logo

నేడు, రేపు సింగరేణిలో మెడికల్‌ బోర్డు

సింగరేణిలో ‘మెడికల్‌ బోర్డు’ను సోమ, మంగళవారాల్లో కొత్తగూడెంలోని ఆ సంస్థ ప్రధాన వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. బోర్డు నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 17 Jun 2024 02:37 IST

పారదర్శకతతోనే ఆరోపణలకు అడ్డుకట్ట పడేది?
కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే

సింగరేణిలో ‘మెడికల్‌ బోర్డు’ను సోమ, మంగళవారాల్లో కొత్తగూడెంలోని ఆ సంస్థ ప్రధాన వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. బోర్డు నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరాం పలు చర్యలు చేపట్టారు. ఆయన సూచనతో బోర్డు నిర్వహణకు రెండు వారాల ముందునుంచే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), నేర పరిశోధక విభాగా(సీఐడీ)లు రంగంలోకి దిగాయి. సింగరేణి ఏరియాల్లోని సంబంధిత కార్యాలయాల్లో సోదాలు చేపట్టాయి. పాత దస్త్రాలను జల్లెడపడుతున్నాయి. గతంలో ఏమైనా అక్రమాలు జరిగినా తవ్వితీయడంతో పాటు, తాజాగా నిర్వహించే బోర్డులో పారదర్శకత పాటించేలా ఆయా బృందాలు నిఘా పెట్టాయి. ఎవరైనా దోషులను గుర్తిస్తే వారిపై క్రిమినల్‌ చర్యలకు వెనకాడేది లేదని ఇప్పటికే సీఎండీ స్పష్టం చేశారు. రెండేళ్ల లోపు పదవీకాలం మాత్రమే ఉన్న 120 మంది కార్మికులు నేటినుంచి జరగనున్న మెడికల్‌ బోర్డుకు హాజరవుతున్నారు. వీరి వివరాలను నిఘా బృందాలు సైతం పరిశీలించాయి. ఎవరైనా ప్రలోభపెడుతున్నారా? అనే కోణంలో అధికారులు కన్నేసి ఉంచారు.

వైద్యులపై పర్యవేక్షణే ముఖ్యం 

తాజా మెడికల్‌ బోర్డు రెండ్రోజులు కొనసాగుతుంది. తొలిరోజు సోమవారం దరఖాస్తు చేసుకొన్న కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటి నివేదికలపై వైద్య నిపుణుల సమక్షంలో రెండోరోజు మంగళవారం నిర్ణయం తీసుకుంటారు. బోర్డుకు సంబంధించిన వైద్య నిపుణులు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి హాజరవుతారు. గతంలో కొందరు దళారులు వీరి వివరాలను ముందే సేకరించి ఆరోగ్యంగా ఉన్న కార్మికులనూ అన్‌ఫిట్‌ జాబితాలో చేర్పించారనే ఆరోపణలున్నాయి. కొందరు కార్మికులు తమ వారసులకు ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతో రూ.లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు నిపుణులను బయటి వారెవరూ ప్రభావితం చేయకుండా రెండ్రోజుల పాటు పటిష్ఠ నిఘా కొనసాగించేలా వాదన వినిపిస్తోంది. కార్మికుల జాబితాపై గోప్యత పాటించడంతో పాటు, బోర్డు నిర్వహణ సమయంలో ఎలాంటి చీటీలు అందకుండా, ఫోన్లు దగ్గరలేకుండా చూడాలన్న డిమాండ్‌ కూడా ఉంది. ఒక్కో వైద్యుడు కేవలం ముగ్గురు, నలుగురికే పరీక్షలు చేసే అవకాశం ఉన్నందున వారి పేర్లను సులభంగా గుర్తుంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సీఎండీ ఎన్‌.బలరాం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ మెడికల్‌ బోర్డును పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఎవరైనా దళారులు ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని