logo

నిలువునా ముంచిన నిర్లక్ష్యం : కుమార

నగరంలో భాజపా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ప్రభుత్వం ఎక్కువ నిధులు విడుదల చేసింది. వాటిని చక్కగా వినియోగించుకోవడంలో ఆ నేతలు చతికలపడ్డారు. ఫలితంగా వాననీరు ఇళ్లను నిలువునా ముంచుతోంది’ అని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్వజమెత్తారు.

Published : 22 May 2022 01:55 IST

స్థానిక గృహిణి గోడు ఆలకిస్తున్న కుమారస్వామి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ‘నగరంలో భాజపా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ప్రభుత్వం ఎక్కువ నిధులు విడుదల చేసింది. వాటిని చక్కగా వినియోగించుకోవడంలో ఆ నేతలు చతికలపడ్డారు. ఫలితంగా వాననీరు ఇళ్లను నిలువునా ముంచుతోంది’ అని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్వజమెత్తారు. వర్షంతో సమస్యలు ఎదుర్కొంటున్న యలహంక, హెబ్బాళ, బ్యాటరాయనపుర నియోజకవర్గాల్లోని పలు వార్డులను ఆయన శనివారం సందర్శించారు. కొందరు బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. నగరం పరిధిలో ఏడుగురు మంత్రులు ఉన్నా.. ఒక్కరూ బాధితులకు వెన్నుదన్నుగా నిలవలేదని తప్పుపట్టారు. కేవలం కమీషన్ల కోసమే అధికార పార్టీ నేతలు పని చేస్తున్నట్లుందని ఆరోపించారు. పలు వార్డుల్లో వీధి దీపాలు లేవని, రహదారులపై తారు కొట్టుకు పోయిందని చెప్పారు. అభివృద్ధి పనుల్లో తేడా చూపించడం దేశద్రోహానికి సమానమని అన్నారు. ఈ పర్యటనతో తనకు ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ యలహంక’ దర్శనం అయ్యిందని వ్యాఖ్యానించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే, దేశ ద్రోహులంటూ పెడబొబ్బలు పెట్టడాన్ని భాజపా మానుకోవాలని హితవు పలికారు. ఆదివారం కేఆర్‌పురం, రాజరాజేశ్వరినగరలో పరిస్థితులను సమీక్షిస్తానని తెలిపారు. బ్రాండ్‌ బెంగళూరును కాపాడుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ రాసిన లేఖను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్రోశించారు. మాజీ ఎమ్మెల్సీలు టి.ఎ.శరవణ, రమేశ్‌ గౌడ, పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌.ప్రకాశ్‌, యలహంక విభాగం దళ్‌ అధ్యక్షుడు కృష్ణప్ప తదితరులు కుమారతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని