logo

ధరణి దరఖాస్తులకు మోక్షం

ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు, భూయజమానుల కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి.

Updated : 18 Jun 2024 06:46 IST

ఈటీవీ, ఖమ్మం: ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు, భూయజమానుల కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి. ‘ధరణి’లో కోకొల్లలుగా ఉన్న భూసమస్యలకు సత్వరం పరిష్కార మార్గం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించటంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రెవెన్యూ యంత్రాంగం రంగంలోగి దిగింది. సుమారు 27వేల భూసమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి. మరోవైపు దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించటంతో పాటు పాత దస్త్రాలను పరిశీలించాలని రెవెన్యూశాఖ అధికారులు యోచిస్తున్నారు. 

ఆర్డీఓలు, తహసీల్దార్లకు లాగిన్‌ సౌకర్యం

‘ధరణి’ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి జూన్‌ నెలాఖరు వరకు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. గతంలో ‘ధరణి’    సమస్యలు పరిష్కరించే అధికారం కలెక్టర్లకు మాత్రమే ఉండేది. వేల సంఖ్యలో అర్జీలు వస్తున్న నేపథ్యంలో జాప్యం జరుగుతోందని గుర్తించిన సర్కారు.. ఆర్డీఓలు, తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌ లాగిన్‌ సౌకర్యం కల్పించింది. ప్రధానంగా జీఎల్‌ఎం, టీఎం-33, మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, నిషేధిత జాబితాలోని భూములు, వారసత్వ భూములు, నాలా కన్వర్షన్, ఎన్నారైల భూములు, కోర్టు కేసుల్లోని భూములు తదితరాల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ఆర్డీఓలు, తహసీల్దార్లు కూడా భుజానికెత్తుకున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్‌ జోరుగా సాగుతోంది. కొన్ని మండలాల్లో ఇప్పటికే భూసమస్యలు పరిష్కరించి కలెక్టర్‌కు నివేదికలు పంపించారు. పెండింగ్‌ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసేందుకు కలెక్టరేట్‌తోపాటు ఆర్డీఓ, తహసీల్‌ కార్యాలయాల్లో డ్యాష్‌ బోర్డులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏరకమైన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు డ్యాష్‌ బోర్డుల ద్వారా వెల్లడవుతాయి. పెండింగ్‌కు గల కారణాలను తెలియజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెలాఖరు వరకు పెండింగ్‌ దరఖాస్తులన్నింటికీ పరిష్కార మార్గం చూపాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఆతర్వాత మరోసారి భూసమస్యలపై దరఖాస్తులు కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పెండింగ్‌లో ఇంకొన్ని మాత్రమే..

భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, భూయజమానుల నుంచి ఖమ్మం జిల్లాలో 1.20లక్షలు, భద్రాద్రి జిల్లాలో 40వేల దరఖాస్తులు అందాయి. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు వరకు ‘ధరణి’లో భూసమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. తొలి, మలిదఫాల్లో ఖమ్మం జిల్లాలో సుమారు 1.06 లక్షలు, భద్రాద్రి జిల్లాలో 26వేల దరఖాస్తులను పరిష్కరించింది. ఈలోగా శాసనసభ ఎన్నికలు రావటంతో భూసమస్యల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. ఉభయ జిల్లాల్లో సుమారు 28వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా వీటిలో కొన్నింటిని అధికారులు పరిష్కరించగా, మరికొన్నింటిని తిరస్కరించారు. ఇంకొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యలనూ ఈనెలాఖరు వరకు పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని