logo

పాఠశాలల పర్యవేక్షణ ఎలా?

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించే బాధ్యుల కొరత వేధిస్తోంది. పూర్తిస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు లేకపోవటంతో కొందరు ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Published : 17 Jun 2024 02:48 IST

ఖమ్మం విద్యావిభాగం, కూసుమంచి, న్యూస్‌టుడే 

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించే బాధ్యుల కొరత వేధిస్తోంది. పూర్తిస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు లేకపోవటంతో కొందరు ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 90శాతం మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులుగానూ వారు వ్యవహరిస్తున్నారు. 

  • జిల్లాలో 21 మండలాలు ఉండగా, వీటన్నింటి బాధ్యతలను తొమ్మిది మంది ఎంఈఓలే చూస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు మండలాల బాధ్యతలు అప్పగించారు. కాగా, ఖమ్మం అర్బన్, సత్తుపల్లిలో పనిచేసే వారు మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా, మిగతావారంతా ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
  • కూసుమంచి ఎంఈఓ బీవీ రామాచారి నేలపట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన తిరుమలాయపాలెం, ముదిగొండ ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • ఖమ్మం గ్రామీణం ఎంఈఓ శ్యాంసన్‌ జలగంనగర్‌ పాఠశాల హెచ.ఎం. ఆయన గ్రామీణంతోపాటు చింతకాని, కొణిజర్ల మండలాల విద్యాధికారిగా వ్యవహరిస్తున్నారు.
  • వైరా మండలం పాలడుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.వెంకటేశ్వర్లు వైరాతోపాటు బోనకల్లు, కామేపల్లి ఇన్‌ఛార్జి ఎంఈఓగా పనిచేస్తున్నారు. 
  • తల్లాడ మండలం అన్నారుగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామోదర్‌ ప్రసాద్‌ తల్లాడతోపాటు కల్లూరు విద్యాధికారిగా వ్యవహరిస్తున్నారు.
  • వేంసూరు మండలం కల్లూరిగూడెం హెచ్‌.ఎం.వెంకటేశ్వరరావు పెనుబల్లి బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. 
  • మధిర పట్టణం టీవీఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.ప్రభాకర్‌ మధిరతోపాటు ఎర్రుపాలెం ఎంఈఓగా పనిచేస్తున్నారు.
  • ఏన్కూరు, కారేపల్లి మండలాల బాధ్యత మోస్తున్న దుగ్గిరాల జయరాజు కారేపల్లి మండలం పేరేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.
  • ఖమ్మం అర్బన్‌ రెగ్యులర్‌ ఎంఈఓ ఎం.శ్రీనివాస్‌ రఘునాథపాలెం బాధ్యతలు చూస్తున్నారు.
  • సత్తుపల్లి రెగ్యులర్‌ ఎంఈఓ బి.రాములుకు పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి బాధ్యతలు అప్పగించారు. సత్తుపల్లి, నేలకొండపల్లి మధ్య దూరం 105 కిలోమీటర్లు. పర్యవేక్షణ ఎలా సాధ్యమనేది ఉన్నతాధికారులకే తెలియాలి.

‘జిల్లాలో ఎంఈఓల కొరత ఉంది. ప్రతీ మండలానికి ఇన్‌ఛార్జి ఎంఈఓలను నియమించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సూచనలిచ్చారు. త్వరలో వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తాం.’

సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని