logo

అంటుమామిడి చిరునామా లోక్యాతండా

కూసుమంచి మండలంలోని లోక్యాతండా పేరు వినగానే అంటుమామిడి మొక్కల ఉత్పత్తి గుర్తొస్తుంది.. సుమారు 30 మంది యువ రైతులు ఏళ్లుగా ఈ మొక్కలను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

Published : 17 Jun 2024 02:41 IST

కూసుమంచి, న్యూస్‌టుడే 

కూసుమంచి మండలంలోని లోక్యాతండా పేరు వినగానే అంటుమామిడి మొక్కల ఉత్పత్తి గుర్తొస్తుంది.. సుమారు 30 మంది యువ రైతులు ఏళ్లుగా ఈ మొక్కలను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఏటా సుమారు కోటిన్నర మొక్కలు ఉత్పత్తవుతున్నాయి.. గత ఏడాది పరిశ్రమ నష్టాల బాటలో నడిచినా ఈ ఏడాది కలిసొస్తుందనే ఆశతో రైతులు ముందుకు సాగుతున్నారు.

వందల మందికి ఉపాధి..

నర్సరీల్లో మట్టి తరలింపు మొదలు టెంకలు ఎండబెట్టడం, వాటిని నీటితో శుభ్రపర్చడం, పాకెట్లలో మట్టి నింపడం, టెంకలు నాటడం, మొక్కలు మొలకెత్తిన తర్వాత కవర్లలో కలుపు తీయడం, నీరందించడం, 45 రోజుల వయసు వచ్చిన వాటికి అంటు కట్టడం లాంటి పనులన్నీ అంటు మామిడి ప్రక్రియలో భాగం. కూలీల అవసరం ఎక్కువ. సుమారు 600 మంది దశలవారీగా నాలుగు నెలలపాటు పనుల్లో పాల్పంచుకుంటారు. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మంది ఇతరచోట్ల మొక్కలు అంటుగట్టే కూలీపనులకు వెళ్తున్నారు. 

పరిశ్రమలో ఒడుదొడుకులు..

అంటు మామిడి పరిశ్రమ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఇందులోనూ దళారీ వ్యవస్థ మొదలైంది. మొక్కలు విక్రయించిన తర్వాత నెలల తరబడి వీరు పైకం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. లక్ష మొక్కల పెంపకం చేపట్టే నర్సరీ నిర్వాహకుడు కనీసం రూ.10-12 లక్షలు పెట్టుబడి పెడతారు. ధర, సకాలంలో చెల్లింపు పూర్తయితే ఇబ్బంది ఉండదు. ఏదిఏమైనా ఈ ఏడాది కోటిన్నర మొక్కల ఉత్పత్తి లక్ష్యంగా రైతులు ముందుకు సాగుతున్నారు.


ఇతర జిల్లాల నుంచి దిగుమతి..

లోక్యాతండా నర్సరీ నిర్వాహకులు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి మామిడి టెంకలను దిగుమతి చేసుకుంటారు. ఆ ప్రాంతాల్లో ఆంచూర్‌ పరిశ్రమల్లో బస్తా టెంకలను రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తారు. వాటిని శుభ్రపర్చి మట్టి నింపిన పాలిథిన్‌ కవర్లలో ఉంచి పెంపకం చేపడతారు. 45 రోజులు దాటిన మొక్కలకు ఇతర నాణ్యమైన చెట్ల నుంచి సేకరించిన కొమ్మలను అంటుగడతారు. నాణ్యమైన కాయల్ని ఉత్పత్తి చేసే తోటల్లోనుంచి కొమ్మలు కొనుగోలు చేసి వాటిని పుల్లలుగా మల్చుకొని అంటుగడుతుంటారు. 2 నుంచి 3 నెలల పోషణ తర్వాత వాటిని విక్రయిస్తారు. రెండు రాష్ట్రాల్లోని పెద్ద నర్సరీ నిర్వాహకులు లేదా పలు కంపెనీల ప్రతినిధులు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని