logo

సిక్కా గ్యాంగ్‌?

ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా సుదీర్ఘ రైలుమార్గం వెళ్తోంది. అన్ని రాష్ట్రాల ప్రయాణికులు దేశ నలుమూలలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు పరుగెడుతుంటాయి.

Published : 17 Jun 2024 05:16 IST

చింతకాని రైలు దోపిడీ వీరి పనేనా? 
చింతకాని, న్యూస్‌టుడే

1. ఖమ్మం-విజయవాడ ప్రధాన రైలు మార్గంలో, చింతకాని స్టేషన్‌ సమీపంలో గత బుధవారం అర్ధరాత్రి బీదర్, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లలో దోపిడీలు జరిగాయి. అర్ధరాత్రి దాటాక సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్‌ చేసిన దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారం ప్రయాణికుల వద్దనున్న బంగారం, నగదు దోచుకున్నారు. 


2. చింతకాని మండలం పందిళ్లపల్లి సమీపంలో ఐదేళ్ల క్రితం దుండగులు అర్ధరాత్రి ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపారు. ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.

మ్మడి ఖమ్మం జిల్లా మీదుగా సుదీర్ఘ రైలుమార్గం వెళ్తోంది. అన్ని రాష్ట్రాల ప్రయాణికులు దేశ నలుమూలలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు పరుగెడుతుంటాయి. కానీ, ఇటీవల చింతకాని రైల్వేస్టేషన్‌ సమీపంలో అర్ధరాత్రి రెండు రైళ్లు ఉన్నట్టుండి నిలిచిపోయాయి. కొద్ది క్షణాల్లోనే రిజర్వేషన్‌ బోగీల్లో గడబిడ మొదలైంది. ‘దొంగా.. దొంగా’ అని బాధితులు అరిచేలోపే దుండగులు చేతివాటం ప్రదర్శించి పారిపోయారు. ఐదేళ్ల క్రితమూ ఇలాంటి ఘటన ఇదే ప్రాంతంలో మరొకటి చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్రంతో పాటు పొరుగు జిల్లా ఉమ్మడి వరంగల్‌ పరిధిలోనూ ఈ తరహా దోపిడీలు జరిగాయి. వీటి వెనుక ఓ ముఠా హస్తం ఉన్నట్లు రైల్వే పోలీసుల విచారణలో తేలింది. అదే.. ‘సిక్కా గ్యాంగ్‌’. దీని కన్ను చింతకాని వంటి ప్రాంతంపైనా పడిందా? అంటే.. పోలీసులు అవుననే చెబుతున్నారు. 

ఏమిటీ గ్యాంగ్‌?

రైళ్ల రాకపోకల నియంత్రణలో సిగ్నలింగ్‌ వ్యవస్థ కీలకం. పట్టాల మార్గంలో ఏర్పాటు చేసే సిగ్నల్స్‌ ఆటోమేటిక్‌ సెన్సార్‌ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. సిగ్నల్‌ లైట్లు వెలిగే స్తంభానికి ముందుభాగంలో, రెండు పట్టాల మధ్యనున్న ఖాళీ ప్రదేశం వద్ద సెన్సార్‌ పరికరాలుంటాయి. రెడ్‌ సిగ్నల్‌తో ఆగిన ఏదైనా రైలు అక్కడ్నుంచి ముందుకు కదలగానే తదుపరి సూచిక (రెడ్‌ నుంచి గ్రీన్, లేదా యెల్లో) దానంతట అదే మారుతుంది. అక్కడి పట్టాల మధ్యనున్న ఖాళీలో ఏదైనా రూపాయి వంటి నాణేన్ని ఉంచినా సెన్సార్‌ స్పందించి రెడ్‌ సిగ్నల్‌ పడేలా చేస్తుంది. ఇలా రూపాయి, రెండు రూపాయాల నాణెలతో సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి నిర్మానుష్య ప్రదేశాల్లో అంతర్రాష్ట్ర ముఠాలు దోపిడీలకు పాల్పడుతున్నాయి. నాణేన్ని ఉర్దూలో సిక్కా అంటారు. అందుకే ఈ ముఠాలకు ‘సిక్కా గ్యాంగ్‌’ పేరుపడినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఇటీవల చింతకాని వద్ద కూడా ఇలాంట ముఠానే రెండు రైళ్లల్లో దోపిడీలకు పాల్పడింది. లోకోపైలెట్లు స్టేషన్‌ మాస్టర్, జీఆర్పీ బలగాలను అప్రమత్తం చేసేలోపే దుండగులు జారుకున్నారు.

ఇక్కడే ఎందుకు? 

సిక్కా గ్యాంగ్‌లు షోలాపూర్‌(మహారాష్ట్ర), మీర్జాపూర్‌ (యూపీ), రాంచీ (జార్ఖండ్‌), తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలుగా రైల్వేశాఖ పోలీసులు గుర్తించారు. ఒక్కో ముఠాలో అయిదారుగురు ఉంటారు. వీరు పక్కా ప్రణాళిక ప్రకారం దోపిడీ చేస్తారు. ఎంచుకున్న రైళ్లు, అవి వెళ్లే మార్గంలో రెక్కీ చేస్తారు. రోడ్డు పక్కనే రైలుమార్గం, సిగ్నల్స్‌ ఉన్న నిర్మానుష్య ప్రాంతం వీరి లక్ష్యంగా ఉంటుంది. ముందు స్టేషన్లలోనే కొందరు ప్రయాణికులుగా ఎక్కుతారు. ఘటనా స్థలంలో ఉన్నవారు రైలు ఆపగానే  రిజర్వేషన్‌ బోగీల్లోకి చొరబడతారు. అందరూ కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం లక్షిత ప్రయాణికులను దోచుకుంటారు. బలగాలు అప్రమత్తమై రైలును ముందుకు కదిలించేలోపే కిందకు దూకేస్తారు. పక్కనే రోడ్డు మార్గంలో సిద్ధంగా ఉండే కార్లు, ద్విచక్రవాహనాలపై పారిపోతారు. వారెళ్లే మార్గాల్లో పోలీస్‌ స్టేషన్లు, సీసీ కెమెరాలు వంటివి లేకుండా జాగ్రత్తపడుతున్నట్లు విచారణల్లో తేలింది. విజయవాడ-ఖమ్మం రైలుమార్గంలోనున్న చింతకాని వద్ద కూడా పట్టాల వెంటే పొడవైన రోడ్డు మార్గం ఉంది. ఇక్కడ్నుంచి ఖమ్మం, బోనకల్లు, వైరా మార్గాల్లో ఏపీ వైపు సులువుగా పారిపోవచ్చు. అందుకే దుండగులు ఈ ప్రాంతాన్ని ఇటీవల లక్ష్యం చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఖాజీపేట డివిజన్, ఏపీలోనూ సిక్కా గ్యాంగ్‌ దోపిడీలు బుధవారాల్లోనే జరగడం విశేషం.


ప్రత్యేక బృందాలను పంపించాం.. 

- ఎ.వెంకటేశ్వర్లు, జీఆర్పీ, సీఐ

చింతకాని వద్ద రైళ్ల దోపిడీ అంతర్రాష్ట్ర ముఠా పనే. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను మహారాష్ట్రకు పంపించాం. ‘దోపిడీలను బుధవారమే చేస్తారు?’ అనేది వదంతే. ఈ ముఠాలకు వారాలతో పనిలేదు. ఇటీవలి ఘటనలు కాకతాళీయంగా జరిగిఉండొచ్చు. రైళ్ల దోపిడీలో అయిదారుగురు పాల్గొన్నట్లు గుర్తించాం. రాత్రి వెళ్లే రైళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. త్వరలో దుండగులను పట్టుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని