logo

పోలీసులకు చెబితే ఫోన్‌లోని వీడియోలు వైరల్‌ చేస్తా.. చెమటలు పట్టిస్తున్న దొంగ

ఇల్లెందులో ఓ దొంగ అపహరణకు వెళ్లిన క్రమంలో డబ్బులు ముట్టడం లేదు. బంగారాన్ని తాకటం లేదు. కేవలం చరవాణులే అతని లక్ష్యం.. ఖర్చులకు, జల్సాలకు డబ్బులు లేకపోవడంతో కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నాడు.

Updated : 25 Jun 2024 09:33 IST

జేకే కాలనీలో కార్మికుడి ఇంటి గోడపై ఇలా ఫోన్‌ నంబర్‌ రాసి వెళ్లాడు..

ఇల్లెందు, న్యూస్‌టుడే: ఇల్లెందులో ఓ దొంగ అపహరణకు వెళ్లిన క్రమంలో డబ్బులు ముట్టడం లేదు. బంగారాన్ని తాకటం లేదు. కేవలం చరవాణులే అతని లక్ష్యం.. ఖర్చులకు, జల్సాలకు డబ్బులు లేకపోవడంతో కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నాడు.. అందరూ ఇంట్లో ఉన్న క్రమంలోనే చోరీలు చేస్తున్నాడు.. సింగరేణి కార్మిక కుటుంబాలు నివసించే ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీని లక్ష్యంగా ఎంచుకుని స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.

స్థానికుని పనేనా?

నిత్యం కార్మిక వాడల్లో సంచరిస్తూ ఏ ఇంటికి తాళం ఉంది? ఏ ఇంట్లో వారు తలుపులు తెరిచి పడుకుంటున్నారు? ఏ ఇంట్లో కార్మికులు విధులకు వెళ్లి వస్తున్నారు? అనే అంశాలను పసిగడుతున్నారు. అదును చూసి చోరీ చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన స్థానిక సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన యువకుడే చోరీలకు పాల్పడుతున్నట్లు కార్మిక కుటుంబాలు అనుమానిస్తున్నారు. ఇటీవల ఘటనలో సీసీ కెమెరా వీడియోల్లో చూసిన వ్యక్తి, కార్మిక వాడలో ఉండే వ్యక్తి ఒకే పోలికతో ఉన్నారని గతంలో ఫిర్యాదు చేసిన బాధితులంటున్నారు. ఇంత జరుగుతున్నా అటు సింగరేణి సెక్యూరిటీ అధికారులు, పోలీసులు స్పందించకపోవటం గమనార్హం.

చిత్రవిచిత్రంగా..

  •  స్థానిక జేకే కాలనీలో ఎమ్మెల్యే, అధికారుల క్వార్టర్లకు సమీపంలో ఓ కార్మికుని క్వార్టర్‌లో నెల రోజుల క్రితం ఓ మహిళ చరవాణి దొంగలించాడు. బాధితులు చరవాణికి ఫోన్‌ చేస్తే స్పందించి, ‘చరవాణి కావాలంటే పోలీసులకు చెప్పొద్దని, చెబితే అందులో ఉన్న మీ వీడియోలను వైరల్‌ చేస్తానం’టూ బెదిరించాడు. మరుసటి రోజు బాధితులకు ఫోన్‌ చేసి చరవాణి కావాలంటే రూ.3వేలు తీసుకుని అర్ధరాత్రి కళాంజలి సినిమా ధియేటర్‌ వద్దకు రావాలని తెలిపాడు. ఆ రోజు వెళ్తే రాలేదు. రెండో రోజు ఫోన్‌ చేసి బాధితురాలు ఒక్కరే రావాలని చెప్పాడు. చివరకు ఓ యువకునికి నైటీ వేయించి మహిళలా పంపించారు. దొంగ రెప్పపాటు వేగంతో రూ.3వేలు తీసుకుని చరవాణి ఇచ్చి పారిపోయాడు. బాధితులు ప్రారంభంలోనే తమ ఇంటి ముందున్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
  •  రెండు నెలల క్రితం ముసుగు ధరించి జేకే కాలనీ అయ్యప్పస్వామి ఆలయం ఏరియాలో ఓ కార్మికుడి ఇంట్లో దొంగతనానికి యత్నించాడు. కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో పారిపోయాడు.
  •  మూడు రోజుల క్రితం సీఈఆర్‌ క్లబ్‌ పక్కన ఉన్న సింగరేణి కార్మికుడి ఇంట్లో చరవాణి దొంగలించాడు. పౌచ్‌లో ఏటీఎం, ఆధార్‌ ఉండటంతో మరుసటి రోజు ఎవరి కంటపడకుండా ఆ రెండింటినీ కార్మికుడి ఇంట్లో పడేసి ఇంటి గోడపై ‘ఓన్లీ వాట్సప్‌ కాల్‌’ అని ఫోన్‌ నంబర్‌ రాసి వెళ్లిపోయాడు. ఈ విషయమై కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిఘా పటిష్ఠం

- బత్తుల సత్యనారాయణ, సీఐ, ఇల్లెందు

దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. చరవాణి దొంగతనాలు మా దృష్టికి వచ్చాయి. విచారణ చేపడుతున్నాం. గతంకంటే పెట్రోలింగ్‌తోపాటు, బీట్‌లు పెంచాం. చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవరైనా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేసేలా చర్యలు చేపడుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని