logo

వేర్వేరు ఘటనల్లో.. రూ.90 లక్షల గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ఘటనల్లో రూ.90 లక్షల విలువైన గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బి.రోహిత్‌రాజు తెలిపారు.

Published : 20 Jun 2024 02:07 IST

కొత్తగూడెం నేరవిభాగం, పాల్వంచ గ్రామీణం, టేకులపల్లి, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ఘటనల్లో రూ.90 లక్షల విలువైన గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బి.రోహిత్‌రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ జీసీసీ గోదాము వద్ద పాల్వంచ ఎస్సై రాఘవ తన సిబ్బందితో కలిసి సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న 202 కిలోల గంజాయి లభ్యమైంది. దీని విలువ రూ.50,55,000 ఉంటుంది. ఏపీలోని డొంకరాయి వద్ద శ్రీను అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసిన గంజాయిని.. జహీరాబాద్‌కు చెందిన మెగావత్‌ సర్దార్‌ రాథోడ్‌కు అప్పగించేందుకు తరలిస్తున్నట్లు నిందితుడు, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటకు మెగావత్‌ జైపాల్‌ అంగీకరించాడు.  

వెంకట్యాతండా వద్ద .. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన పెనుగొండ వెంకటరాజు, అదే జిల్లా దోమకొండ మండలం జనగాం గ్రామానికి చెందిన బోదాసు తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి మండలం పప్లూరు గ్రామంలో 158 కిలోల గంజాయి కొన్నారు. దాన్ని కారులో మహారాష్ట్రలోని షోలాపుర్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో టేకులపల్లి పోలీస్‌ సిబ్బంది మండలంలోని వెంకట్యాతండా వద్ద కారును సోదా చేశారు. అందులో 79 ప్యాకెట్లలో రూ.39.50 లక్షల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కి తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.


రామాలయ ప్రవరపై విచారణ పూర్తి

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ప్రవర నిర్వహణ తీరుపై ప్రత్యేక కమిటీ చేపట్టిన విచారణ పూర్తయింది. మంగళవారం ఇక్కడకు వచ్చిన ఐదుగురు సభ్యులు రెండ్రోజులపాటు సమగ్ర వివరాలను సేకరించారు. కల్యాణం చేసే విధానంలో తప్పులున్నాయని కొందరు భక్తులు కోర్టును ఆశ్రయించడంతో ఇందులో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్ద నిర్వహించే కల్యాణ క్రతువును చిత్రీకరించారు. స్థానాచార్యులు స్థలసాయి భక్తులకు ప్రవచనం చేస్తుండగా దీన్ని నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న రాముణ్ని ఓంకార రాముడని, వైకుంఠ రాముడని, రామ నారాయణుడు అని విశ్లేషించారు. ప్రవరలో భాగంగా అర్చకులు రోజూ చెప్పే గోత్రనామాలు మరోసారి వినిపించారు.  రెండ్రోజులపాటు ఇక్కడే ఉన్న దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కృష్ణవేణి ఏర్పాట్లను పర్యవేక్షించగా నిత్య కల్యాణంలో కమిటీ సభ్యులతోపాటు ఈఓ రమాదేవి పాల్గొన్నారు. విచారణ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.


ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

బూర్గంపాడు, న్యూస్‌టుడే: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సారపాకలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం పాతసారపాకకు చెందిన ఈశ్వర్‌రెడ్డి(74) భార్య పదేళ్ల క్రితం చనిపోయారు. ఆయన ఇద్దరు కుమారులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో ఈశ్వర్‌రెడ్డి ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపంతో బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు అదనపు ఎస్సై నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ఖమ్మం నేరవిభాగం: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం నగరం జయనగర్‌కాలనీ వద్ద బుధవారం జరిగింది. ఖానాపురం హవేలి ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ కథనం ప్రకారం.. ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారి వెంట ఉన్న ఓ భవనం నుంచి సామగ్రి తరలించేందుకు ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సిబ్బంది వచ్చారు. భవనానికి ఉన్న ఫ్లెక్సీని కిందకు దింపుతుండగా విద్యుత్తు తీగలు తాకాయి.  ప్రకాశ్‌నగర్‌కు చెందిన కూలీ మేస్త్రీ మదాసు రవి(35), మరో వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన రవిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఘటనాస్థలిని విద్యుత్తు సంస్థ ఏడీఈ సంజీవ్‌కుమార్‌ సందర్శించారు. అప్రమత్తంగా లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందన్నారు. భవనానికి విద్యుత్తు లైను ఏడు అడుగుల దూరంలో ఉందన్నారు. ఫ్లెక్సీని ఒకవైపు మాత్రమే కిందకు వదలడంతో ప్రమాదం సంభవించిందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే లైన్‌ ట్రిప్‌ అయ్యి విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పరిశీలించేందుకు రాగా ప్రమాద విషయం తెలిసిందని ఏడీఈ తెలిపారు.


వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

సత్తుపల్లి, న్యూస్‌టుడే: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి ఎన్టీఆర్‌నగర్‌లోని   బస్‌షెల్టర్‌లో సత్తిపండు అనే యాచకుడు ఉంటున్నాడు. వెంగళరావు శివారులో తిరుగుతున్న సత్తిపండును బుధవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతని శరీరం రెండుగా విడిపోయి నుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మున్సిపల్‌ పారిశుద్ధ్య     సిబ్బందితో మృతదేహాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రం శవాగారానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఖననం చేయించారు.  
రీ కిష్టారానికి చెందిన ఫౌండ్రీ కార్మికుడు వసంత కుటుంబరావు(55) ఈ నెల 14న వీఎం బంజర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కుటుంబరావు తీవ్రంగా గాయపడటంతో ఏపీలోని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని