logo

నమోదులో లోపాలే శాపాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం అర్హులందరికీ అందటం లేదు. డేటాఎంట్రీ సందర్భంగా ఆపరేటర్లు చేసిన తప్పిదాలు అర్హుల పాలిట శాపంగా మారాయి.

Updated : 18 Jun 2024 06:26 IST

‘ఎడిట్‌’ ఆప్షన్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ‘గృహజ్యోతి’ అర్హులు

దరఖాస్తు అందించేందుకు కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన అర్హులు 

కూసుమంచి, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం అర్హులందరికీ అందటం లేదు. డేటాఎంట్రీ సందర్భంగా ఆపరేటర్లు చేసిన తప్పిదాలు అర్హుల పాలిట శాపంగా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని అర్హతలున్నా ఉభయ జిల్లాల్లో 200 యూనిట్ల లోపు విద్యుత్తును ఉచితంగా పొందే అవకాశం చాలామంది కోల్పోయారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. గతేడాది డిసెంబరు 8 నుంచి ఈ ఏడాది జనవరి 6 వరకు గ్రామగ్రామాన ప్రజాపాలన సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు పత్రాల్లో పథకాల లబ్ధి కోసం కేవలం ‘టిక్‌’ పెడితే చాలు అని చెప్పడంతో దరఖాస్తుదారులు అదే పనిచేశారు. 
పరిష్కారానికి వీలుందా?
డేటా ఎంట్రీ నమోదులో కొన్ని పొరబాట్లను చక్కదిద్దేందుకు ‘నాట్‌ మ్యాచింగ్‌’ ఆప్షన్‌ ఇవ్వడంతో సరిచేయగలుగుతున్నారు. ‘నాట్‌ అప్లయ్‌’ సమస్యతో అర్హత కోల్పోయిన దరఖాస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సమస్యతో లబ్ధి పొందలేకపోయిన వారికి ‘ఎడిట్‌’ ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో సిబ్బంది  చేతులెత్తేస్తున్నారు. ‘ఎడిట్‌’ ఆప్షన్‌ ఇస్తే తప్ప ఏమీ చేయలేమంటున్నారు. 

  • కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన బి.లింగమ్మ ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి పథకాల లబ్ధి కోసం టిక్‌ చేశారు. ఆమెకు గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రాకపోవడంతో అధికారులను సంప్రదించగా ‘నాట్‌ అప్లయ్‌’ అని ఉన్నట్లు గుర్తించారు. ‘ఎడిట్‌’ ఆప్షన్‌ ఇస్తే తప్ప ఆమె దరఖాస్తు సరిచేసే అవకాశం ఉండదు.
  • జీళ్లచెర్వుకు చెందిన అంబాల అరుణదీ ఇదే సమస్య. ఐదు గ్యారంటీల లబ్ధి కోరుతూ దరఖాస్తు చేసుకున్నా గృహజ్యోతికి ‘నాట్‌ అప్లయ్‌’ అని ఉండటంతో అర్హత సాధించలేకపోయారు. 
  • కొంతమంది మీ నెల విద్యుత్తు వినియోగం ఎంత? అంటూ అడిగిన ప్రశ్నకు 101 నుంచి 200 యూనిట్లు అంటూ ఎదురుగా ఉన్న బాక్సులో రైట్‌ గుర్తుతో టిక్‌ చేశారు. ప్రత్యేక కేంద్రంలో ఆరా తీస్తే.. టిక్‌ పెట్టిన అంశాన్ని ఆపరేటర్‌ పరిగణనలోకి తీసుకోకుండా ‘నాట్‌ అప్లయ్‌’ అంటూ నమోదు చేశారు.  

బహిర్గతమైన లోపాలు.. 

ఓవైపు గ్రామసభలు జరుగుతుండగానే అధికార యంత్రాంగం జనవరి 5 నుంచే దరఖాస్తుల డేటా ఎంట్రీ చేపట్టింది. ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారిని ఎంపిక చేసి  శిక్షణ ఇచ్చింది. ఆపరేటర్లు పొరపాట్లు నమోదు చేయడంతో చాలామందికి గృహజ్యోతి పథకం వర్తించటం లేదు. ‘టిక్‌’ గుర్తుతో పూరించినా ఆపరేటర్లు కొన్నింటికి ‘నాట్‌ అప్లయ్‌’ అని నమోదు చేశారు. లోటుపాట్లను గుర్తించిన సర్కారు మళ్లీ అవకాశం కల్పించేందుకు ఎంపీడీఓ కార్యాలయాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో నిలిచిపోయిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మళ్లీ మొదలైంది.
డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించాం. ‘నాట్‌ అప్లయ్‌’ అంటూ నమోదుచేయడంతో జీరో బిల్లుకు అర్హులు కాలేకపోయిన విషయం మాదృష్టికి వచ్చింది. ‘ఎడిట్‌’ ఆప్షన్‌ లేక వినియోగదారులు నష్టపోతున్న తీరును ఉన్నతాధికారులకు వివరించాం.
వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ, కూసుమంచి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని