logo

ఆ రోజు పుస్తకాలొద్దు.. ఉత్సాహం ఉరకలెత్తాలి!

ఆటపాటలతో ఆనందంగా సాగాల్సిన పసిడిరెక్కల బాల్యం స్కూల్‌ బ్యాగ్‌ల మోతలతోనే అణగారిపోతోంది. పెరిగి పెద్దవారవుతున్న క్రమంలో మెడ, వెన్నునొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వెన్నాడుతున్నాయి.

Updated : 18 Jun 2024 06:52 IST

ఆటపాటలతో ఆనందంగా సాగాల్సిన పసిడిరెక్కల బాల్యం స్కూల్‌ బ్యాగ్‌ల మోతలతోనే అణగారిపోతోంది. పెరిగి పెద్దవారవుతున్న క్రమంలో మెడ, వెన్నునొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఈనేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యాశాఖ 2020లో స్కూల్‌ బ్యాగ్‌ విధానం తీసుకొచ్చింది. ప్రతి విద్యాసంవత్సరంలో కనీసం పది రోజులు పిల్లలు స్కూల్‌ బ్యాగ్‌ లేకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని ఆదేశించింది. పిల్లల బరువులో స్కూల్‌ బ్యాగ్‌ పది శాతం మించొద్దని నిర్దేశించింది. ప్రతి మూడు నెలలకోసారి స్కూల్‌ బ్యాగ్‌లను తూకం వేసేందుకు పాఠశాలల్లో డిజిటల్‌ యంత్రం సమకూర్చుకోవాలని సూచించింది. అయితే చాలా పాఠశాలల్లో ఈవిధానం అమలుకావటం లేదు. మార్కులు, ర్యాంకులపై దృష్టిసారించే తల్లిదండ్రులు తమ పిల్లల ‘బరువు’ బాధ్యతలను విస్మరిస్తున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. 


28 కార్యకలాపాలు చేపట్టాలని..

ప్రతినెలా నాలుగో శనివారం ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ పాటించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆరోజు ఏం చేయాలనే దానిపై బుక్‌లెట్‌ను ఎస్‌సీఈఆర్‌టీ విడుదల చేసింది. పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, 28 కార్యకలాపాలు చేపట్టాలని నిర్దేశించింది. వీటిలో ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, నీతి కథలు, శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు ఉన్నాయి. క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా చారిత్రక ప్రదేశాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మ్యూజియమ్స్‌ను సందర్శించాలి. కృత్రిమ మేధ, నమూనా అసెంబ్లీ, పార్లమెంట్, నమూనా ఎన్నికలు, ధ్వన్యనుకరణ తదితర సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టాలి.

ఇతర రాష్ట్రాల్లో.. 

తమిళనాడులో ఫిబ్రవరి 26న పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’గా పాటిస్తున్నారు. ఏపీలో ప్రతినెలా మొదటి, మూడో శనివారాల్లో ఈవిధానాన్ని అమలుచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, కర్నాటక, మణిపూర్, రాజస్థాన్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ప్రతినెలా ఓ శనివారం ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’గా నిర్వహిస్తున్నారు. పంజాబ్‌లోని ఓ పాఠశాలలో పిల్లలకు ట్రంకు పెట్టెలు ఇస్తారు. అవి తరగతి గదుల్లో నిర్దేశిత ప్రాంతాల్లో ఉంటాయి. వారి పుస్తకాలన్నింటినీ వాటిలోనే పెట్టాలి. బెంగుళూరులో పిల్లల పుస్తకాలు డెస్కుల్లో ఉంటాయి. పిల్లలు హోం వర్కులన్నీ పాఠశాలల్లోనే చేసుకుంటారు. ట్యూషన్లు ఉండవు. స్కూల్‌ బ్యాగ్‌ లేకుండానే పాఠశాలలకు పిల్లలు వస్తారు.  

తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి. పుస్తకాలు ఎక్కువగా ఉంటే తమ పిల్లలు గొప్పగా చదువుకుంటారని అనుకుంటున్నారు. అలాంటి పాఠశాల కూడా గొప్పదని భావిస్తున్నారు. మోసే పుస్తకాలకు చదివే చదువులకు సంబంధమే ఉండదు. ఇటీవల క్వశ్చన్‌ బ్యాంకులనూ తీసుకెళ్తున్నారు. ఇవి మరింత భారంగా మారుతున్నాయి.
- పి.శ్రీనివాసరావు, విద్యావేత్త, ఖమ్మం 


విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయటమే నిజమైన విద్య. అది కేవలం పుస్తకాల వల్ల రాదు. సర్వతోముఖ ప్రక్రియల ద్వారానే విద్యార్థుల్లో సృజనాత్మకతలు వెల్లివిరుస్తాయి. అందులో భాగమే ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’. ఆరోజు ప్రత్యేకంగా సృజనశీలత   కార్యక్రమాలు నిర్వహించాలి.
- కొండవీటి గోపి వరప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు, మల్లెలమడుగు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు