logo

భారజలానిదే ఉజ్వల భవిష్యత్తు

దేశంలో న్యూక్లియర్, నాన్‌ న్యూక్లియర్‌ రంగాల్లో భారజలానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత హెవీవాటర్‌ బోర్డ్‌ ఛైర్మన్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌.సత్యకుమార్‌ అన్నారు.

Updated : 18 Jun 2024 06:25 IST

హెచ్‌డబ్ల్యూబీ ఛైర్మన్‌ ఎస్‌.సత్యకుమార్‌తో ముఖాముఖి  

అశ్వాపురం, న్యూస్‌టుడే: దేశంలో న్యూక్లియర్, నాన్‌ న్యూక్లియర్‌ రంగాల్లో భారజలానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత హెవీవాటర్‌ బోర్డ్‌ ఛైర్మన్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌.సత్యకుమార్‌ అన్నారు. నాన్‌ న్యూక్లియర్‌ రంగంలోని కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. అశ్వాపురం వచ్చిన సందర్భంగా గౌతమీనగర్‌లోని పర్ణశాల అతిథిగృహంలో ‘న్యూస్‌టుడే’తో సోమవారం ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

దేశానికే తలమానికంగా మణుగూరు భారజలం: భారజలం ఉత్పత్తిలో మణుగూరు, కోటా, థాల్, హజీరా ప్లాంట్లు దేశంలోనే కీలకం. మణుగూరు, కోటా ప్లాంట్లు హైడ్రోజన్‌ సల్ఫైడ్, థాల్, హాజీరా ప్లాంట్లు అమ్మోనియా ఆధారితమైనవి. మల్టీపుల్‌ టెక్నాలజీతో కూడిన ఈ ప్లాంట్లు ప్రపంచంలోనే అతిపెద్దవి. దేశీయ, ప్రపంచ అవసరాలను భారత భారజలమే తీర్చనుంది. భారజలం ఎగుమతి ద్వారా భారత భారజల బోర్డు చరిత్రలోనే గతేడాది అత్యధికంగా రూ.750 కోట్ల ఆదాయం సముపార్జించింది. భారజల ఎగుమతుల్లో 60 శాతం మణుగూరు నుంచి ఉంటోంది. మణుగూరు భారజల ప్లాంటు దేశానికే తలమానికంగా మారింది. 

త్వరలో విస్తరణ: ప్రస్తుతం 185 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మణుగూరు భారజల ప్లాంటును త్వరలోనే విస్తరిస్తాం. ప్రస్తుతం ఎక్ఛేంజ్‌-1, ఎక్ఛేంజ్‌-2 యూనిట్లు ఉండగా త్వరలో 100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఎక్ఛేంజ్‌-3 యూనిట్‌ నెలకొల్పనున్నాం. ఇక్కడి ఆక్సిజన్‌-18 ప్లాంట్‌ వందశాతం విజయవంతమైంది. పది కిలోల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌-18 ప్లాంటునూ విస్తరిస్తాం. 150 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల రెండు విభాగాలను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల నుంచి ఏటా 30- 40 లీటర్ల ఆక్సిజన్‌-18ను దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపై స్వయం సమృద్ధి సాధించటంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే దశకు చేరుకోబోతున్నాం. క్యాన్సర్‌ ట్రేసర్, క్యాన్సర్‌ నివారణకు ఆక్సిజన్‌-18 దోహదపడుతుంది. అంతర్జాతీయ విపణిలో దీనికి విపరీతమైన గిరాకీ ఉంది. డ్యూటీరియం డిప్లీటెడ్‌ వాటర్‌ ప్లాంటునూ మణుగూరు భారజల ప్లాంటులో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఇదీ క్యాన్సర్‌ నివారణకు ఉపకరిస్తుంది. 

పుష్కలంగా నిల్వలు: దేశంలో భారజలం నిల్వలకు కొరత లేదు. 23 న్యూక్లియర్‌ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. మరో 14 న్యూక్లియర్‌ రియాకర్లు నిర్మితమవుతున్నాయి. 2031-2032 వరకు వీటన్నింటికీ సరిపడా భారజలం నిల్వలు ఉన్నాయి. అమెరికా, దక్షిణకొరియా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు భారత్‌ నుంచి భారజలం ఎగుమతి అవుతోంది. అనేక దేశాలు భారత భారజలాన్ని న్యూక్లియర్, నాన్‌ న్యూక్లియర్‌ రంగాల్లో విశేషంగా వినియోగిస్తున్నాయి. నూతన ఔషధాల తయారీ, ఆప్టికల్‌ ఫైబర్‌ ఉత్పత్తి, ఆర్గానిక్‌ ఎల్‌ఈడీ తెరల్లో దీన్ని వాడుతున్నాయి. భారతదేశంలోని ప్రైవేటు సంస్థలకూ భారజలాన్ని విక్రయిస్తున్నాం. ఇప్పటివరకు రూ.450 కోట్ల ఆదాయం సమకూరింది. 

దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాజెక్టులు

న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లకు వినియోగపడే ద్రావకాలను ఉత్పత్తి చేసే విభాగాలను బరోడా, ట్యుటికోరిన్, థాల్చేరులో ఏర్పాటు చేయనున్నాం. బరోడాలో సోడియం ప్లాంట్‌ నెలకొల్పుతాం. ముంబయిలోని భారజలబోర్డు ఫెసిలిటీలో హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌లోని మిధాని నుంచి స్క్రాప్‌ తీసుకుని కోబాల్డ్, నికెల్, మోలిబ్డనం తదితర మూలకాలను తయారుచేసే ప్లాంట్‌ను ముంబయిలో నెలకొల్పుతాం. ఒడిశాలోని నాల్కోలో గాలియంను గ్రహించే ప్లాంట్‌ ఏర్పాటు చేస్తాం. సూరత్‌లో రోజుకు 150 కిలో లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే కర్మాగారాన్ని ఏడాది క్రితం నెలకొల్పాం. త్వరలోనే దాన్ని సూరత్‌ పురపాలికకు అప్పజెబుతాం. నాన్‌ న్యూక్లియర్‌ కార్యక్రమాల కింద సమాజ హితానికి వినియోగపడే కార్యక్రమాలకు భారజల బోర్డు శ్రీకారం చుట్టనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు