logo

మనవరాలి మరణం తట్టుకోలేక నానమ్మ మృతి

చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న గారాలపట్టి, తన మనవరాలి మరణాన్ని తట్టుకోలేక పోయింది. పాప స్మృతులనే నాలుగు రోజుల నుంచి తలుచూకుంటూ అన్నపానీయాలు మాని ఏడ్చింది.

Updated : 17 Jun 2024 05:10 IST

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న గారాలపట్టి, తన మనవరాలి మరణాన్ని తట్టుకోలేక పోయింది. పాప స్మృతులనే నాలుగు రోజుల నుంచి తలుచూకుంటూ అన్నపానీయాలు మాని ఏడ్చింది. తన మనవరాలు లేనిచోట తానుండలేనంటూ ఒక్కసారిగా ఇంటి ఎదుట కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రేగులగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

రేగులగూడెం గ్రామానికి చెందిన ఆలెం రాంబాబు, లక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక (15). జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలోని ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న క్రమంలో పది రోజుల క్రితం టైఫాయిడ్‌ బారినపడింది. కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో చికిత్స అందించినా లాభం లేకపోయింది. ప్రవళిక చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. పాపను చిన్నతనం నుంచి నాయినమ్మ పాపక్క(50) అల్లారుముద్దుగా పెంచింది. హాస్టల్‌ నుంచి ఇంటికొస్తే ఈమెతోనే గడిపేది. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మనవరాలిపై ఆపేక్ష పెంచుకుంది. ప్రవళిక చనిపోయిన నాటినుంచి పాపక్క మానసికంగా కుంగిపోయింది. బంధువులు ఎంత వారించినా వినలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఇంటి ముందు కుప్పకూలి పడిపోయింది. కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని