logo

రైలు ప్రయాణం మరింత సులభం

రైలులోని సాధారణ (జనరల్‌) బోగిల్లో టిక్కెట్‌ తీసుకోవడం కష్టసాధ్యంగా ఉండేది. సికింద్రాబాద్, విజయవాడ, కాజీపేట్‌ వంటి పెద్ద స్టేషన్లలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఉంటారు.

Published : 17 Jun 2024 02:46 IST

అవగాహన కల్పిస్తున్న రైల్వే అధికారులు
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే

రైలులోని సాధారణ (జనరల్‌) బోగిల్లో టిక్కెట్‌ తీసుకోవడం కష్టసాధ్యంగా ఉండేది. సికింద్రాబాద్, విజయవాడ, కాజీపేట్‌ వంటి పెద్ద స్టేషన్లలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. వరుసలో నిలబడి టికెట్‌ తీసుకోవడం సమయం పట్టడంతోపాటు శ్రమతో కూడుకున్న పని. దీన్ని గుర్తించి జనరల్‌ టికెట్‌ పొందేందుకు పలు విధానాలను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూటీఎస్‌ యాప్, ఏటీవీఎం యంత్రం, క్యూఆర్‌ కోడ్‌ విధానాలతో సులభంగా టిక్కెట్‌ పొందే అవకాశం ఉంది.


1. అపరిమితం...

యూటీఎస్‌(అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సిస్టం) రైల్వే అధికారిక యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు జియో ఫెన్సింగ్‌ సిస్టం ఉండేది. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని 5 కిలో మీటర్ల పరిధిలోనే పనిచేసే వీలుండగా.. ప్రస్తుతం ఆ పరిధి పరిమితిని ఎత్తివేశారు. ఇటీవల యాప్‌ను అప్‌డేట్‌ చేసి పలు కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు. ఇతరులకు సైతం టిక్కెట్‌ బుక్‌ చేయవచ్చు. చెల్లింపుల్లో యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 


2.ఏటీవీఎం

టీవీఎం(ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మెషిన్‌) విధానంతో బుకింగ్‌ కేంద్రం వద్ద క్యూ లైన్‌లో నిలబడకుండా టిక్కెట్‌ తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో రెండు విధాలుగా జనరల్‌ టిక్కెట్‌ను పొందవచ్చు. రైల్వే శాఖ నుంచి స్మార్ట్‌కార్డు తీసుకొని రీఛార్జి చేసుకోవాలి. ప్రతి రీఛార్జికి 3 శాతం బోనస్‌ వస్తుంది. ప్రయాణించాల్సిన రైల్వేస్టేషన్‌ 150 కిలోమీటర్లు పరిధిలో ఉంటే బోనస్‌ వర్తిస్తుంది. నేరుగా కార్డును ఏటీవీఎం యంత్రంలో పెట్టి రైలు, ప్రయాణికుని వివరాలను నమోదు చేసి జనరల్‌ టిక్కెట్‌ను పొందవచ్చు. రెండో విధానంలో రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఏటీవీఎం యంత్రంలో నేరుగా బుక్‌ మై టిక్కెట్‌ ఆప్షన్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేసి క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు చేసి టిక్కెట్‌ పొందవచ్చు. 


3. క్యూఆర్‌ కోడ్‌ విధానం

సాధారణ కౌంటర్‌లో జనరల్‌ టిక్కెట్‌ తీసుకునే సమయంలో చిల్లర ఇబ్బందులను తొలగించేందుకు క్యూఆర్‌ కోడ్‌ విధానంతో అందుబాటులోకి తెచ్చారు. బుకింగ్‌ కేంద్రంలోని ఉద్యోగికి రైలు పేరు, ఎక్కడికి వెళ్తున్నామో చెబితే ఆయన వివరాలు నమోదు చేస్తారు. ఎల్‌ఈడీ తెరపై సంబంధిత క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. అంతర్జాల విధానాలు, ఫోన్‌పే, జీపే వంటి యాప్‌ల ద్వారా సదరు మొత్తం చెల్లిస్తే టిక్కెట్‌ ఇస్తారు.


అవగాహన కల్పిస్తున్న అధికారులు

నరల్‌ టిక్కెట్‌ తీసుకునే ఆధునిక విధానాలపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. యూటీఎస్‌ యాప్, ఏటీవీఎం యంత్రం, క్యూఆర్‌ కోడ్‌ విధానాలను ప్రయాణికులకు తెలియజేస్తూ చరవాణిలోనే సులభంగా జనరల్‌ టిక్కెట్‌ పొందవచ్చని చెబుతున్నారు. మొబైల్‌లో ఇన్‌స్టాల్, రిజిస్ట్రేషన్, టిక్కెట్‌ బుకింగ్‌ విధానం, చెల్లింపులు వంటి అన్ని అంశాలపై క్షుణ్ణంగా వివరిస్తున్నారు. రోజులో 8 గంటల చొప్పున ఉదయం నుంచి రాత్రి వరకు ఓ ఉద్యోగిని కేటాయించి ప్రత్యేకంగా ప్రయాణికులకు వివరిస్తున్నట్లు ఖమ్మం రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీ.జాఫర్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని