logo

పాత్రికేయ వ్యవస్థను కాపాడుకోవాలి

పాత్రికేయ వృత్తిలో ఉన్నవారే వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌(ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అన్నారు.

Published : 20 Jun 2024 02:08 IST

ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: పాత్రికేయ వృత్తిలో ఉన్నవారే వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌(ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని  ఉషాహరి(అమర్‌నాథ్‌ ప్రాంగణం) కన్వెన్షన్‌లో బుధవారం ప్రారంభమైన రాష్ట్ర మహాసభల  ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతున్న వేళ పాత్రికేయుడి వృత్తి కత్తిమీద సాములా తయారయిందని, అందుకనుగుణంగానే నైపుణ్యం సాధించి, సమాజ మన్ననలు పొందాలన్నారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌.సిన్హా మాట్లాడుతూ... జర్నలిజం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, అనేక మంది పాత్రికేయులు భౌతికదాడులకు గురవుతున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు జర్నలిస్టులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. పాత్రికేయుల సభల నిర్వహణ బాధ్యత తనకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ... పాత్రికేయుల సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసని, గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలోని పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారని, ఏ కారణాలతో అది ఆగిందో తెలియదన్నారు. ఈ ప్రభుత్వమైనా వారికి న్యాయం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ... మారుతున్న సమాజంతో పాటు, జర్నలిజంలో, పాత్రికేయ వృత్తిలో మార్పులు రావాలన్నారు. 

నేడు భట్టి రాక: టీయూడబ్ల్యూజే(ఐజేయూ)మహాసభల్లో భాగంగా గురువారం రెండోరోజు నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు సంఘం నాయకులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, రాంనారాయణ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని