logo

ప్లాస్టిక్‌ ఉపద్రవం!

కిలో కూరగాయలు కొన్నా.. డజను అరటి పండ్లు తీసుకున్నా.. కిరాణా దుకాణంలో సరకులు తెచ్చుకునేందుకు వెళ్లినా ఇంటికి తిరిగొచ్చేది మాత్రం ప్లాస్టిక్‌ సంచులతోనే.

Published : 17 Jun 2024 05:11 IST

ఉమ్మడి జిల్లాలోని పురపాలకాల్లో తనిఖీలు నామమాత్రం
పాల్వంచ, న్యూస్‌టుడే

కిలో కూరగాయలు కొన్నా.. డజను అరటి పండ్లు తీసుకున్నా.. కిరాణా దుకాణంలో సరకులు తెచ్చుకునేందుకు వెళ్లినా ఇంటికి తిరిగొచ్చేది మాత్రం ప్లాస్టిక్‌ సంచులతోనే. అవీ.. నిషేధిత ఉత్పత్తులు? రెండేళ్ల క్రితమే కేంద్రం వీటిని నిషేధించినా ప్లాస్టిక్‌ మహమ్మారి మాత్రం సాధారణ జీవనం నుంచి సమసిపోవడం లేదు. పైగా, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో టన్నుల్లో వాడకం పెరుగుతుండటం పుడమి తల్లికి పుట్టెడు కష్టాల్ని కొనితెస్తోంది. తూతూమంత్రపు తనిఖీలు, అనామతు జరిమానాలు, కానరాని జనచైతన్య కార్యక్రమాలు వెరసి.. పురపాలకాలు, నగరాల్లో ఏటా టన్నుల్లో నిషేధిత ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అవి డ్రైనేజీల్లో గుట్టలుగా పేరుకుని ప్రవాహాలకు అడ్డునిలుస్తున్నాయి. 

ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు పురపాలకాల్లో నిషేధిత ప్లాస్టిక్‌ (సింగల్‌ యూజ్డ్‌) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వాటి వాడకం ఏటా రెట్టింపు అవుతోంది. పట్టణాల్లోంచి ప్రవహించే వాగులు, డ్రైనేజీల్లో వ్యర్థాల్ని అడ్డగోలుగా పారబోస్తున్నారు. ఇవి వర్షాకాలంలో ప్రవాహాలకు అడ్డుగా నిలిచి ముంపు బెడద తీవ్రమవుతోందని బాధిత ప్రాంతాల వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఉత్పత్తి, విక్రయాలను కట్టడి చేయాలని కోరుతున్నా పట్టింపు లేకుండా పోతోంది. కొందరు స్థానిక డీలర్లు నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథిన్‌ సంచులను హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి అక్రమమార్గంలో దిగుమతి చేసుకుంటున్నారు. ఆ తర్వాత గుట్టుగా రిటైల్‌ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఫలితంగా రోడ్డు పక్కన చిరువ్యాపారుల నుంచి దుకాణాల వరకు రోజురోజుకు ప్లాస్టిక్‌ సంచుల వినియోగం పెరిగిపోతోంది. వీటిల్లో చాలావరకు 120 మైక్రాన్ల మందం లోపు ఉత్పత్తులే. 

ప్రత్యామ్నాయమే పరిష్కారం

ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్‌ వస్తువుల వాడకాన్ని పురవాసుల్లో అలవాటు చేయాలని గత ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. బల్దియాల్లో గతేడాది సెప్టెంబరు నుంచి ‘మెప్మా’ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బంధన్‌ (స్టీల్‌) బ్యాంకులను ఏర్పాటు చేయించింది. ఇవి చిన్నచిన్న శుభకార్యాలకు సరిపడా పాత్రలు, గ్లాస్లులు సరఫరా చేస్తున్నాయి. ఈ బ్యాంకులను అవసరాలకు సరిపడా ఏర్పాటు చేయకపోవడం, పట్టణాల్లో అవగాహన లేకపోవడంతో ఆశించిన మార్పు కనిపించడం లేదు. ఫలితంగా కార్యమేదైనా ప్లాస్టిక్‌ పేపరు, గ్లాసులు, ప్లేట్లు, కప్పులు, ఫోర్క్‌లు, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్, స్ట్రాలు, ట్రేలు వంటివి విచ్చలవిడిగా వాడుతున్నారు. ఉత్పత్తులేవైనా 120 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందం ఉన్నవాటినే వాడాలని, వాటిపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోదంతో కూడిన ముద్ర తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధన అమలుతో పాటు నిషేధిత ఉత్పత్తుల దిగుమతులు, సరఫరాపై ఉన్నతాధికారులు ఇకనైనా దృష్టిసారించాలి. పుర యంత్రాంగాలు తనిఖీలు ముమ్మరం చేసి జరిమానా విధించాలి. స్వచ్ఛంద సంస్థలను నార, వస్త్ర సంచుల పంపిణీ దిశగా ప్రోత్సహించాలి. గతంలో స్టీల్‌ డబ్బాలతో వచ్చే వినియోగదారులకు మాంసం వ్యాపారులు రాయితీలివ్వడం విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసే వ్యాపారులకు పురపాలకాలు గుర్తింపు కల్పించాలి. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు, ‘స్వచ్ఛ అంబాసిడర్లు’ తదితరుల సాయంతో ప్లాస్టిక్‌ దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ, పునర్వినియోగ ప్లాంట్ల నిర్వహణపై దృష్టిసారించడం ఎంతో అవసరం. 


ఎక్కడ చూసినా.. నిర్లిప్తతే

మ్మం, పాల్వంచ పట్టణాల్లో మినహా మిగతాచోట్ల చెప్పుకోదగిన స్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదు. నాలుగు పురపాలకాల్లో కనీసం పైసా జరిమానా విధించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి, 2023 నుంచి ఏడాది కాలంలో పరిశీలిస్తే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 713 తనిఖీలు చేపట్టారు. వీటిల్లో 23.40 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం రూ.8.57 లక్షల జరిమానా విధించారు. తనిఖీల్లో జరిమానా వాత విధిస్తారనే భయం లేకపోవడంతో వాడకం అడ్డగోలుగా పెరిగిపోతోందన్న వాదన వినిపిస్తోంది. 


‘నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయించరాదని వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తాం. ఆకస్మిక తనిఖీలు పెంచుతాం. భారీ జరిమానా విధిస్తాం. రెండోసారి పట్టుబడితే చట్ట ప్రకారం వ్యాపార లైసెన్స్‌లు రద్దు చేస్తాం. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేధించి వచ్చే జులై నాటికి రెండేళ్లు కావస్తోంది. ఆయా ఉత్పత్తుల కట్టడికి పాల్వంచ పట్టణంలో ఒక ప్రత్యేక బృందం పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుంది.’ 

ఎ.స్వామి, పురపాలక కమిషనర్, పాల్వంచ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని