logo

ఇనుప ఖనిజం ఎగుమతికి అనుమతి

బళ్లారి, చిత్రదుర్గం, తుమకూరు జిల్లాల నుంచి ఇనుప ఖనిజం ముడిసరకు ఎగుమతికి అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో గనుల ఖిల్లా అఖండ బళ్లారి జిల్లాలో మళ్లీ ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. 2011లో కేంద్రం సిఫార్సు మేరకు ఈ మూడు జిల్లాలో గనుల కార్యకలాపాలను సుప్రీం కోర్టు నిలిపివేసింది

Published : 22 May 2022 01:55 IST

కార్మికులకు ఉపాధి అవకాశాలు

సండూరులోని ఓ గనుల ప్రాంతం (పాతచిత్రం)

హొసపేటె, న్యూస్‌టుడే : బళ్లారి, చిత్రదుర్గం, తుమకూరు జిల్లాల నుంచి ఇనుప ఖనిజం ముడిసరకు ఎగుమతికి అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో గనుల ఖిల్లా అఖండ బళ్లారి జిల్లాలో మళ్లీ ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. 2011లో కేంద్రం సిఫార్సు మేరకు ఈ మూడు జిల్లాలో గనుల కార్యకలాపాలను సుప్రీం కోర్టు నిలిపివేసింది. సుమారు 11ఏళ్ల అనంతరం ఇప్పుడు ఎగుమతికి అవకాశం ఇవ్వడంతో బళ్లారి జిల్లాలో గనుల కార్యకలాపాలు రెక్కలు తొడగనున్నాయి. ఎగుమతి, తవ్వకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాజ పరివర్తన సంఘం ప్రతినిధులు సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేశారు. కర్ణాటకలో గనుల అవినీతిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని 2011లో అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఆదేశాలు ఇవ్వడంతో తనిఖీ సమితిని నియమించింది. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం లోకాయుక్త న్యాయమూర్తి సంతోష్‌ హెగ్డే నుంచి కర్ణాటకలో జరిగిన గనుల అక్రమాలపై తనిఖీ చేయించింది. ఇరు బృందాలు ఇక్కడ జరిగిన అక్రమాల్ని నివేదిక రూపంలో సమర్పించడంతో 2011లో ఈ మూడు జిల్లాలో గనుల కార్యకలాపాలను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. ఇక్కడి ముడిసరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు ఎగుమతి చేయకూడదన్న గట్టి నిబంధనలను సుప్రీంకోర్టు విధించింది. ఈ పరిణామాలతో బళ్లారి జిల్లాలో గనులపై ఆధారపడ్డ సుమారు 5 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వందలాది టిప్పర్లు, గనుల లారీలు మూలనపడ్డాయి. జిల్లా ఆర్థిక పరిస్థితిపై కోలుకోలేని దెబ్బ పడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డారు.

కేంద్రం నియమాలు పాటించాల్సిందే..

బళ్లారి, చిత్రదుర్గం, తుమకూరు జిల్లాలోని గనులను ఏ, బీ, సీ శ్రేణులుగా విభజించారు. ఇందులో ఏ శ్రేణి గనులు 45, బీ శ్రేణి 70గా, సీ శ్రేణి 51గా కేంద్రం తేల్చిచెప్పింది. ఏ, బీ శ్రేణి గనులకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. సీ శ్రేణి గనుల్లోనే ఎక్కువ అక్రమాలకు పాల్పడిందని తేల్చి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ గనులకు సంబంధించి జరిగిన అక్రమాల్లో చాలా మంది ప్రజాప్రతినిధులు జైలుపాలై, నేటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. గనుల మూతతో కర్ణాటకలో ఉక్కు ఉత్పత్తి పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లక్రితం సుప్రీంకోర్టుకు విన్నవించుకోగా, పునరుద్ధరణ, పునర్నిర్మాణ (ఆర్‌అండ్‌ఆర్‌) పనులను పడక్బందీగా పూర్తి చేసిన వారికి మళ్లీ అనుమతి ఇవ్వొచ్చని కోర్టు తేల్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం బళ్లారి జిల్లాలో 25 దాకా గనులు మళ్లీ నడుస్తున్నాయి. సీ శ్రేణి గనులను ప్రభుత్వం వేలం వేయడంతో జిందాల్‌, ఎమ్మెస్పీఎల్‌ సంస్థలు వాటిని దక్కించుకున్నాయి. గనుల విస్తీర్ణం మేరకు వాటికి వార్షికంగా ఇంతే మెట్రిక్‌ టన్నుల ఖనిజం తవ్వి తీయాలని నిబంధనలు విధించారు. కానీ సరకును ఇండియాలోనే విక్రయించాలన్న గట్టి నిబంధనలు అమలు చేశారు. 2011కన్నా పూర్వం ఇక్కడి ముడిసరకు చైనాకు తరలివెళ్లేది. సుప్రీం కోర్టు కొరడా అనంతరం దేశం దాటలేదు. ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేయవచ్చని నిబంధనలను సడలించారు. ఎగుమతిలో కేంద్ర ప్రభుత్వ నియమాలను పాటించాలని సూచించింది.

విదేశాలకు తరలింపు తేలికైన పనికాదు..

‘ప్రస్తుతం మన దేశంలోనే టన్ను ముడి సరకు రూ.3 నుంచి రూ.5వేల దాకా నాణ్యతనుబట్టి విక్రయిస్తున్నారు. ఇప్పుడు విదేశాలకు ఎగుమతికి అనుమతి ఇచ్చారు. రాజస్వం, పన్నులను చెల్లించి విదేశాలకు తరలించడం అంత సులభం కాదు. ఇప్పుడు చైనాలో కూడా ఇక్కడి ఇనుప ఖనిజానికి అంతగా డిమాండు లేదు. ఎగుమతికి అనుమతి ఇవ్వడం సంతోషదాయకమే. కానీ తరలింపులో పలు ఇబ్బందులు ఉన్నాయని హొసపేటెలోని ఓ ప్రముఖ గనుల సంస్థ ఇంజినీరు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఇక్కడి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని