logo

దయచేసి వినండి.. అప్రమత్తంగా ఉండండి!

బస్సు ప్రయాణానికి రైలు ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైనా దిగి కాస్త ఆలస్యంగా వచ్చినా డ్రైవర్‌ బస్సు ఆపుతారు. కానీ రైలు అలా కాదు.

Published : 20 Jun 2024 02:12 IST

‘ఆపరేషన్‌ అమానత్‌’ పేరిట అవగాహన
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే

స్సు ప్రయాణానికి రైలు ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైనా దిగి కాస్త ఆలస్యంగా వచ్చినా డ్రైవర్‌ బస్సు ఆపుతారు. కానీ రైలు అలా కాదు. నిర్ణీత సమయంలో ప్రయాణికులు దిగి ఎక్కాలి. లగేజీ సరిగా ఉందా.. పిల్లలు ఎక్కారో లేదో వంటివి సరి చూసుకోవాలి. ఇలా రైలు ప్రయాణం సమయంలో అప్రమత్తంగా లేక చాలామంది విలువైన వస్తువులు పోగొట్టుకుంటున్నారు. వాటిని రైల్వే పోలీసులు రికవరీ చేసి తిరిగి అప్పగిస్తున్నారు. ఈ అంశంపై అవగాహన సైతం కల్పిస్తున్నారు.

వస్తువులు పోతే ఫిర్యాదు చేయండి

ప్రయాణికులకు రైలు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తితే ఖమ్మం ఆర్పీఎఫ్‌ స్టేషన్‌ను సంప్రదిస్తే తక్షణమే అధికారులు స్పందిస్తున్నారు. రైలులో ప్రయాణంలో వస్తువులు మరిచిపోయినా వేరే స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ఎవరైనా దొంగిలించినా స్పందించి రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేసేందుకు చర్యలు తీసుకుంటారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 139కు సమాచారం ఇస్తే ఇక్కడి అధికారులు అప్రమత్తమై రికవరీ చేసేందుకు కృషి చేస్తున్నారు. బాధితులు రాలేని పక్షంలో ఆయా ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో సంబంధిత ఆర్పీఎఫ్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వస్తువులను అందజేస్తారు.


జూన్‌ 6న మొగల్‌సరాయ్‌ నుంచి విజయవాడ వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న ఎ.భీష్మవతి చరవాణి ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలో ఖమ్మం రైల్వేస్టేషన్‌లో బయట పడిపోయింది. రైలు కదలడంతో వారు వెళ్లిపోయారు. అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అమిత్‌కుమార్‌ స్పందించి చరవాణిని రికవరీ చేసి తరువాత బాధితురాలికి అప్పగించారు.


మే 15న ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎక్కుతుండగా ప్రయాణికురాలు గాయత్రి హ్యాండ్‌ బ్యాగు కింద పడిపోయింది. విషయాన్ని డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక ఆర్పీఎఫ్‌ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు ఖమ్మం ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ స్పందించి ప్లాట్‌ఫాంపై ఉన్న మహిళ బ్యాగును భద్రపరిచి ఆమెకు అప్పగించారు. అందులో రూ.15,800 విలువైన బంగారం, వస్తువులు ఉన్నాయి.


తక్షణ స్పందన

భారతీయ రైల్వే సంస్థ 1 జనవరి 2024 నుంచి ‘ఆపరేషన్‌ అమానత్‌’ పేరుతో రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది. ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి రైలు ప్రయాణంలో, రైల్వేస్టేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. వస్తువులు పోగొట్టుకుంటే తక్షణమే స్టేషన్‌లో మైకులో అనౌన్స్‌ చేయిస్తున్నారు. స్టేషన్‌ ప్రాంగణంలోని ఎల్‌ఈడీ తెరపై, ప్లాట్‌ఫాంలు, రైళ్లలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైళ్లు వచ్చే సమయంలో ఆర్పీఎఫ్‌ సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నారు.


సకాలంలో స్పందించి సాయం అందిస్తున్నాం

- మిట్టకంటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఆర్పీఎఫ్‌ సీఐ

బాధితులు ఆర్పీఎఫ్‌ స్టేషన్‌ను సంప్రదిస్తే తక్షణమే వారికి సాయం అందేలా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నాం. రైలులో, రైల్వే పరిసర ప్రాంతాల్లో తమ వస్తువులను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే వెతికి బాధితులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని