logo

Telangana: ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్‌ విలువ పెంపు

స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెంచేందుకు నిర్ణయించింది.

Updated : 16 Jun 2024 08:35 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెంచేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సబ్‌రిజిస్ట్రార్లు, రెవెన్యూ  అధికారులతో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా భూముల బహిరంగ మార్కెట్‌ విలువ వివరాలు సేకరిస్తోంది. 

మార్గదర్శకాలు ఇలా...: వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువ మదింపు చేసి ఎంతమేరకు పెంచాలనే నిర్ణయాధికారాన్ని సంబంధిత అధికారులకే ప్రభుత్వం అప్పగించింది.  వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని బహిరంగ మార్కెట్‌ విలువలో కనీసం 40 నుంచి 50 శాతం వరకైనా పెంచాలని సూచించింది. ఉదాహరణకు కొణిజర్లలో రోడ్డు పక్కన ఎకరం సాగు భూమి రూ.3 కోట్లు బహిరంగ మార్కెట్‌లో పలుకుతుంటే అదే గ్రామంలో రోడ్డుకు దూరంగా ఉన్న మరో సర్వే నంబర్‌లో ఎకరం ధర రూ.40 లక్షలకు క్రయవిక్రయాలు జరుగుతుంటే ప్రభుత్వ ధర ఎకరానికి రూ.20 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉంది. అదే భూమికి ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.8-10 లక్షలు మాత్రమే ఉంది. ఎక్కువ రేటుకు కొనుగోలు చేసిన వారు తక్కువగా ఉన్న ప్రభుత్వ ధరకు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు రాసుకుని రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది.

  • భూముల మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచటం ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు అధికంగా లభించే  అవకాశం ఉంది. భూమి విలువ ఆధారంగా బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలు రైతు పరపతిని నిర్ణయిస్తాయి.  ఆగస్టు 1 నుంచి పెంచిన మార్కెట్‌ విలువ అమలులోకి వస్తుందని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ శనివారం  ఉత్తర్వులు జారీ చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని