుంబ సభ్యుల రూపంలో విధి మరోలా చూసింది. ఫలితంగా వారి ప్రేమకు అడ్డుకట్టపడడంతో ప్రియుడు లేని జీవితం వ్యర్థం అనుకుని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియుడు కూడా ఆమెలేని జీవితమెందుకని అనుకున్నాడు. అతని ఆచూకీ ఆరునెలలుగా కనిపించలేదు. అతడి మోటార్‌ సైకిల్‌ను మాత్రం గుర్తించారు. శుక్రవారం సాయంత్రం అడవుల్లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి. ఆరా తీయగా.. అది ఆనాటి ప్రియుడిదేనని నిర్ధారణకు వచ్చారు. ఇక వివరాల్లోకెళ్తే.. తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా అరమనె హొన్నమచనహళ్లికి చెందిన సంతోష్‌ (28) అనే యువకుడు బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. కుణిగల్‌ తాలూకాకు చెందిన శాలిని అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమికులు. వీరి ప్రేమ పెళ్లివరకూ వెళ్లింది. అందుకు ప్రియురాలి పెద్దలు అడ్డుకున్నారు. ప్రియుడు లేని జీవితం తనకు అవసరంలేదని శాలిని ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సంతోష్‌ బెంగళూరు నుంచి హుటాహుటిన గ్రామానికి వచ్చి మోటార్‌ సైకిల్‌ను అక్కడే ఉంచి హులియూరు దుర్గ అడవుల్లోకి వెళ్లి అత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో మోటార్‌ సైకిల్‌ను గుర్తించిన పోలీసులకు ఇతర వివరాలు పూర్తిగా తెలియలేదు. శుక్రవారం సాయంత్రం హులియూరు దుర్గ అడవుల్లోని బండరాళ్ల నడుమ అస్థిపంజరాన్ని గుర్తించినట్లు స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దాన్ని పరిశీలించి ఆరు నెలల కిందట అదృశ్యమైన సంతోష్‌దేనని తేల్చారు. హులియూరు దుర్గ పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.

కొసమెరుపు : ఆనాడు వీరిద్దరి వివాహాన్ని అడ్డుకున్న ప్రియురాలి తల్లి కూడా ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని